పెళ్లి పీటలు ఎక్కనున్న వరలక్ష్మి శరత్ కుమార్


Published on: 02 Mar 2024 23:45  IST

 వరలక్ష్మీ శరత్‌కుమార్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ప్రముఖ గ్యాలరిస్ట్‌ నికోలయ్‌ సచ్‌దేవ్‌తో ఆమె నిశ్చితార్థం జరిగింది. మార్చి1న ముంబయి వేదికగా జరిగిన ఈ వేడుకలో కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. తమిళ, తెలుగు చిత్రాల్లో నటిగా తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు వరలక్ష్మి. సీనియర్‌ నటుడు శరత్‌కుమార్‌ కుమార్తెగా వెండితెరకు పరిచయమైనా తన వైవిధ్యమైన నటన, పాత్రలతో అలరించారు. ఇక నికోలయ్‌ సచ్‌దేవ్‌ ముంబయికి చెందిన వ్యాపారవేత్త. ఆర్ట్‌ గ్యాలరీలను నిర్వహిస్తుంటారు. ఆన్‌లైన్‌ వేదికగానూ వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులను విక్రయిస్తుంటారు.
నికోలయ్‌, వరలక్ష్మీలకు 14ఏళ్లుగా పరిచయం ఉంది. వీరి వివాహానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇద్దరూ తమ వృత్తిగత జీవితాల్లో బిజీగా ఉండటంతో వచ్చే ఏడాది వీరి వివాహం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. మరోవైపు వరలక్ష్మి అటు తమిళ, ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన ‘హను-మాన్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ధనుష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాయన్‌’లోనూ  నటిస్తున్నారు. దీంతోపాటు, మలయాళంలో ‘కలర్స్‌’, తెలుగు ‘శబరి’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Source From: Actress varalakshmi