ఎస్‌బీఐలో గల్లంతైన 7 కేజీల బంగారు నగలు


Published on: 01 Dec 2023 10:07  IST


    శ్రీకాకుళం జిల్లా గారలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖలో ఖాతాదారులు కుదువ పెట్టిన 7 కేజీల బంగారు ఆభరణాలు గల్లంతయ్యాయి. వీటి విలువ రూ.4.07 కోట్లు. ఇది ఇంటి దొంగల పనే గుర్తించిన ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఈలోపు ఒక మహిళా ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేకెత్తిస్తోంది. గార ఎస్‌బీఐ శాఖలో ఆభరణాలు తనఖా పెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారులు నగదు చెల్లించినా వాటిని కొద్దిరోజులుగా తిరిగి ఇవ్వడంలేదు. తమ నగలు ఎందుకు తిరిగి ఇవ్వడంలేదని ఖాతాదారులు అధికారులను నిలదీస్తున్నారు. ఇదే సమయంలో నగలు గల్లంతయ్యాయనే ప్రచారం మొదలవడంతో నవంబరు 27న ఖాతాదారులు ఆందోళనకు దిగారు. దీంతో బ్యాంకు రీజినల్‌ అధికారులు బ్రాంచికి వచ్చి ఆడిట్‌ జరుగుతుండడం వల్ల ఆభరణాలు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోందని వారికి నచ్చజెప్పారు. డిసెంబరు 8 వరకు వేచి ఉంటే ఆభరణాలకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. 

స్వప్నప్రియపైనే అనుమానం
    అయితే ఇంతలో బ్యాంకులో బంగారంపై రుణాలిచ్చే బాధ్యతలు చూసే డిప్యూటీ మేనేజరు ఉరిటి స్వప్నప్రియ (39) నవంబరు 29న ఆత్మహత్యకు పాల్పడడంతో కలకలం రేగింది. ఖాతాదారుల్లో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. నగలు మాయమయ్యాయని అంతర్గత విచారణలో గుర్తించినా అధికారులు బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. స్వప్నప్రియపై అనుమానం వ్యక్తమవడంతో బ్యాంకు అధికారులు ఆమెను గత నెల 20 నుంచే సెలవుపై పంపారు. ఆ తరువాత రెండుసార్లు పిలిచి విచారించారు. ఈ నేపథ్యంలోనే స్వప్నప్రియ ఆత్మహత్యకు చేసుకుంది. దీంతో ఉన్నతాధికారులు గురువారం పోలీసులను ఆశ్రయించారు. 
 

Source From: Telugu Peoples