నకిలీ వీలునామాలు.. వివాదంలో వందల ఎకరాలు

నకిలీ వీలునామాలు, దస్తావేజులు, మరణ ధ్రువీకరణ పత్రాలతో ఒక వ్యక్తి వందల ఎకరాలకు వివాదంలోకి లాగి భారీగా డబ్బు దండుకున్నాడు. ఒంగోలులో ఒక వ్యక్తి చేసిన భూముల దందా చూసి పోలీసులే విస్తుపోయారు.


Published on: 12 Nov 2023 14:40  IST

        


    వృద్ధాప్యంలో ఆశ్రయమిచ్చినందుకు ఓ మహిళ తన పేరిట వీలునామా రాసిందని రెడ్డిపోగు గురవయ్య అనే వ్యక్తి ఒక కథ సృష్టించి ఈ మోసాలకు పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా కందుకూరు నుంచి విజయవాడ శివారులోని ప్రసాదంపాడు, గన్నవరం వరకు ఆమె పేరుతో భూములు ఉన్నట్లు చెప్పి.. వాటికి తాను వారసుణ్ని అని వాటికి నకిలీ వీలునామాలు సృష్టించాడు. వాటితో ఆ భూముల యజమానులను బెదిరించి వారి నుంచి డబ్బు గుంజుతున్నాడు. అసలు యజమానులకు తెలియకుండా పలుచోట్ల నకిలీ వీలునామాలతో వారి భూములను విక్రయించాడు. ఒంగోలులో నకిలీ పత్రాలతో భూములను కాజేస్తున్న ముఠా గురించి ఆరా తీస్తుండగా రెడ్డిపోగు గురవయ్య మోసాల డ్రామా వెలుగుచూసింది. పోలీసులకు దొరికిన వంద పేజీల పుస్తకంలో రకరకాల సర్వే నెంబర్లతో సుమారు వంద ఎకరాలకు సంబంధించిన వివరాలు, వీలునామాలు బయటపడ్డాయి. 

ఇదీ జరిగిన మోసం  

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలానికి చెందిన చినసుబ్బయ్య, వీరమ్మ దంపతులు 1902లో విడిపోయారు. ఆమె వృద్ధాప్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతానికి చేరుకుని అక్కడ గురవయ్యతో పరిచయం ఏర్పడడంతో అతని దగ్గర ఉంది. ఆ పరిచయాన్ని అతడు నకిలీ వీలునామాలకు వాడుకున్నాడు. 2006లో ఆమె మృతి చెందింది. గురవయ్య ఆమె మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీçసుకుని, ఆమె ఆస్తిపాస్తులకు తానే వారసుడినంటూ ‘ప్రాపర్‌ పర్సన్‌ ధ్రువీకరణ’ పత్రాన్ని పొందాడు. ఒంగోలు మండలం ముక్తినూతలపాడు సర్వే నంబరు 173/13లో 2.25 ఎకరాలకు తాను వారసుడినంటూ నకిలీ వీలునామా సృష్టించాడు. అడంగల్‌లో ఎక్కడా వీరమ్మకు వారసత్వ కొనుగోలు డాక్యుమెంట్లు లేవు. అయినా వీరమ్మ రాయించిన వీలునామాలో మార్కాపురానికి చెందిన కొండా బలరామిరెడ్డి, కర్రి సోమిరెడ్డిలు సాక్షులుగా సంతకాలు చేశారు. ఇదే స్థలాన్ని సాక్షి సంతకాలు చేసిన వ్యక్తుల పేరి 2009 జూన్‌ 18న 3543/2009న జీపీఏ చేశాడు. 2018లో ఆ జీపీఏను రద్దు చేసి, భూముల దందా ప్రారంభించాడు. 

ఏజెంట్లను నియమించుకుని మరీ

ఒంగోలులో కొందరిని ఏజెంట్లుగా నియమించుకున్నాడు. ఒంగోలు శివార్లలో తనకు వారసత్వంగా వచ్చిన భూములున్నాయని వారిని నమ్మించాడు. తనకు అనువైన భూముల వివరాలు, సరిహద్దులు పేర్కొంటూ మరొక జీపీఏ సిద్ధం చేశాడు. అతడి ముఠా భూముల క్రయ విక్రయాలకు ఉపక్రమించింది. స్థానికంగా ఒక చర్చికి అయిదు స్వాధీన విక్రయాలు, మరో అయిదు దానపత్రాలతో 1.22 ఎకరాలు రిజిస్టర్‌ చేశాడు. ఇతడి వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదులు అందడంతో విచారణ మొదలుపెట్టడంతో గురవయ్య మోసాలు బయటపడ్డాయి.

 

Source From: land cheaters