ఏలూరు జూట్ మిల్ ఇక చరిత్రలోనే

వందేళ్ల చరిత్ర కలిగిన శ్రీ కృష్ణ జ్యూట్ మిల్ కాల గర్భంలో కలిసిపోయింది. ఏలూరు నగరానికి మణిహారంగా వెలుగొంది, వేలాది మందికి ఉపాధి కల్పించిన ఈ పరిశ్రమ ఇప్పుడు లేదు. మూడేళ్ల క్రితం యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో మూతపడింది. ఇప్పుడు పూర్తిగా అంతర్ధానమైంది.


Published on: 05 Dec 2024 01:14  IST

రైలు పట్టాలకు ఆనుకుని గ్రాండ్ నేషనల్ ట్రంక్ (జిఎన్ టి) రోడ్ కు దగ్గరలో ఏలూరు నగరం నడిబొడ్డున వున్న జ్యూట్ మిల్ నగరానికి ఒక ల్యాండ్ మార్క్ గా ఇన్నాళ్లూ విరాజిల్లింది. నగర ఆర్థిక అభివృద్ధికి ఒక సిగ్నేచర్ లాగా రూపాంతరం చెందింది. బ్రిటిష్ కాలం లో రైలు పట్టాలు వేయడానికి,  కరెంట్ లైన్లు లాగడానికి ఉత్తరాంధ్ర నుంచీ వచ్చిన వందలాది వలస కార్మికులను అమ్మలా అక్కున చేర్చుకున్నది. పిడికెడు కూడు పెట్టి ఆదుకున్నది. తాడి అప్పల స్వామి, పూడి అప్పల స్వామి లాటి ట్రేడ్ యూనియన్ నాయకులకు పురుడు పోసింది.
రాత్రంబవళ్ళు  భవనాలను  నేలమట్టం చేసే పనిలో జేసీబీలు తల మునకలై  వున్నా.. మిల్లు శిధిలాలు మౌనంగా రోదిస్తున్నా.. నగరం మింగిన సగటు మనిషికి ఇవేమి పట్టడం లేదు. మిల్లు తల భాగాన విల్లులా నిర్మాణం అయివున్న ఫ్లైఓవర్ పైన ఎడ తెరిపిలేని వేలాది వాహనాల ట్రాఫిక్ ప్రవాహం. 
మిల్లు మరణావస్థను చూసి ఒక్క  క్షణం ఆగి ఒక్క కన్నీటి బొట్టు రాల్చే తీరిక కూడా ఎవరికీ ఉండదు. ఇక్కడ ఎవడి చావు వాడిదే. ఎవడి గోల వాడిదే!
నా చావుకు ఎవరు కారణం అని నేల కూలుతున్న భవనాలు ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తుంది. యజమాని మితిమీరిన లాభాపేక్షా? మిల్లు కార్మికులకు శాపంగా మారిన ట్రేడ్ యూనియన్ల అరాచకత్వమా? వాటి అనారోగ్య ఆధిపత్య రాజకీయాలా? లేకపోతె పెట్టుబడి దారుడిని గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న మార్క్సిస్ట్ ట్రేడ్ యూనియన్ నాయకులా? లేకపోతే జ్యూట్ పరిశ్రమకు మరణ శాపంగా మారిన అంబానీ మార్కు సింథటిక్ లాబీ ని అడ్డుకునే చేవ లోపించిన కమ్యూనిస్టులా? అన్నీ జవాబు దొరకని ప్రశ్నలే.
ఏమో! కార్మికుల్లో పని సంస్కృతిలో వచ్చిన మార్పు వల్ల కూడా వాళ్ళకి ఇక మిల్లు అవసరం తీరిపోయిఉండొచ్చు! సైరెన్ మోగే సమయానికి ఫ్యాక్టరీ లో హాజరు వేయించుకోవాలి. ఎనిమిది గంటలు విధిగా పనిలో ఉండాలి. పనికి రాలేనప్పుడు విధిగా ముందస్తు సెలవు పొందాలి. ఇదంతా కార్మికులకు బందీ ఖానా జీవితం అనుకోని ఉండొచ్చు. రోడ్ పక్కన ఒక మిక్స్చర్ బండి వేసుకున్నా , ఒక ఆటో నడుపుకున్న, పెయింటింగ్ పని చేసుకున్న, కొబ్బరి బొండాలు అమ్ముకున్న మిల్లు లో వచ్చే ఆ పాటి ఆదాయం రాకపోతుందా అని కార్మికుల్లో పెరుగుతున్న ధీమా వల్ల కూడా కావొచ్చేమో! ప్రభుత్వం నుంచి ప్రజలకు ఉదారంగా అందుతున్న  ఉచితాల వల్ల కూడా కార్మికులకు  ఇక మిల్లు ఆవరసరం తీరిపోయిఉండొచ్చు.
సుమారు 20 ఎకరాల జాగాలో ఇప్పుడు మిల్లు అయితే పోయింది. జ్యూట్ మిల్ ఇక మరో మల్టీప్లెక్స్ కు ల్యాండ్ మార్క్ కావొచ్చు. లేకపోతె విలాసవంతమయిన  విల్లాస్ కు చిరునామాగా కూడా మారొచ్చు. విస్తరిస్తున్న తిమింగలం లాటి నగరం ఆలా జ్యూట్ మిల్లును పొట్టన పెట్టుకుంది.

---
నాగరాజ గాలి ఫేస్ బుక్ వాల్ నుంచి

Source From: Eluru Jute Mill