ఏపీకి రానున్న ఫిల్మ్‌ ఇండస్ట్రీ? 

తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీలోనూ ఉండాలనేది ప్రజల చిరకాల కోరిక. అది నెరవేరేందుకు ఇప్పుడు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో ఆంధ్రాలో ఒక భారీ సినిమా స్టుడియో నిర్మాణం జరగనుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే 100 ఎకరాల్లో స్టుడియో ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


Published on: 25 Aug 2024 14:30  IST


తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయువు పట్టు ఆంధ్రా ప్రాంతం. సినిమా పరిశ్రమ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎందరో హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, ఆర్టిస్టులు, కళాకారులు ఈ ప్రాంతం నుంచి వెళ్లినవారే. ఇక్కడి నుంచి వెళ్లిన ఎంతో మంది చిత్ర ప్రముఖులుగా ఎదిగారు. కానీ దురదృష్టవశాత్తూ ఇక్కడ మాత్రం చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందలేదు. తొలి నాళ్లలో తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు పరిశ్రమతో కలిసి ఉండేది. కొన్నాళ్లకు మద్రాసులోనే అది స్థిరపడిపోయింది. తమిళనాడు నుంచి ఏపీ విడిపోయాక అనేక ప్రయత్నాల తర్వాత తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీని హైదరాబాద్‌కు తీసుకురాగలిగారు. దశల వారీగా మద్రాసు నుంచి హైదరాబాద్‌కి చిత్ర పరిశ్రమ తరలివచ్చి స్థిరపడింది. 2014లో రాష్ట్రం మళ్లీ విడిపోవడంతో తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణలోనే ఉండిపోయింది. 

ఈ పరిస్థితుల్లో ఆంధ్రా ప్రాంతంలో తెలుగు చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనే డిమాండ్‌ బలంగా వినిస్తోంది. కొన్నాళ్ల క్రితం విశాఖ సినీ పరిశ్రమకు అనువైన ప్రాంతమని భావించి రామానాయుడు స్టుడియో నిర్మాణానికి ప్రయత్నించారు. అయితే రకరకాల కారణాల వల్ల అది పూర్తిస్థాయిలో రూపుదాల్చలేదు. తాజాగా ఏపీలోనూ చిత్ర పరిశ్రమను ఎలాగైనా అభివృద్ధి చేయాలనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రముఖ సినీ హీరో పవన్‌ కళ్యాణ్‌ ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలనే వారి సంఖ్య పెరిగింది.

    ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో సినిమాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ స్టూడియో నిర్మాణం చేపట్టాలనే ఆలోచనలో ఉంది. ఇటీవలే పవన్‌ కళ్యాణ్‌ను సినిమా పెద్దలు కలిసి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమా పరిశ్రమ విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పాత కృష్ణా జిల్లా నందిగామ–కంచికచర్ల ప్రాంతంలో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి హైదరాబాద్‌కు నాలుగు గంటల ప్రయాణం ఉంటుంది. 40 కిలోమీటర్ల దూరంలో గన్నవరం ఎయిర్‌పోర్టు, విజయవాడ రైల్వే జంక్షన్, రాజధానికి అమరావతికి అతి సమీప ప్రాంతం కావటంతో ఈ ఎంపిక జరిగినట్లుగా సమాచారం. త్వరలో సినీ పరిశ్రమ పెద్దలతో పవన్‌కళ్యాణ్‌ మరో దఫా చర్చలు జరిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలే స్టూడియోలు నిర్మించి నామమాత్రపు ధరతో సినిమా నిర్మాణాలకు అద్దెకి ఇస్తున్నాయి. అదే విధంగా రాష్ట్రంలో స్టూడియో నిర్మించి సినిమాలకు ఇవ్వాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

Source From: telugu film industry