రిఫ్రిజిరేటర్‌ పేలి ఆరుగురు మృతి

పంజాబ్‌లోని జలంధర్‌లోని ఒక ఇంట్లో రిఫ్రిజిరేటర్‌ పేలి ఆరుగురు మృత్యువాతపడ్డారు.


Published on: 10 Oct 2023 21:26  IST


అది ఆదివారం.. అందరూ ఇంటివద్దే ఉన్నారు.. అంతేకాదు, కాలక్షేపం కోసం అందరూ కలిసి టీవీ చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇంతలోనే ఒక్కసారిగా భారీ పేలుడు. ఆ వెంటనే మంటలు చెలరేగి.. శరవేగంగా ఇల్లంతా అలుముకున్నాయి. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకపోవడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. 

 

పంజాబ్‌లోని జలంధర్‌ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి రిఫ్రిజిరేటర్‌ కంప్రెషర్‌ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మృతి చెందినవారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులందరూ కలసి ఆదివారం రాత్రి టీవీ చూస్తుండగా పెద్ద శబ్దంతో ఈ పేలుడు సంభవించింది. ఆ తర్వాత మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న యశేపాల్‌ గాయ్‌ (70), ఆయన కుమారుడు ఇంద్రపాల్‌ (41), కోడలు రుచి గాయ్‌ (40), వారి 14 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు చిన్నారులు మానస, దియా, అక్షయ్‌ మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన ఇంద్రపాల్‌ సోమవారం నాడు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించారు. పేలుడుకు గల అసలు కారణం తెలుసుకునేందుకు ఫోరెన్సిక్‌ బృందం ఘటనా స్థలికి చేరుకుని శాంపిళ్లను సేకరించిందని పోలీసులు తెలిపారు. 

 

Source From: refrigirator fire