అభిమానులతో కష్టం.. వాళ్లతో నాకు సంబంధం లేదు : జగపతిబాబు

అభిమాన సంఘాలపై సినీ నటుడు జగపతిబాబు విరుచుకుపడ్డారు. వాళ్ల తీరు తనను బాధిస్తోందని, ఏదో ఆశించి తనను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Published on: 08 Oct 2023 17:53  IST


సినీ నటుడు జగపతిబాబు షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అభిమాన సంఘాలకు తాను దూరంగా ఉంటున్నట్లు ఆయన ప్రకటించారు. నిజంగా ఇది షాకింగ్‌ నిర్ణయం అనే చెప్పాలి. ఎందుకంటే.. సినీ నటులు అభిమానులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అభిమాన సంఘాలను నిత్యం ప్రోత్సహిస్తారు. వారి ఫాలోయింగే సినీ నటులకు అసలైన ఎనర్జీ అని కూడా తెలిసిందే. అంతేకాదు.. తమ అభిమాన నటుడు కష్టాల్లో ఉన్నా.. ఎవరైనా అతనిపై విమర్శలు చేసినా, ఆరోపణలు గుప్పించినా.. వెంటనే స్పందించేది అభిమానులే. మేమున్నామంటూ తమ అభిమాన నటీనటులకు అండగా నిలుస్తారు. సోషల్‌ మీడియాలో అయితే పలువురు సినీ నటీనటుల అభిమానుల మధ్య జరిగే ఫైట్‌ అయితే ఓ రేంజ్‌లో సాగుతుంది. అలాంటిది సీనియర్‌ నటుడిగా ఉండి.. అందునా హీరోగా ఒక వెలుగు వెలిగిన నటుడు జగపతిబాబు అభిమాన సంఘాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. 

ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. 

33 ఏళ్ల తన సినీ కెరీర్‌లో అభిమానులు తన ఎదుగుదలకు ముఖ్య కారణమని భావించానని జగపతిబాబు సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. వాళ్ల కష్టాలను తనవిగా భావించి అన్నివిధాలుగా అండగా నిలిచానని తెలిపారు. అభిమానులంటే ప్రేమ ఇచ్చేవాళ్లని మనస్ఫూర్తిగా నమ్మానని పేర్కొన్నారు. కానీ, బాధాకరమైన విషయం ఏంటంటే.. కొంతమంది అభిమానులు ప్రేమ కంటే ఆశించటం ఎక్కువైంది.. అంటూ అసలు విషయం బయటపెట్టారు.  అది చివరికి తనను ఇబ్బందిపెట్టే పరిస్థితికి వచ్చిందని తెలిపారు. మనసు అంగీకరించకపోయినా బాధతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఇక నుంచి తన అభిమాన సంఘాలు, ట్రస్టులకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, వాటి ఆధ్వర్యంలో చేసే సేవా కార్యక్రమాలను విరమించుకుంటున్నానని స్పష్టం చేశారు. అయితే, కేవలం ప్రేమించే అభిమానులకు తాను ఎప్పుడూ తోడుగా ఉంటానని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇంతకీ జగపతిబాబు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం మాత్రం క్లారిటీగా తెలియరాలేదు. ఇకపోతే ప్రస్తుతం జగపతిబాబు ’గుంటూరు కారం’, ’సలార్‌’ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 
 

Source From: jagapati babu