సినిమాకని పిలిచి.. పాత ప్రియుడితో కొత్త ప్రియుడిపై హత్యాయత్నం

ఇది సినీ తరహా క్రైమ్‌ సీన్.. నిజ జీవితంలో జరిగింది. ఒక యువకుడితో ప్రేమ కొనసాగిస్తూనే మరో యువకుడిని ప్రేమిస్తున్న యువతి.. కొత్త ప్రేమికుడిపై హత్యకు కుట్ర పన్నింది. అందులో భాగంగా అతన్ని సినిమాకెళదామంటూ థియేటర్‌కి రప్పించింది. టిక్కెట్లు కూడా తానే బుక్‌ చేసింది. అతని పక్కనే కూర్చుని సినిమా చూస్తూ.. పాత ప్రియుడితో వెనుక నుంచి కత్తితో దాడి చేయించింది. తిరుపతిలో శనివారం జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి తిరుపతి తూర్పు స్టేషన్‌ సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్సై నాగేంద్రబాబు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.


Published on: 16 Sep 2024 18:36  IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పల్లిగుంటిపల్లెకు చెందిన లోకేశ్‌ తిరుపతిలో పారామెడికల్‌ సెకండియర్‌ చదువుతున్నాడు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన తోటి విద్యార్థినితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. శనివారం సినిమాకు వెళదామని సదరు యువతి వారిద్దరికీ టికెట్లు బుక్‌ చేసింది. లోకేశ్‌ హాస్టల్‌ నుంచి బైక్‌పై థియేటర్‌కు రాగా, యువతి ఆటోలో వచ్చింది. ఇద్దరూ కలిసి థియేటర్‌లోకి వెళ్లి తమ సీట్లలో కూర్చున్నారు. 

ఆ తర్వాత కొద్దిసేపటికి వారి వెనుక వరుసలో ఉన్న తిరుపతి జిల్లా తడ మండలం అండగుండాలకు చెందిన కార్తీక్‌.. హఠాత్తుగా లేచి లోకేశ్‌ని పొత్తికడుపుపై కత్తితో పొడిచాడు. ఆ వెంటనే కార్తీక్, యువతి థియేటర్‌ నుంచి బయటపడి బైక్‌పై పరారయ్యారు. ఈలోగా కత్తిపోటుతో గాయపడిన లోకేశ్‌ వాష్‌రూమ్‌కు వెళ్లి గాయాన్ని కడుక్కుంటుండగా, థియేటర్‌ సిబ్బంది గుర్తించి అతన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. తనపై దాడిని దాచిపెట్టిన లోకేశ్, కింద పడటంతో గాయమైందని చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. చివరికి పోలీసులు ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

పక్కా ప్లాన్‌ ప్రకారమే... 

హత్యాయత్నానికి పాల్పడిన కార్తీక్‌తో సదరు యువతికి బంధుత్వం ఉంది. ఐదేళ్లుగా అతనితో ప్రేమలో ఉన్నట్టు తెలిసింది. కార్తీక్‌ పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. ప్రస్తుతం జులాయిగా తిరుగుతున్నాడు. యువతి అతనితో నిత్యం ఫోన్‌లో మాట్లాడుతూనే.. తన క్లాస్‌మేట్‌ లోకేశ్‌తోనూ చనువుగా ఉంటోంది. అంతేగాక ఒకరి విషయాలు మరొకరితో పంచుకుంది. దీంతో వారి మధ్య కక్షలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే కార్తీక్‌ శుక్రవారం తిరుపతికి వచ్చి యువతిని కలిశాడు. ఇద్దరూ కలిసి లోకేశ్‌పై దాడికి వ్యూహం పన్నారు. ముందు, వెనుక వరుసల్లో సీట్లు వచ్చేలా యువతే సినిమా టిక్కెట్లు బుక్‌ చేయడం గమనార్హం. దాడి తర్వాత నిందితులిద్దరూ బైక్‌పై శ్రీకాళహస్తి వైపు వెళ్లినట్టు తెలిసింది. వారి కోసం గాలింపు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

Source From: crime