ఫ్యూచర్ గ్రూపుని దివాళా తీయించిన అమెజాన్.. ! కార్పొరేట్ యుద్ధమంటే ఇదే

కార్పొరేట్ తిమింగలాలతో మామూలు కార్పొరేట్ శక్తులు కూడా తలపడలేవు. అందులోనూ అమెరికన్ కంపెనీల జిత్తులు ఆషామాషీగా ఉండవు. ఫ్యూచర్ గ్రూప్ నామ రూపాల్లేకుండా పోవడానికి అమెజాన్ పన్నిన వ్యూహాన్ని గమనిస్తే ఆర్థిక యుద్ధాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది


Published on: 28 Nov 2024 13:03  IST

ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఫ్యూచర్ గ్రూపుని బొంబాయిలో స్థాపించాడు కిశోర్ బియానీ. బిగ్ బజార్, లైఫ్ స్టయిల్, ఫుడ్ బజార్ ఇవి అన్నీ కలిసిన ఫ్యూచర్ రీటైల్ ని స్థాపించినది కిశోర్ బియానీ. ప్రపంచంలో  నంబర్ వన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ వాళ్ళు 2017 సంవత్సరానికి గాను "ఎ పర్సన్ ఆఫ్ ది ఇయర్" గా కిశోర్ బియానిని కొనియాడారు. కిశోర్ బియానీ స్థాపించిన ఫ్యూచర్ రీటైల్ ని "ది వాల్ మార్ట్ ఆఫ్ ఇండియా" అని పిలిచేవారు. ఇండియా రీటైల్ కింగ్ కిశోర్ బియానీ అని దాదాపు అన్ని అంతర్జాతీయ పత్రికలు వ్యాసాలు రాశాయి. ప్రపంచంలోని పెద్ద పెద్ద బిజినెస్ స్కూల్స్ లో కిశోర్ బియాని గురించి, ఇండియా లో ఉన్న బిగ్ బజార్, ఫ్యూచర్ రెటైల్ ఎదుగుదల గురించి, ఇన్నోవేషన్ గురించి పాఠాలు చెప్పేవారు.

కోవిడ్ సమయంలో నష్టాలు వచ్చి రిలయన్స్ గ్రూపు ముఖేష్ అంబానీకి తమ ఫ్యూచర్ గ్రూపు లోని రీటైల్, హోల్ సేల్స్, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ ని రూ.24, 713 కోట్లకి అమ్ముదామని ఒప్పందం కుదుర్చుకున్నారు కిశోర్ బియానీ.

ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా అమెజాన్ సంస్థ జెఫ్ బెజోస్ ఢిల్లీ హైకోర్ట్ లో, అంతర్జాతీయ కోర్టు సింగపూర్ లో ఫ్యూచర్ రీటైల్ కిశోర్ బియానీపై కేసులు వేశాడు.  ఫ్యూచర్ రీటైల్ ని అమ్మితే నాకే అమ్మాలి కానీ రిలయన్స్ వాళ్ళకి అమ్మటానికి వీలు లేదు అని కేసు వేశాడు. ముఖ్యంగా ఒక ఇండియన్ కి అదీ రిలయన్స్ ముఖేష్ అంబానీకి అమ్మటం నాకు ఇష్టం లేదు, నేను అమ్మనివ్వను అని అమెజాన్ అంది.

