నాగార్జున ఎన్‌ కన్వెన్షన్, రెడ్‌బుక్‌కీ లింకుందా?

హైదరాబాద్‌లో సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూల్చివేయడం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అక్రమ కట్టడాలను కూల్చే పనిని హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్సాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌)కి అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు నాగార్జునపై పడింది. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు భావిస్తున్నారు. పైకి అక్రమ కట్టడం కాబట్టే కూల్చివేశామని చెబుతున్నా తెర వెనుక చాలా పెద్ద వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది.


Published on: 24 Aug 2024 13:42  IST

    మాదాపూర్‌లో ఉన్న ఎన్‌ – కన్వెన్షన్‌ సెంటర్‌ అక్రమ కట్టడమని గతంలోనే చాలా ఫిర్యాదులు వచ్చాయి. అయినా ఎప్పుడూ అధికారులు అటు వైపు వెళ్లలేదు. కేసీఆర్‌ ప్రభుత్వం గతంలో ఒకసారి పాక్షికంగా కొంత కూల్చినా ఆ తర్వాత వదిలేసింది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా కొద్ది గంటల్లోనే మొత్తం కన్వెన్షన్‌ను నేలమట్టం చేసేశారు. 

    రంగారెడ్డి జిల్లా శేరిలింగపల్లి మండలం ఖానామెట్‌ గ్రామంలో పదేళ్ల క్రితం నాగార్జున ఎన్‌ కన్వెన్షన్‌ను నిర్మించారు. ఇది తమ్మిడికుంట చెరువుకు ఆనుకుని ఉంటుంది. చెరువులోని మూడు ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్‌–కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించారనేది అభియోగం. పైగా FTL పరిధిలో దీన్ని నిర్మించారని చెబుతున్నారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారికంగా తన లెటర్‌ హెడ్‌ మీద హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేయడాన్ని బట్టి దీని వెనుక పెద్ద కథే నడిచినట్లు అర్థమవుతోంది.

    నాగార్జున ఏపీలో జగన్‌కు మద్ధతు పలకడమే ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతకు అసలైన కారణమనే వాదన వినిపిస్తోంది. నాగార్జున, జగన్‌ మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య చాలా సన్నిహిత సంబంధాలున్నాయని చెబుతారు. ఎంత సాన్నిహిత్యం ఉన్నా నాగార్జున ఎప్పుడూ బహిరంగంగా జగన్‌ను సపోర్ట్‌ చేయలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్‌ వంటి హీరోలతో కలిసి ఒకసారి జగన్‌ను కలిశాడు. ఆ తర్వాత కూడా సినీ ప్రముఖులతో రెండు, మూడు సమావేశాలు జరిగినా వాటికి నాగార్జున వెళ్లలేదు. జగన్‌తో తనకున్న స్నేహం మిగిలిన వారికి ఇబ్బంది కాకూడదనే ఆలోచనతో దూరంగా ఉన్నాడని అంటారు. ఇదంతా ఒక వెర్షన్‌ మాత్రమే. 

    గత ఎన్నికల్లో నాగార్జున వైఎస్సార్‌సీపీకి మద్ధతు ఇచ్చాడని టీడీపీ పెద్దలు భావించారట. పైకి ఎక్కడా కనిపించకపోయినా లోలోన జగన్‌ మళ్లీ సీఎం కావాలని కోరుకోవడంతోపాటు అందుకు తన వంతు సహకారాన్ని తెరచాటుగా అందించాడని అంటారు. ఇది నిజమని చంద్రబాబు శిబిరం నమ్మిందని చెబుతున్నారు. దీనికితోడు రేవంత్‌రెడ్డితోనూ నాగార్జునకు సరైన సంబంధాలు లేవు. అదీకాక అధికారంలోకి వస్తే ఎన్‌–కన్వెన్షన్‌ను కూల్చివేస్తానని గతంలోనే రేవంత్‌ ప్రకటించాడు. చంద్రబాబు శిబిరం అసంతృప్తి, రేవంత్‌తో నాగార్జునకు సత్సంబంధాలు లేకపోవడంతో అక్రమ కట్టడాల కూల్చివేతల్లో భాగంగా ఎన్‌–కన్వెన్షన్‌ను టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు టీమ్‌ తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఎన్‌–కన్వెన్షన్‌ను కూల్చివేయించిందనే టాక్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ, పొలిటికల్‌ సర్కిల్స్‌లో బాగా వినిపిస్తోంది. 

    ఏపీలో రెడ్‌బుక్‌ పాలన నడుస్తోందని వైఎస్సార్‌సీపీ ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేస్తోంది. నాగార్జునకు చెందిన కన్వెన్షన్‌ను కూల్చడం కూడా రెడ్‌బుక్‌ ప్రభావమేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంటే రెడ్‌బుక్‌లో నాగార్జున పేరు ఉన్నట్టేనా? ఈ ప్రశ్నకు కొద్దిరోజుల్లోనే సమాధానం దొరికే అవకాశం ఉంది. 
 

Source From: Nagarjuna N Convention demolished