పోలీసు ఈ చలానాల సొమ్మును నొక్కేసిన మాజీ డీజీపీ అల్లుడు

అది కోట్ల రూపాయలు విలువైన కాంట్రాక్టు. ఒక కంపెనీ రూ.1.97 ఓట్లకు టెండర్ వేసింది. మరో కంపెనీ కేవలం రూపాయికి టెండర్ వేసింది. అదేమంటే మేం సేవ చేస్తామని పోలీసులు మాయ చేసింది. ఐదేళ్లు గడిచాక చూస్తే పోలీసు శాఖకు వెళ్లాల్సిన రూ.38 కోట్లను తన సొంత ఖాతాలోకి మళ్లించేసింది. పోలీసు శాఖ బ్యాంక్ అకౌంట్ ను క్లోనింగ్ చేసి ప్రజలు కట్టే చలానాల సొమ్ము నేరుగా ఆ ఖాతాలోకి వెళ్లేలా చేసుకుంది. నాలుగేళ్ల నుంచి ఇలా పోలీసు శాఖకు రావాల్సిన డబ్బుని దిగ మింగింది. రావాల్సిన డబ్బులు పూర్తిగా రావడం లేదనే అనుమానంతో పోలీసులు కూపీ లాగితే మొత్తం కుంభకోణం బయట పడింది. ఈ కంపెనీ మాజీ డిజిపి సాంబశివరావు అల్లుడు అవినాష్ది. ఆయన డిజిపిగా ఉన్నప్పుడు తన అల్లుడికి ఈ కాంట్రాక్టు కట్టబెట్టారు. అతను దర్జాగా పోలీసులు సొమ్మును ఇష్టానుసారం నొక్కేసి ఇప్పుడు పారిపోయాడు.


Published on: 20 Oct 2023 11:43  IST

పోలీసులు విధించే ఈ- చలానా వసూళ్లలో రూ.38.53 కోట్లను పక్కదారి పట్టించి భారీ మోసానికి పాల్పడిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ- చలానా వసూళ్లకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సంస్థ ఒక క్లోన్ అకౌంట్ ద్వారా ఈ మోసానికి పాల్ప డినట్టు గుర్తించారు. సంబంధిత వ్యక్తుల అన్ని ఖాతాలను పోలీసులు సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేశారు. ఇందులో గతంలో డీజీపీగా పని చేసిన నండూరి సాంబశివరావు అల్లుడు అవినాశ్ కొమ్మిరెడ్డి, అతని సోదరి అక్షిత, మరికొందరి పాత్ర ఉన్నట్టు గుర్తించారు. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, ప్రజల సొమ్ము ప్రభుత్వానికి రాకుండా చేసిన ఈ కేసులో ఉన్న ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

రూపాయికే టెండర్ వేసి.. రూ.కోట్లు కొల్లగొట్టారు

మోటారు వాహనాలపై విధించే చలానాల వసూలుకు సంబంధించి 2015 నుంచి కృష్ణా సొల్యూషన్స్' అనే సంస్థ కొన్ని జిల్లాల్లో సేవలు అందిస్తోంది. ఈ అప్లికేషన్ వాడుతున్నందుకు ప్రతి చెల్లింపుదారు నుంచి రూ.5 చొప్పున యూజర్ చార్జీగా ఆ సంస్థ వసూలు చేస్తోంది. 2017 జూన్ లో అప్పటి డీజీపీ నండూరి సాంబశివరావు 'డేటా ఎవాన్ సొల్యూషన్స్' అనే సంస్థ దగ్గర ఆధునికీకరించిన సాఫ్ట్వేర్ ఉందని, దీనిని కూడా ఉపయోగించమని సర్క్యులర్ ఇచ్చారు. దీంతో కృష్ణా సొల్యూషన్స్ తో పాటు డేటా ఎవాన్ సాల్యూ షన్స్ సేవలను కూడా వినియోగించడం ప్రారంభించారు. కానీ 2018లో ఒక్కో జిల్లాలో ఒక్కో పద్ధతి వాడుతుండటంతో అన్నిచోట్ల ఒకే పద్ధతి ఉండాలనే ఉద్దేశంతో డేటా సొల్యూషన్స్ ఎంపిక కోసం ఓపెన్ టెండర్లు పిలిచారు. టెండర్ విలువ రూ.2 కోట్లుగా నిర్ణయించారు. ఈ టెండర్లలో రెండు సంస్థలు పాల్గొన్నాయి. కృష్ణా సాల్యూషన్స్ రూ.1.97 కోట్లకు టెండర్ వేయగా.. డేటా ఎవాన్ సొల్యూషన్స్ కేవలం ఒక్క రూపాయికే టెండర్ వేసింది. అదేమని అడగ్గా.. తాము ఈ ప్రాజెక్ట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున సేవగా చేయాలన్న ఉద్దేశంతో కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటున్నామని, మిగిలిన రాష్ట్రాల్లో వచ్చిన డబ్బులతో సంస్థను నడుపుతామని చెప్పడంతో డేటా ఎవాన్ సంస్థకే టెండర్ కేటాయించారు.

