కొన్ని ఆబ్లిగేషన్స్‌కి నో చెప్పలేకపోతే ఇలాగే ఉంటుంది

జగన్‌ హయాంలో ఒక ముంబయి హీరోయిన్‌ను వేధించి విజయవాడ పోలీసులు పెద్ద సెటిల్మెంట్‌ చేసిన వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అసలు ఏం జరిగింది? ఎందుకిలా జరిగింది? ఒక విశ్లేషణ.


Published on: 29 Aug 2024 15:21  IST


 
కొన్ని ఆబ్లిగేషన్స్‌కు నో చెప్పడం కష్టం. ఎక్కడో ఏదో ఒక బలహీనత వల్ల దెబ్బతింటామని తెలిసినా తప్పడుగు వేసేయడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కూడా అలా ఒక మురికిగుంటలో దిగి కూరుకుపోయారు. మాఫియా లాంటి ముంబయి మురికి కూపానికి చెందిన ఒక వ్యవహారంలో అనవసరంగా తలదూర్చి తనను అభిమానించేవారి దృష్టిలోనూ చులకనైపోయారు. తన స్నేహితుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్‌ జిందాల్‌ను రక్షించడం కోసం సరిదిద్దుకోలేని తప్పు చేశారు. ముంబయి హీరోయిన్‌ కాదంబరితో ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్‌ జిందాల్‌కు ప్రేమాయణమో, అక్రమ సంబంధమో, మరే రాచకార్యమో గానీ బాగా గట్టిగా ఉంది. కొంతకాలం బాగానే నడిచినా అది బెడిసి కొట్టి ఇద్దరు విడిపోయారు. వారి మధ్య ఉన్న గొడవలు ముదిరిపోయి జఠ్వాని ముంబయిలో సజ్జన్‌పై రేప్‌ కేసు పెట్టింది. ఆ కేసు నుంచి బయటపడేందుకు సజ్జన్‌ తన మిత్రుడైన ఏపీ సీఎం జగన్‌ను (అధికారంలో ఉన్నప్పుడు) ఆశ్రయించారు. ఎక్కడో ముంబయిలో జరిగినదానికి తానేం చేయగలనని ఆయన సున్నితంగా తిరస్కరించవచ్చు. కానీ వారిద్దరి మధ్య ఉన్న స్నేహం, ఆర్థిక  సంబంధాలు ఆ పని చేయనివ్వలేదు. మిత్రుణ్ణి ఎలాగైనా బయటపడేయాలని తన వందిమాగధులకు పురమాయించేశాడు. 

     ఇక్కడే ఇంకో ట్విస్ట్‌ ఉంది. జఠ్వానీకి వైఎస్సార్‌సీపీతో దూరపు సంబంధం ఉన్న కుక్కల విద్యా సాగర్‌తోనూ లింకు ఉంది. సజ్జన్‌ జిందాల్, జఠ్వానీ, కుక్కల విద్యా సాగర్‌.. ఈ ముగ్గురి మధ్య జరిగిన వ్యవహారమే ఇప్పుడు బయటకు వచ్చిన స్టోరీకి మూలకారణం. ఇబ్రహీంపట్నంలో విద్యాసాగర్‌కు ఉన్న భూమిని జఠ్వానీ కొనుగోలు చేసిందట. ఎక్కడో ముంబయిలో ఉండే సినీ నటి తనకు ఏమాత్రం పరిచయం లేని, అసలు తనకు తెలియని విజయవాడలో భూమి కొనడం ఏమిటి? అంటే విద్యా సాగర్‌తోనూ ఏదో బలమైన లింకే ఉండి ఉండాలి. దానికి సంబంధించిన లావాదేవీపైనే కుక్కల విద్యా సాగర్‌ ఆమెపై కేసు పెట్టాడు. సజ్జన్‌ కోసం తెలివిగా విద్యా సాగర్‌తో ఈ కేసు పెట్టించారనేది అభియోగం. విద్యా సాగర్‌కి, జఠ్వానీకి మధ్య కూడా గాఢమైన బంధమే ఉందని చెబుతున్నారు. దీంతో అతనితో కేసు పెట్టించి దాన్ని ఉపయోగించుకుని ఆమె కుటుంబం మొత్తాన్ని వేధించి ముంబయిలో సజ్జన్‌ జిందాల్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా చేశారు. ఇందులో అప్పటి విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ క్రాంతి రాణా, డీసీపీ విశాల్‌ గున్నీది కీలకపాత్ర. సీఎం ఆదేశం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వారికి ఆ సెటిల్మెంట్‌ చేయకతప్పలేదు. ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర చాలా తక్కువ. మధ్యలో సెటిల్మెంట్‌ ఎంతవరకు వచ్చిందో ఫాలోఅప్‌ చేసి ఉండవచ్చు. పూర్తిగా అప్పటి సీఎం జగన్‌ కనుసన్నల్లో ఈ వ్యవహారం నడిచింది. 

    అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో గోప్యంగా జరిగిన ఈ  మొత్తం భాగవతాన్ని బయటపెట్టేసింది. ఈ కేసులో కాదంబరికి అన్యాయం జరిగిందనడంలో సందేహం లేదు. అలా అని ఆమె పూర్తిగా అమాయకురాలనీ చెప్పలేం. ఆమె పలువురికి హనీ ట్రాప్‌ వేసిందని, అందులో సజ్జన్, విద్యాసాగర్‌ ఉన్నారని చెబుతున్నారు. ఆ ఉచ్చులోంచి బయటపడే క్రమంలోనే ఇదంతా జరిగినట్లు మరో వాదన వినిపిస్తోంది. ముంబయి వ్యవహారాలు అలాగే ఉంటాయి. అందులో జగన్‌ దూరడం ఏమిటి? దానికోసం తన ఫుల్‌ పవర్‌ను ఉపయోగించడం ఏమిటి? సజ్జన్‌కు నో చెప్పలేని పరిస్థితుల్లో ఇదంతా చేయాల్సివచ్చిందని అంటున్నారు. తనను కలిసిన నాయకులకు సిగరెట్‌ కాల్చవద్దు, మందు తాగవద్దని సూక్తులు చెప్పే జగన్‌ ఇంత పెద్ద తప్పుడు వ్యవహారాన్ని సెటిల్‌ చేయడం ఆబ్లిగేషన్‌కు నో చెప్పలేకపోవడమే కారణం. సజ్జన్‌ జిందాల్‌ను రక్షించే క్రమంలో తాను అభాసుపాలయ్యాడు.
 

Source From: sajjan jindal, ap cm