ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన బంగ్లా పాఠం

నిజానికి దాని పేరు బంగ్లాదేశ్‌ కాదు, తూర్పు బెంగాల్‌ (ఆ తర్వాత తూర్పు పాకిస్థాన్‌). తన పార్టీ సభ్యులకు (ఒకప్పటి స్వతంత్ర సమరయోధులు), వారి పిల్లలకు, మనుమలకూ సివిల్‌ సర్వీసుల్లో 30% ఉద్యోగాలు కల్పించి, తాను బతికున్నంత కాలం ప్రభుత్వం, ప్రభుత్వ వ్యవస్థలను తన గుప్పిట్లోనే ఉంచుకోవాలన్న ప్రస్తుత ప్రధాని షేక్‌ హసీనా నియంత్రృత్వ ఆలోచన కారణంగా బంగ్లాదేశ్‌లో ఢాకా యూనివర్శిటీ విద్యార్థులు చేసిన ఉద్యమం అది


Published on: 06 Aug 2024 23:25  IST

 

పుట్టు పూర్వోత్తరాలలోకి వెళితే... 

సారవంతమైన గంగా–బ్రహ్మపుత్ర నదుల మైదాన ప్రాంతంలో ఉన్న దేశం బంగ్లాదేశ్‌ (తూర్పు బెంగాల్‌). 1947లో ఇండియా పాకిస్థాన్‌ విడిపోనప్పుడు అతి పెద్ద రాష్ట్రం బెంగాల్‌ రెండుగా విడిపోయింది. హిందువులు ఎక్కువగా ఉన్న పశ్చిమ ప్రాంతం పశ్చిమ బెంగాల్‌ని ఇండియాలో కలిపారు. ముస్లింలు ఎక్కువుగా ఉన్న తూర్పు బెంగాల్‌ని పాకిస్థాన్‌లో కలిపారు బ్రిటీష్‌ వాళ్ళు. పాకిస్థాన్‌ ఏర్పడ్డాక ప్రస్తుత పాకిస్థాన్‌ని అప్పట్లో పశ్చిమ పాకిస్థాన్‌గా పిలిచేవారు. ఇప్పటి బంగ్లాదేశ్‌ను అప్పటి తూర్పు పాకిస్థాన్‌గా పిలిచేవాళ్లు. 

  తూర్పు పాకిస్థాన్‌ ఆర్ధికంగా, వ్యవసాయ పరంగా ముందుంటే పశ్చిమ పాకిస్థాన్‌ పరిస్థితి వేరేలా ఉండేది. తూర్పు పాకిస్థాన్, పశ్చిమ పాకిస్థాన్‌ మీద ‘అవామీ లీగ్‌’గా ఏర్పడి గెరిల్లా  పోరాటం, ఉద్యమం చేస్తూ ఉండేవాళ్ళు. 1971లో ఈ పోరాటం ఉధృతరూపం దాల్చింది. అప్పట్లో భారత్‌ డైరక్ట్‌గా యుద్ధంలోకి దిగి తూర్పు పాకిస్థాన్‌కి మద్ధతుగా పోరాడింది. దీంతో పశ్చిమ పాకిస్థాన్‌ ఓడిపోయి ప్రస్తుత పాకిస్థాన్‌గా ఏర్పడితే తూర్పు పాకిస్థాన్‌ బంగ్లాదేశ్‌గా డిశెంబర్‌ 16, 1971న ఏర్పడింది.  

ఆది నుంచి భారతదేశం, బంగ్లాదేశ్‌కి సపోర్ట్‌గానే ఉండేది. నిజానికి వాళ్ళు అంతా బెంగాలీలు. ఒకప్పుడు పాకిస్థాన్‌ మీద పోరాడి ప్రత్యేక బంగ్లాదేశ్‌ సాధించిన ‘అవామీ లీగ్‌ పార్టీ’ ఉద్యమ నాయకుడు, బంగ్లాదేశ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ముజిబుర్‌ రెహ్మాన్‌ కుమార్తె ప్రస్తుత బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా. 2009 జనవరి 6 నుంచి ఇప్పటివరకు ఆమె బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రిగా ఉంది. 

