ఇద్దరు మహిళలు.. ఐదు హత్యలు

చిన్నచిన్న విభేదాలనే పెద్దగా ఊహించుకుని ఒక మహిళ సొంత కుటుంబాన్నే అంతం చేసింది. అత్తమామలు, వాళ్ళ ముగ్గురు పిల్లల్ని నాటు మందు పెట్టి హత్య చేసింది. ఆ కుటుంబం పగ పెంచుకున్న మరో మహిళ సాయం తీసుకుని ఈ ఘాతుకానికి పాల్పడింది. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఈ దారుణం చోటుచేసుకుంది.


Published on: 19 Oct 2023 16:44  IST

ఒక కుటుంబంపై పగబట్టిన ఇద్దరు మహిళలు 20 రోజుల్లోనే గుట్టుచప్పుడు కాకుండా వారిని హతమార్చారు. అందరూ ఒకేసారి కాకుండా.. ఒక్కొక్కరు ఒక్కోరోజు మృతిచెందడం.. అందరూ దాదాపు ఒకే లక్షణాలతో చనిపోవడంతో దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు హంతకులను గుర్తించారు. అయితే.. ఈ వరుస హత్యలకు పాల్పడింది ఇద్దరు మహిళలని తెలిసేసరికి విస్తుపోయారు. అదీ పగబట్టి.. ప్లాన్‌ చేసి.. అందరినీ హతమార్చడం స్థానికులను కలవరానికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన సంఘమిత్ర అనే మహిళకు తన అత్తమామలు, భర్త తీరు నచ్చలేదు. వారు తనను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తుండటాన్ని తట్టుకోలేకపోతోంది. రోసా అనే మరో మహిళకు ఆ కుటుంబంతో ఆస్తి తగాదాలు ఉన్నాయి. సమీపంలోనే నివాసం ఉంటున్న వీరిద్దరూ మాటల సందర్భంలో ఆ కుటుంబంపై తామిద్దరికీ కోపం ఉన్నట్టు గుర్తించారు. ఇద్దరూ కలిసి వారిపై పగ తీర్చుకోవాలని భావించారు. ఏకంగా వారి ప్రాణాలే తీయాలని నిర్ణయించుకున్నారు.


తొలుత వీరు రంగు, రుచి, వాసన లేని ఓ నాటుమందును సేకరించారు. సెప్టెంబరు 20న శంకర్‌ కుంభారే, అతని భార్య విజయ తినే ఆహారంలో దాన్ని కలిపారు. అది తిన్న తర్వాత వారికి తీవ్రమైన ఒళ్లునొప్పులతో పాటు గుండెనొప్పి వచ్చింది. వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. సెప్టెంబరు 26న శంకర్‌.. ఆ తర్వాతిరోజు అతని భార్య విజయ మరణించారు. మరికొద్దిరోజుల్లోనే శంకర్‌ దంపతుల కుమార్తెలు కోమల్, ఆనంద, కుమారుడు రోషన్‌ అస్వస్థతకు గురయ్యారు. బంధువులు వారిని ఆస్పత్రికి తరలించగా, అక్టోబర్‌ 8న కోమల్, 14న ఆనంద, 15న రోషన్‌ ప్రాణాలు వదిలారు. చనిపోయినవారంతా ఒకే తరహా లక్షణాలు కలిగివుండటం, అందరిలోనూ అవయవాల జలదరింపు, తీవ్రమైన వెన్నునొప్పి, తలపోటు, పెదవులు నల్లగా మారడం, నాలుక మొద్దుబారడం వంటి లక్షణాలు ఉండటానని గుర్తించిన వైద్యులు వారంతా విషప్రభావానికి గురై ఉంటారని పోలీసులకు తెలియజేశారు.

దీంతో ఆ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు మృతుడు రోషన్‌ భార్య సంఘమిత్రపై నిఘా ఉంచారు. తమదైన శైలిలో ఆమెను విచారణ చేయగా, నేరం అంగీకరించింది. రోసా పాత్రను కూడా వెల్లడించింది. దీంతో ఆమెతో పాటు ఈ హత్యల్లో పాలుపంచుకున్న రోసాను కూడా పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.  ఇంతకీ రోసాకు ఆ కుటుంబంతో ఉన్న వివాదం ఏమిటంటే.. రోసా చనిపోయిన విజయకు మరదలి వరస అవుతుంది. సమీపంలోని ఓ ఇంట్లో ఆమె నివసిస్తోంది. రోసా భర్త పూర్వీకుల ఆస్తిని విజయ, ఆమె సోదరీమణులతో పంచుకోవడంపై ఆమెకు విభేదాలున్నాయి. దీంతో సంఘమిత్రతో చేతులు కలిపి ఈ ఘాతుకానికి ప్లాన్‌ చేసింది. వీరిద్దరూ కలిసి ఆన్‌లైన్‌లో ఏదైనా విషం దొరుకుతుందేమోనని వెదికారు. ఆ తరవాత రోసా ఓ ప్రాంతానికి వెళ్లి అంతుచిక్కని పాషాణం సేకరించి తీసుకొచ్చింది. ఈ కేసులో మరో దారుణం ఏమిటంటే.. శంకర్, విజయ దంపతులను ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలోనూ విషం కలిపిన నీటిని రోసా వారికి తాగించింది. అందులో ఆయుర్వేద గుణాలున్నాయని చెప్పడంతో డ్రైవరు కూడా ఆ నీటిని కొంత తాగినట్టు తెలిసింది.

Source From: Maharashtra crime