ఆ ఐపీఎస్‌లకు కానిస్టేబుళ్ల డ్యూటీ.. ఏపీ ప్రభుత్వం ర్యాగింగ్‌

ఆ ఐపీఎస్‌లకు కానిస్టేబుళ్ల డ్యూటీ.. ఏపీ ప్రభుత్వం ర్యాగింగ్‌ తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిన అధికారులను అధికారంలోకి వచ్చాక ఒక చూపు చూడడం ఏ పార్టీ అయినా చేసే పనే. కానీ ఆ విషయంలో ఇప్పుడు టీడీపీ కొత్త పాఠాలు నేర్పుతోంది. ఇప్పటికే చాలామంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా పూర్తిగా పక్కన పెట్టేసింది. వాళ్లకి ఆ ట్రీట్‌మెంట్‌ సరిపోదని భావించిందేమో. ఏకంగా కానిస్టేబుళ్లకు డ్యూటీలు వేసినట్లు డ్యూటీలు వేసి కసి తీర్చుకుంది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు సీతారామాంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, సునీల్‌కుమార్, సంజయ్, క్రాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీ తదితర 16 మంది ఐపీఎస్‌ అధికారులను అవమానించేలా ప్రతిరోజూ డీజీపీ కార్యాలయానికి వచ్చి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండాలని డీజీపీ ప్రత్యేకంగా ఉత్తర్వులిచ్చారు. డీజీపీ ఆఫీసుకు వచ్చినప్పుడు, వెళ్లేటప్పుడు సంతకాలు పెట్టాలని సాక్షాత్తూ ఆదేశించారు. సీతారామాంజనేయులు ఇంటిలిజెన్స్‌ డీజీగా పని చేశారు. ఈ పోస్టు అనధికారికంగా డీజీపీ కంటె ప్రాధాన్యమైందనే చెప్పాలి. అలాంటి అధికారిని ఆఫీసుకు వచ్చి ఉదయం, సాయంత్రం సంతకం పెట్టాలని ఏకంగా పేరు పెట్టి ఉత్తర్వులివ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఆల్‌ ఇండియా సర్వీసు అధికారులను ఇలా కానిస్టేబుల్‌ స్థాయికి దిగజార్చి ఇబ్బంది పెట్టడమే బహుశా ఎక్కడా జరిగి ఉండదు.


Published on: 14 Aug 2024 19:37  IST

 
    ఏపీలో కొందరు ఐఏఎస్‌ అధికారులకూ పోస్టింగ్‌లు ఇవ్వలేదు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, రజత్‌ భార్గవ, రేవు ముత్యాలరాజులను పూర్తిగా పక్కన పెట్టారు. వారిని సాధారణ పరిపాలన శాఖలో ఇబ్బందులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆల్‌ ఇండియా సర్వీసు అధికారులకు ఈ పరిస్థితి రావడం విచారకరమే. గతంలో చంద్రబాబు హయాంలో ఆయన బాగా దగ్గరగా పనిచేసి అధికారులను సైతం జగన్‌ వదిలేశారనే పేరుంది. ఒక్క ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో మాత్రమే పంతానికిపోయారు. 29 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు లాబీయింగ్‌ చేసిన సతీష్‌ చంద్రకి సైతం జగన్‌ హయాంలో మంచి పోస్టింగ్‌ దక్కింది. గౌరవప్రదంగా రిటైర్‌ అయ్యారు. అప్పట్లో డీజీపీగా పని చేసి జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా కామెంట్‌ చేసిన ఆర్పీ ఠాకూర్‌కి సైతం జగన్‌ చివర్లో మంచి పోస్టే ఇచ్చారు. కానీ ఇప్పుడు టీడీపీ మాత్రం జగన్‌కు సహకరించిన అధికారులను వెంటాడి వేధిస్తోంది. ఏదైనా కేసులో దొరికితే బుక్‌ చేయాలని చూస్తోంది. లేకపోతే రకరకాల అవమానాలకు గురిచేస్తోంది. దీంతో ప్రస్తుతం ఏపీలో బ్యూరోక్రాట్ల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. 
 

Source From: ap news, ips officers, andhra news, ap, ap today