అయితే ఇక్కడ ఒక లిటిగేషన్ ఉంది. ఫ్యూచర్ కూపన్స్ అనే కిశోర్ బియానీ కంపెనీలో అమెజాన్ కి 49% వాటా ఉంది. ఆ ఫ్యూచర్ కూపన్స్ కి ఫ్యూచర్ రీటైల్ లో 7.3 % వాటా ఉంది. అందుకే నాకూ కొంత వాటా ఉన్న ఫ్యూచర్ రీటైల్ ని రిలయన్స్ కి అమ్మటం నాకు ఇష్టం లేదు అని ఢిల్లీ కోర్టులో కేసు వేస్తే మన ఢిల్లీ హైకోర్ట్ కూడా అమెజాన్ హక్కులకి భంగం కలగకూడదు అని అమెజాన్ వాళ్ళకే అనుకూలంగా తీర్పు ఇచ్చారు. మన దిక్కుమాలిన వ్యవస్థల్లో అలా రాసి ఉంది, వాళ్ళని తప్పు పట్టటానికి ఏమీ లేదు. ఏదైనా కంపెనీలో మనకి వాటా ఉంటే 10 ఏళ్ల లోపు మనం కొనుక్కోవాలంటే కొనుక్కొవచ్చు, మనకి ఇష్టం లేని వాళ్ళకి ఆ కంపెనీని అమ్మకూడదు.

అమెజాన్ వాడు ఇండియాతో పాటు సింగపూర్ లోని అంతర్జాతీయ కోర్ట్ లో కేసు వేశాడు, చివరికి మన సుప్రీం కోర్ట్ కూడా అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ వైపే తీర్పు ఇచ్చింది. మన కంపనీల్లో ఎవరికి వాటా ఉన్నా వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి అమ్మకూడదు.
కిశోర్ బియానీ ఏమో నష్టాలు వచ్చినా పర్వాలేదు, చివరికి తినటానికి అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ ఒక పాశ్చ్యాత్యుడికి అదీ అమెజాన్ లాంటి నయా అలెగ్జాండర్ కి నేను అమ్మను అని కూర్చున్నాడు. అమెజాన్ వాడు మాత్రం తాము పెట్టుబడులు పెట్టిన కంపనీలో తమ పెట్టుబడులు జీరో అయినా పర్వాలేదు కానీ ఆ కంపెనీ ని రిలయన్స్ వాళ్ళు కొనకూడదు అని నిర్ణయించుకున్నారు.

నిజానికి అదొక పెద్ద స్కెచ్. ఎక్కడ ఫ్యూచర్ రీటైల్ అమెరికాలోని వాల్ మార్ట్ లాగా ఇండియాలో ఎదుగుతుందో అని. ఒకవేళ ఫ్యూచర్ రీటైల్ ని ముఖేష్ అంబానీ గారు కొని ఉంటే ఇప్పుడు ప్రతి 2 కిలోమీటర్లకి ఒక ఫ్యూచర్ రీటైల్ ఉండేది వాల్ మార్ట్ లాగా. అప్పుడు అది అమెజాన్ వ్యాపారానికి కొంత అడ్డంకి అయ్యేది. అత్యంత తెలివిగా డైరక్ట్ గా ఫ్యూచర్ రీటైల్ లో పెట్టుబడులు పెట్టకుండా ఫ్యూచర్ కూపన్స్ లో పెట్టుబడులు పెట్టి చివరికి ఫ్యూచర్ గ్రూపు మీద పూర్తి కంట్రోల్ సాధించి 100 కి 100 శాతం ఫ్యూచర్ గ్రూపు కంపెనీని సంక నాకించారు అమెజాన్ వాళ్ళు.

కిశోర్ బియానీ ఫ్యూచర్ రీటైల్ స్టాక్ ఒకప్పుడు 600 పైనే ఉంటే ఇప్పుడు 2 రూపాయల చిల్లర ఉంది. 2001 లోనే ప్రపంచం మొత్తం లో CEO ఆఫ్ ది ఇయర్, 2004 లో బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్, 2005 లో రీటైల్ ఫేస్ ఆఫ్ ది ఇయర్ వస్తే ఇప్పుడు అమ్మటానికి పెట్టిన కేసుల్లో ఉండటం వలన తన కంపెనీ విలువ అంతా తగ్గి పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయి చివరికి తను కట్టించిన మొట్టమొదటి పురాతన బిల్డింగ్ కూడా అమ్మి అప్పులు తీర్చి అనామకుడిగా అయిపోయారు కిశోర్ బియానీ.