షేక్‌ హసీనా పాలనలో బంగ్లాదేశ్‌ ఆర్ధికంగా కొంచెం మెరుగు పడింది. కానీ నియంత పాలనలా సాగింది. మీడియాని, ప్రతిపక్ష పార్టీలను ఎక్కడికక్కడ తొక్కి పడేసింది. గత ఎన్నికల్లో రిగ్గింగ్‌ చేసి గెలిసిందనే అపవాదు కూడా ఉంది. కానీ షేక్‌ హసీనా తండ్రి నుంచి షేక్‌ హసీనా వరకు భారత్‌కి మంచి స్నేహితులు. అందుకే ఇప్పుడు కూడా హసీనా ప్రధాని పీఠం దిగిపోతే భారత్‌ ఆమెకు ఆశ్రయం ఇచ్చింది. 

  షేక్‌ హసీనా తన అధిపత్యాన్ని కొనసాగించటానికి పాకిస్థాన్‌ మీద పోరాడిన బంగ్లాదేశ్‌ వాళ్ళకి, అంటే వాళ్ళ దేశ స్వతంత్ర సమరయోధులకి సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్స్‌ తేవాలని నిర్ణయించింది. నిజానికి వాళ్లలో అత్యధిక భాగం తన పార్టీ అవామీ లీగ్‌ సభ్యులే. వాళ్ళు మరణించాక వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లల పిల్లలకి 30% సివిల్‌ సర్వీసెస్‌లో రిజర్వేషన్స్‌ కల్పించి తన వాళ్ళే, తన అవామీ లీగ్‌ సభ్యులే ప్రభుత్వంలోని అన్ని వ్యవస్థల్లో ఎక్కువ ఉండేలా దుర్మార్గపు ఆలోచన చేసింది షేక్‌ హసీనా.                 

అయితే ఈ రిజర్వేషన్లకి వ్యతిరేకంగా ఢాకా యూనివర్శిటీలో విద్యార్ధులు చేసిన నిరసనలు దేశం అంతా వ్యాప్తి చెంది హింసాత్మకంగా మారాయి. షేక్‌ హసీనా ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి తగ్గి రిజర్వేషన్ల కోటా తగ్గించినా పరిస్థితిలో మార్పు రాలేదు. విద్యార్ధుల ఆందోళనలు హింసాత్మకంగా మారి ప్రభుత్వాన్ని కూల్చేంత వరకూ వెళ్లాయి. ఈ తిరుగుబాటు ఆందోళనలకు ప్రతిపక్షాలు, ఆర్మీ కుట్ర పూరితంగా మద్ధతు పలికాయి.

అసలు సమస్య ఏంటంటే మన దేశానికి షేక్‌ హసీనా తండ్రి నుంచి ఆమె వరకు మంచి సంబంధాలున్నాయి. ఇప్పటివరకు బంగ్లాదేశ్‌ – భారత్‌ స్నేహ పూర్వక సంబంధాలు ఉన్నాయి. కానీ అక్కడి ప్రతిపక్ష పార్టీ వ్యవహారం ప్రస్తుత పాకిస్థాన్‌ తరహాలో ఉంటుంది. ఆందోళనలు హింసాత్మకంగా మారడం, షేక్‌ హసీనాను కుట్ర పూరితంగా  పదవి నుంచి దించడంలో పాకిస్తాన్‌ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అక్కడ అర్మీ లేదా ప్రతిపక్ష పార్టీ బంగ్లా గద్దె నెక్కితే అది ఇండియాకి వ్యతిరేకంగా, పాకిస్థాన్‌కి మద్ధతుగా నిలబడతాయి. ఇది మన దేశానికి ఇబ్బందికరంగా మారుతుంది.

(రచయిత–జగన్నాథ్‌ గౌడ్‌)

Source From: Bangladesh