నకిలీ కంపెనీ సృష్టించి..
 టెండర్  దక్కించుకున్నాక  ఆ కంపెనీ వాళ్ళు  ఎవాన్ సొల్యూషన్తో పాటు రేజర్ పీఈ అనే నకిలీ కంపెనీని సృ ష్టించి నగదు దారి మళ్లించారు. ఇప్పటికే ఆ సంస్థను పోలీసు శాఖకు పరిచయం చేసిన కొత్తపల్లి రాజశేఖర్ను అరెస్ట్ చేశారు. అతని బినామీ ఆస్తులను గుర్తిస్తున్నారు. మోసం చేసిన కంపెనీ డైరెక్టర్లు కొమ్మిరెడ్డి అవినాష్, అక్షిత, రవికిరణ్ తో పాటు సాఫ్ట్వేర్ ను ఎవరు నిర్వహించారో, ఎవరు సహకరించారో వారిని కూడా గుర్తించి కేసు నమోదు చేశారు. త్వరలోనే ఈ కేసు విచారణ పూర్తిచేసి బాధ్యులందరినీ అరెస్ట్ చేస్తామని గుంటూరు రేంజి ఐజి  పాలరాజు స్పష్టం చేశారు.

డబ్బు ఎలా దారి మళ్ళించారంటే..
ఈ-చలానా అప్లికేషను డబ్బులు వివిధ పేమెంట్ గేట్వేల ద్వారా వస్తాయి. పేటీఎం, ఏపీ ఆన్లైన్, మీసేవ, డెబిట్, క్రెడిట్ కార్డులు, వెబ్, రేజర్పే వంటి విధానాల్లో చలానా మొత్తాలు చెల్లింపులు జరుగుతాయి. ఇలా వచ్చిన డబ్బులన్నీ డీజీ అకౌంట్ క్కు అనుసంధానం అవుతాయి. చెల్లింపులు జరుగుతున్న తరుణంలో కొంత అవకతవకలు జరుగుతున్నట్టు తిరుపతి యూనిట్లో గుర్తించారు. ప్రతి రోజూ ఎంత వస్తుందన్నది డాష్ బోర్డులో కనపడుతుంది. ప్రతి నెలా 1వ తేదీన వసూలు చేసిన మొత్తం కొద్దిరోజుల తర్వాత చూస్తే తగ్గుతున్నట్టు గుర్తించడంతో విచారణ మొదలు పెట్టారు. దీనిపై లోతుగా విచారణ చేయడంతో పెద్దఎత్తున మోసం జరు గుతున్న విషయం వెలుగు చూసింది. రేజర్పే ద్వారా వచ్చిన మొత్తాన్ని వేరే ఖాతాకు మళ్లించుకున్నట్టు గుర్తించారు. దీనికి సంబంధించి 2018లోనే ఒక క్లోనింగ్ ఖాతాను సృష్టించి.. దానిద్వారా డబ్బులను తమ ఖాతాలకు మళ్లించుకున్నారు. ఈ విధంగా పోలీస్ శాఖకు రావాల్సిన రూ.36.53 కోట్లను వివిధ ఖాతాలకు మళ్లించినట్టు గుర్తించి వాటిని సీజ్ చేశారు. ఏ ఖాతాలకు మళ్లించారో ఆ ఖాతాల ద్వారా 2019 నుంచి కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తిస్తున్నారు.

Source From: Telugu Peoples