ఒక్కటి అంటే ఒక్క చెడ్డ అలవాటు లేదు కిశోర్ బియానీకి. చివరికి ఒక్కపొడి కూడా తినడు. అతని ఆఫీస్ గోడ మీద - చార్లీ చాప్లిన్, ఐన్ స్టెయిన్, మదర్ థెరిస్సా, ఇన్ ఫోసిస్ నారాయణ మూర్తి, శ్యాం రాబ్సన్ (వాల్ మార్ట్ స్థాపకుడు), రతన్ టాటా, చివరన ఖాళీ  అద్దం ఫ్రేంలు ఉంటాయి. అంత నిజాయతీ కలిగినవాడు, కష్టపడినవాడు, ఇన్నోవేటివ్ గా ఆలోచించిన వాడు భారత దేశ చరిత్ర లో లేడు.

కానీ ఒక ఇండియన్ కంపెనీని ఇంకో ఇండియన్ కంపెనీ కొనటం అమెరికన్ కంపెనీ అమెజాన్ కి ఇష్టం లేదు. ఎందుకంటే తమ పోటీదారుడు ఎదగటం వాళ్ళకి ఇష్టం లేదు. డైరక్ట్ గా మన సుప్రీంకోర్ట్ లో, సింగపూర్ అంతర్జాతీయ కోర్ట్ లో ఇదే చెప్పారు. రిలయన్స్ వాళ్ళు మాకు పోటీ దారులు. మా పోటీ దారులకి మేము పెట్టుబడులు పెట్టిన కంపనీలని ఎలా అమ్మనిస్తాం అని.

కేంద్ర ప్రభుత్వం కూడా గత బడ్జెట్ లో కొన్ని రంగాలలో 74% వరకు విదేశీ పెట్టుబడులు పెట్టొచ్చు అని చెప్పింది. ఈ మధ్య నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులకి సంబంధించి కొన్ని మార్పులు చేసినా
అవి మన చుట్టు పక్కన ఉండే దేశాలకి సంబంధించి మాత్రమే.

ఏదైతేనేమి రీటైల్ కింగ్ ఆఫ్ ఇండియా ఉద్యమంలో నేలకొరిగాడు. శ్యాం వాల్టన్ ఆఫ్ ఇండియా, ది బిగ్గెస్ట్ ఫెయిల్యూరర్ ఆఫ్ ఇండియా గా మిగిలిపోయాడు. అన్నింటికి మించి కేంద్రంలో నరేంద్ర మోడీ ఫుల్ మెజార్టీ  తో ప్రధాని గా ఉన్నప్పుడు జరిగింది ఈ సంఘటన. మోదీ అయినా ఇంకెవరు అయినా అంబానీకి సపోర్ట్ చేస్తారు, అదానీ కి సపోర్ట్ చేస్తారు అనుకోవటం పిచ్చితనం. ఈ గ్లోబల్ మార్కెట్ లో నిజానికి వాళ్ళూ ఏమీ చేయలేరు, చేయకూడదు కూడా. మన దేశం లో నంబర్ వన్ పారిశ్రామిక వేత్త రిలయన్స్ ముఖేష్ అంబానీ కూడా నష్టాల్లో ఉన్న ఒక కంపెనీ కొని సహాయం చేద్దాం అనుకున్నా కుదరలేదు.

ఆధునిక రామాయణంలో రక్తం కనిపించకుండా అందరిముందే మనలని లేపేస్తారు, అయినా ఒక్కరికీ కనిపించదు. మన కండ్ల ముందు మాత్రమే కాదు, మన వెనక, మన చుట్టు పక్కన ఏమి జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో కనీస అవగాహన అయినా ఉండాలి అంటాడు ఒక రోమన్ తత్వవేత్త.

- జగన్నాధ్ గౌడ్ 

Source From: Corporate war between Future group and Amazon