త్రిషకు క్షమాపణ చెప్పిన మన్సూర్‌ అలీఖాన్‌


Published on: 24 Nov 2023 20:19  IST



సినీ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ఎట్టకేలకు దిగొచ్చాడు. సినీ నటి త్రిషపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాడు. ఆమెపై తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదని, తాను సరదాగా మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపాడు. ఆమె పెళ్లికి తాను మంగళసూత్రం ఇచ్చి ఆశీర్వదించాలనుకుంటున్నానని ఈ సందర్భంగా ఆయన వివరించాడు. ప్రస్తుతం ఆయన త్రిషకు క్షమాపణలు చెబుతూ పెట్టిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

మన్సూర్‌ అలీఖాన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తాను ఎన్నో రేప్‌ సీన్లలో నటించానని, ’లియో’లో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందని అనుకున్నానని చెప్పాడు. ఆ సన్నివేశం లేకపోవడంతో బాధగా అనిపించిందని తెలిపాడు. సంబంధిత వీడియో త్రిష దృష్టికి వెళ్లగా ఆమె తీవ్రంగా స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా మన్సూర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి వల్లే అందరికీ చెడ్డపేరు వస్తోందని పేర్కొన్నారు. 'లియో’ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్, ప్రముఖ హీరో చిరంజీవి, నితిన్, రోజా, రాధిక, గాయని చిన్మయి తదితరులు కూడా మన్సూర్‌ వ్యాఖ్యలను ఖండించారు. త్రిషకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. నడిగర్‌ సంఘం కూడా మన్సూర్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది.

మరోవైపు మన్సూర్‌ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి.. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలోనే అతడిపై కేసు నమోదైంది. అయినప్పటికీ త్రిషకు తాను క్షమాపణలు చెప్పబోనని తొలుత మన్సూర్‌ స్పష్టం చేశాడు. దీంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే వెనక్కి తగ్గిన మన్సూర్‌ అలీఖాన్‌ త్రిషకు క్షమాపణలు చెప్పాడు.

Source From: Trisha