ఉద్యోగంలో బిజీ అయిపోయిందని భార్యను చంపేశాడు

వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం అన్యోన్యంగానే ఉన్నారు. ఇంతలో భార్యకు కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రావడంతో భార్య తనను పట్టించుకోవడం లేదని కోపం పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా చంపేశాడు. బీహార్‌లోని పాట్నాలో ఈ ఘటన జరిగింది.


Published on: 22 Oct 2023 19:50  IST

ప్రేమించి పెళ్లిచేసుకున్న వారి మధ్య ఉద్యోగం వివాదాలు రేపింది. అది ముదిరి కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్న భార్యను భర్త హతమార్చేవరకు వెళ్లింది. బిహార్‌ రాష్ట్రంలోని పాట్నాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జెహనాబాద్‌కు చెందిన గజేంద్ర యాదవ్‌ అనే వ్యక్తి కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. అక్కడ ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీయగా, ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. ఇటీవల ఆమె కానిస్టేబుల్‌గా ఎంపిక కావడంతో పోలీసు కొలువులో చేరింది. ఉద్యోగంలో బిజీగా ఉంటూ ఇంట్లో ఎక్కువ సమయం కేటాయించలేకపోయేది. దీంతో ఈ విషయమై భర్త గజేంద్ర ఆమెతో తరచూ గొడవపడేవాడు. ఆ గొడవ ముదిరి ఆఖరికి ఆమెను హతమార్చాలని నిర్ణయించుకునేవరకు వెళ్లింది. ఈ క్రమంలోనే గజేంద్ర ఓ హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేసి భార్యను పిలిచాడు. అక్కడ ఈ విషయమై ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. వివాదం ముదిరి ఆగ్రహానికి గురైన భర్త తుపాకీతో ఆమెను కాల్చి చంపేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. మహిళా కానిస్టేబుల్‌ హత్యకు గురైన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. 


 

Source From: crime