సూపర్ బజార్లకు మున్ముందు గడ్డు కాలమేనా !


Published on: 24 Nov 2024 13:40  IST

మాల్స్‌ వచ్చాక కిరాణా వ్యాపారానికి గండి పడింది. నెలకోసారి జీతం రాగానే  సూపర్‌ మార్కెట్‌లో ట్రాలీ నెట్టుకుంటూ అవసరమైనవి, లేనివి కొనుక్కుంటూ ఆనందాన్ని వెదుక్కోవడం చాలామందికి అలవాటైపోయింది. జనాన్ని ఆకట్టుకునే క్రమంలో వాళ్లకు అవసరమైనవి లేనివి కొనేలా కుప్పలు పోసి కారుచౌక బోర్డులు పెట్టేసి అసలు కొనాల్సిన వాటి గురించి మర్చిపోయి అవసరం లేని వాటిని ట్రాలీలో నింపుకుని  బోలెడు ఆదా చేశామని భ్రమ పడే వాళ్లు చాలామంది ఉంటారు. సెలవు వస్తే కూరగాయలు, సామన్లు, ఇంట్లో పనుల కోసం తీరిక లేని షెడ్యూల్ రెడీ ఉంటుంది.  మొన్న మా మిత్రుడితో మాట్లాడుతుంటే కూరగాయల ప్రస్తావన వచ్చింది.

వర్షన్ 3.0లో కూరగాయల ధరలు స్థిరకీరించిన విషయాన్ని పెద్దగా ఎవరు గుర్తించలేదనుకుంటా. ఏడాది క్రితం వరకు  రిటైల్ మార్కెట్‌లో కూరగాయలు కిలో రూ.40 ఉండేవి. మార్కెట్‌ ధరలతో సంబంధం లేకుండా, రైతు బజార్ల మాదిరి నాణ్యతతో సంబంధం లేకుండా కిలో ఏదైనా రూ.40కు విజయవాడ వంటి నగరాల్లో ఫిక్సిడ్‌ ధరలు ఉండేవి. ఉల్లి, వెల్లుల్లి, అల్లం వంటివి వీటికి మినహాయింపు. కొత్తగా రిటైల్ మార్కెట్‌లో కూరగాయల ధరలు రూ.60 అయ్యాయి అని చెప్పాడు.  రైతు బజార్లలో తక్కువే ఉంటాయి  కదా అంటే ఉండొచ్చు కానీ వీధి వ్యాపారులు, చిల్లర వర్తకులు, కాలనీల్లో కూరగాయల ధరల్ని రూ.60కు ఫిక్స్‌ చేసేశారని చెప్పాడు.

ఈ క్రమంలో మాల్స్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌ మీద చర్చ నడుస్తుంటే కొత్తగా వచ్చిన ఓ యాప్ గురించి చెప్పాడు. అందులో ట్రై చేసి చూడమని... నిన్న సరదాగా కూరగాయలు ఆర్డర్ చేశాను. సాధారణ కూరగాయలు అన్ని అరకిలోలు, పావు కిలోల లెక్కలో ఉన్నాయి. రైతు బజార్ రేట్లతో పోలిస్తే కాస్త ఎక్కువే. కొన్ని డబుల్‌ కూడా ఉన్నాయి. కావాల్సినవి బుక్ చేస్తే ఫ్రీ డెలివరీ, 9నిమిషాల్లోనే డెలివరీ చేస్తాం అని వచ్చింది.అలాగే అంటారులే ఎలా వస్తారు అనుకున్నాను. యాప్‌ ఆర్డర్ క్లోజ్‌ చేసి ఇందులో ఇంకేమి ఉన్నాయని చూస్తుండగానే కుర్రాడు కూరగాయల సంచితో వచ్చాడు. కొత్తిమీర కట్ట కాంప్లిమెంటరీ అట చెప్పి వెళ్లాడు.

కూరగాయలు ఫ్రెష్‌గా నీట్‌గా ప్యాక్‌ చేసి ఉన్నాయి. ఈ క్వాలిటీ, డెలివరీ టైమ్‌కి చెల్లించిన ధరకు ఫర్వలేదనిపించింది. ఇంత త్వరగా ఎలా డెలివరీ చేశారో అర్థం కాలేదు.కూరగాయలు ముందే ప్యాక్‌ చేసి రెడీగా ఉండొచ్చు. డెలివరీ విషయంలో మాత్రం వాళ్లు సక్సెస్‌ అయినట్టే.ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో వాటి సబ్‌ స్క్రిప్షన్‌ బట్టి డెలివరీ ఉంటుంది. అది కూడా కనీసం 24 గంటల సమయం పడుతుంది. 

మధ్య తరగతి అవసరాలు,ధరలు దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త వ్యాపారాలు  పుట్టుకొచ్చి ఉండాలి.ఈ డిస్కౌంట్ ధరలు, డోర్‌ డెలివరీలు సూపర్‌ మార్కెట్లను ఖచ్చితంగా దెబ్బతీస్తాయేమో.  అక్కడ ఏసీలు వేసి,  హెల్పర్లను పెట్టి లాభాలు లెక్కేసి అమ్మాలి. ఇందులో ఆ ఖర్చులన్నీ మిగులుతాయి. జనాలకు శ్రమ లేకుండా సరుకులు, కూరగాయలు ఇళ్లకే వచ్చేస్తాయి.

10-12 ఏళ్ల క్రితం హైదారాబాద్ లో ఉబర్, ఓల వచ్చినపుడు అమీర్పేట్ లో రాత్రి పూట విజయవాడ బస్సు మిస్ అయితే 100రూపాయల్లోపు చార్జితో LB నగర్ వచ్చి బస్ ఎక్కిన రోజులు ఉన్నాయి. ఇంత చౌకగా ఎలా సర్వీస్ ఇస్తున్నారు అనిపించేది. కూపన్ కోడ్ లు తెగ వచ్చేవి. ఇప్పుడు మెట్రో వాటిని కొట్టేసింది. మార్పు మన జేబులకు చిల్లు పడనంత వరకు మంచిదే...
 

Source From: Super bazars