లియోలో కమల్‌ నటించాడా?

ఈ దసరాకు విడుదలయ్యే సినిమాల్లో భారీ అంచనాలున్న ‘లియో’ గురించి ఊహించని విశేషాలు బయటకు వస్తున్నాయి. సినిమాలో బిగ్‌ హీరో ఎంట్రీ ఉంటుందనే వార్తలు నిజమయ్యేలా ఉన్నాయి.


Published on: 10 Oct 2023 21:28  IST


సక్సెస్‌ఫుల్‌ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘లియో’. ఈ చిత్రం ఈ నెల 19న థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. సూపర్‌ హిట్‌ అయిన ‘ఖైదీ’, ‘విక్రమ్‌’ చిత్రాల తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ రూపొందించిన చిత్రం కావడంతో దీనిపై తొలి నుంచీ సినీ ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. భారీ అంచనాలతో అభిమానులు ఎదురుచూస్తున్న ఈ చిత్రం ట్రై లర్‌ తాజాగా విడుదలై అభిమానులను విశేషంగా అలరిస్తున్న విషయం కూడా తెలిసిందే. 

 

తనదైన స్టైల్‌లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న దర్శకుడు లోకేష్‌.. తాను రూపొందించే సినిమాల్లో ఒక సినిమాకు మరో సినిమాకు లింక్‌ ఇస్తుండటం విశేషం. ఇప్పటికే ఖైదీ సినిమాలోని పాత్రను కమల్‌ హాసన్‌ హీరోగా నటించిన ‘విక్రమ్‌’ సినిమాలో చూపించాడు. అలాగే ‘విక్రమ్‌’ సినిమా చివరిలో హీరో సూర్య కనిపించాడు. ఇప్పుడు ఆయన తాజాగా రూపొందించిన ‘లియో’ చిత్రంలోనూ అభిమానులకు గూస్‌బంప్స్‌ ఇచ్చే సన్నివేశాలు.. షాకిచ్చేలా పలువురు నటుల ఎంట్రీలు ఉంటాయని తెలుస్తోంది. గత చిత్రాలకు లింక్‌గా ఇవి ఉంటాయని సమాచారం. వాటిని కావాలనే ఆ చిత్ర బృందం బయటికి వెల్లడించకుండా సీక్రెట్‌గా ఉంచినట్టు తెలుస్తోంది. 

 

 

తాజాగా ఈ చిత్రంలో ‘విక్రమ్‌’ చిత్ర హీరో కమల్‌హాసన్‌ ఎంట్రీ కూడా ఉంటుందని బలంగా వినిపిస్తోంది. దీనిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ను ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ.. ’మరో 10 రోజులు ఆగండి. మీరు ప్రతిదీ తెలుసుకుంటారు. మేము ఉద్దేశపూర్వకంగా కొన్ని అంశాలను దాచాము. ఎందుకంటే ప్రేక్షకులు అదంతా సినిమాలో ఎంజాయ్‌ చేయాలి’ అని తెలిపారు. దీన్నిబట్టి షాకింగ్‌ ఎంట్రీలు ఈ చిత్రంలో ఉంటాయనేది నిజమేనని అర్థమవుతోంది. ఇక అభిమానుల అంచనాలు, సందేహాలకు ఈ చిత్రం విడుదలతోనే క్లారిటీ రానుంది. ఈ సినిమాలో దళపతి విజయ్‌ డ్యూయల్‌ రోల్‌లో కనిపించనుండగా, త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా  సంజయ్‌ దత్, అర్జున్‌ సర్జా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Source From: Telugu Peoples