డబ్బు లేకపోతే గుర్తింపే ఉండదు : సినీ నటి లక్ష్మి ఏం చెప్పిందో చూడండి

నేను డబ్బు కోసమే సినిమాల్లో నటిస్తున్నాను. అందులో ఎటువంటి సందేహమూ లేదు. అది చెప్పడానికి నాకేమీ నామోషీ లేదు. ఎవరైనా వచ్చి ‘మా సినిమాలో మీకు అద్భుతమైన పాత్ర ఉంది మేడమ్‌! చాలా గొప్ప పేరు వస్తుంది. మీరు ఫ్రీగా ఈ సినిమా చేయాలి’ అని అంటే ‘నాకు ఆ క్యారెక్టర్‌ అక్కర్లేదు’ అని నేరుగా చెప్పేస్తాను. నన్ను తెర మీద చూపించి మీరు డబ్బు వసూలు చేస్తున్నప్పుడు నేనెందుకు ఉచితంగా నటించాలి? ఇదేమైనా దానమా, ధర్మమా? నేను మీ సినిమా కోసం కష్టపడుతున్నాను. నాకు ఇవ్వాల్సిన డబ్బు మీరు ఇవ్వండి. కావాలంటే కాస్త ఎక్కువో, తక్కువో ఇవ్వండి.


Published on: 09 Aug 2024 21:40  IST


   

    నేను డబ్బు కోసం సినిమాలు చేయడం లేదు. తప్తి కోసం చేస్తున్నాం’ అనేది అబద్ధం. ఎవరూ ఎవరికీ ఇక్కడ ఏదీ ఉచితంగా చేయరు. ఏదైనా ఉచితంగా చేసినా, అందులో ఏదో ఒక లాభం ఆశిస్తారు. సినిమా అనేది పక్కా వ్యాపారం. ఎవరూ ఇక్కడ కళాసేవ చేయడానికి రాలేదు. డబ్బు అనేది లేకపోతే ఎవరూ ఎవర్నీ సరిగా గుర్తించరు. గౌరవించరు. మీకొక ఉదాహరణ చెప్తాను.

    చాన్నాళ్ల క్రితం నటి గౌతమి, నేను కలిసి ఒక సినిమాలో నటించాం. ఆ సినిమా నిర్మాత గారి భార్య అప్పుడప్పుడూ సెట్‌కి వచ్చేవారు. చాలా సౌమ్యంగా ఉండేవారు. భోజనం చేశారా అని అడిగితే ‘ఆయన తిన్నాక తింటాను‘ అనేవారు. ఏది మాట్లాడాలన్నా తన భర్త అనుమతి కోసం చూసేవారు. కొద్ది రోజులకు ఆ నిర్మాత చనిపోయారు. ఈ విషయం తెలిసి నేనూ, గౌతమి వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లాం. అందరూ ఏడుస్తున్నారు. నిర్మాత గారి భార్య మౌనంగా కూర్చుని ఉంది. ఆమెను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. ఆమె పక్కకి వెళ్లి భుజం మీద చెయ్యి వేసి ఓదార్చాలని చూశాను. వెంటనే ఆమె తన భర్తను గట్టిగా ఒక బూతు తిట్టి, ‘ఈ పాపిష్టోడు డబ్బంతా ఎక్కడ పెట్టాడో చెప్పకుండానే పోయాడే‘ అని అరిచింది. నా పక్కనే ఉన్న గౌతమి షాకైంది.
    
    ఆమె అన్న మాటలకు నాకు నవ్వొచ్చింది. పక్కనే శవం ఉంది అన్న విషయం కూడా మర్చిపోయి గట్టిగా నవ్వాను. గౌతమి, నేను కారు దగ్గరికి వచ్చాం. కారు ఎక్కాక కూడా నవ్వుతూనే ఉన్నాను. ఈ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా నవ్వు వస్తూనే ఉంటుంది. అంత సౌమ్యమైన మనిషి కూడా తన భర్తపై ఆ స్థాయిలో కోపాన్ని చూపించింది. అప్పుడే నాకు అర్థమైంది.  మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోతే మనం పోయాక కూడా మనల్ని తిట్టుకుంటూనే ఉంటారు. డబ్బే ఇక్కడ ప్రధానం.

 

Source From: Actress lakshmi