బెజవాడా.. ఇదా నీ అభివృద్ధి !!

    తాత్కాలిక రాజధానిగా ఉన్న విజయవాడ ఎందుకు అభివృద్ధి చెందడంలేదు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. పాలకుల నిర్లక్ష్యం, నాయకుల స్వార్థం, ఇక్కడి ప్రజల ఆలోచనా సరళి ఇవన్నీ కారణాలే. అసలు బెజవాడ పరిస్థితి ఏంటి..?


Published on: 25 Aug 2024 14:31  IST

 

    స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో బెజవాడ ఏం అభివృద్ధి చెందింది? అసలు బెజవాడ రూపు రేఖలు అప్పటికి, ఇప్పటికి ఏమైనా మారాయా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బెజవాడ వృద్ధి చెందలేదు. సొంత రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో ఏమీ అభివృద్ధి కనపడలేదు. మూడు ఫ్లైఓవర్‌లు నిర్మిస్తే అభివృద్ధి జరిగినట్లా! అసలు బెజవాడలో ఏమి ఉంది. అప్పుడు, ఇప్పుడు పాలకులు వచ్చిపోవడానికి అతిథి గృహంగానే ఉంది తప్ప మిగతా ఏ విషయంలోనూ ఒక్క అడుగు ముందుకు వేయలేదు. అవే రోడ్లు, అవే కాలనీలు.. ఇంతకు మించి ఏం మారింది. ఒక్క బందరు రోడ్డులో కాస్త లైట్లు వెలుగులు కనపడితే అది అభివృద్ధా? అసలు బెజవాడకు ఏముంది? బెంజిసర్కిల్‌లో ఉపయోగపడని ఫ్లైఓవర్‌లు అభివృద్దా? కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ గొప్ప అభివృద్ధా? గన్నవరం విమానాశ్రయం రెండవ ప్రపంచ యుద్ధం సమయంలోనే వందల విమానాలు చూసింది. బీసెంట్‌ రోడ్డు, బందరు రోడ్డు, అమ్మవారి దేవస్థానం, కృష్ణానది, ఎయిర్‌ పోర్ట్‌ ఇవి కాకుండా బెజవాడలో ఏమున్నాయి?

          ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాయకులందరూ బెజవాడను నిర్లక్ష్యం చేశారు. నగరం అభివృద్ధికి ప్రణాళిక రూపొందించిన ఒక్క ముఖ్యమంత్రి లేరు. ఎన్టీఆర్‌ను తీసుకుంటే ఒక్క మెడికల్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేశారు. దానివల్ల నగరానికి ఏం మేలు జరిగింది. ఎన్టీఆర్‌ ఈ జిల్లా వారే అయినా అభివృద్ధిలో ఏమీ ముందుకు వెళ్ళలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాను తీసుకున్నా జరిగింది శూన్యం. బందరు పోర్టు వందల ఏళ్ల నాడే ఉంది. ఇప్పుడు అది కూడా లేదు. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు విజయవాడలో ఉందని చెప్పుకోవడానికి లేదు. విజయవాడను ఉమ్మడి రాష్ట్రంలో గానీ, విభజిత రాష్ట్రంలో గాని అన్ని ప్రాంతాలతో కలిపే చూశారు తప్ప ప్రత్యేకంగా బెజవాడను ఎవరూ చూడలేదు. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇది బెజవాడ. ఒకప్పుడు 40 సినిమా హాళ్లు, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు ఉండేవి. కాలక్రమంలో అవి కాలగర్భంలో కలిసిపోయాయి.

పాత బెజవాడకు లైట్లు వేసి అభివృద్ధి అంటే దానిని ఎలా అంగీకరించాలి. కలెక్టర్‌ కార్యాలయం, పోలీస్‌ కమీషనర్‌ కార్యాలయాలేనా అభివృద్ధి. ఒకప్పుడు కమ్యూనిజం వల్ల బెజవాడ అభివృద్ధికి దూరమైందని అంటారు. మరి ఆ తర్వాతే ఏం మార్పు జరిగింది. ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి. ప్రభుత్వాలు మారాయి కానీ అభివృద్ధి జరిగిందా? ఇక్కడ బ్రతికిన నాయకులు బాగుపడ్డారు గాని బెజవాడ ఎందులో ప్రముఖంగా ఉంది. దేనికి బెజవాడ ప్రాధాన్యం అంటే ఏమి చెబుతారు. హైదరాబాద్‌ ఐటీ కేంద్రంగా మారింది. దానివల్ల హైదరాబాద్‌ ఆదాయం పెరిగి దేశంలో రెండవ రాజధాని అనుకునే స్థాయికి వెళ్లింది. పక్కనే ఉన్న గుంటూరు తీసుకుందాం.. ఐటీసీ, మిర్చి యార్డు, స్పిన్నింగ్‌ మిల్స్, అమరావతి రాజధాని ఇవన్నీ  ఉన్నాయి. బెజవాడలో ఏమున్నాయి? నేను ఉన్నా, మా నాన్న ఉన్నారు అని చెప్పుకోవడానికి మినహా ఎందుకు ఈ నగరం. ఒక పరిశ్రమ ఉందా? వంద మందికి ఉపాధి ఇచ్చే స్థాయి బెజవాడకు ఉందా? ప్రభుత్వాలు, నాయకులు అందుకు తగ్గట్టు బెజవాడను తయారుచేయడంలో విఫలమయ్యారు. గోల్డ్, బట్టల షాపులు 12 గంటల ప్రాతిపదికన 5 వేల మందికి ఉపాధి ఇస్తోంది. భారీగా జీఎస్టీ వచ్చే ఆదాయ మార్గాలు లేవు.

వినోదం ఏమైనా ఉందా? సినిమా హాళ్లు మూతబడిపోయాయి. ఇలాంటి బెజవాడను కొందరు నాయకులు తాము అభివృద్ధి చేశామని చెబుతారు.
ఆటోనగర్‌ను ఇందిరా గాంధీ తీసుకు వచ్చారు. ఇప్పుడు అది సమస్యలకు నిలయంగా మారింది. అక్కడా పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తే బెజవాడ అభివృద్ధి చెందినట్టు అవుతుందా? అమరావతికి, బెజవాడకు సంబంధం ఏమిటి ? అమరావతి నగరం ఏర్పడినా బెజవాడను బెజవాడగానే చూస్తారు. స్థానికంగా ఏ ప్రాజెక్టులు వచ్చాయని! అమరావతిలో బెజవాడ అంతర్భాగం అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. 

 

Source From: vijayawada