కేరళ విధ్వంసానికి 'ఆకాశ నదులే' కారణమా?

దేశంలోని అనేక ప్రాంతాలను ఇటీవల భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ప్రకృతి విపత్తుల కారణంగా వందలమంది ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. మన దేశంలో, దక్షిణ ఆసియా ప్రాంతంలో వరదలు అసాధారణమేమీ కాదు. కానీ, వాతావరణ మార్పుల కారణంగా రుతుపవన వర్షపాతంలోనూ మార్పులొస్తుండడం తీవ్ర పరిణామాలను దారితీస్తోంది. అతి తక్కువ వ్యవధిలోనే భారీ వర్షాలు కురవడం, సుదీర్ఘ కాలం వర్షాలు లేకపోవడం వంటి అసాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో తేమ గణనీయంగా పెరిగి 'అట్మాస్ఫియరిక్ రివర్స్' అనే భారీ నీటి ఆవిరి పాయలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వీటినే ఆకాశ నదులు (ఫ్లయింగ్ రివర్స్) అంటున్నారు.


Published on: 04 Aug 2024 23:19  IST

మహా సముద్రాల్లోని నీరు వేడెక్కినప్పుడు భారీ మొత్తంలో నీరు ఆవిరిగా మారి, ఆకాశంలో కంటికి కనిపించని నీటి ఆవిరి పాయలుగా ఏర్పడతాయి.

వాతావరణంలోని దిగువ భాగంలో ఈ నీటి ఆవిరి భారీ పట్టీగా ఏర్పడి.. వేడి ప్రాంతం నుంచి చల్లని వాతావరణం వైపు కదులుతూ అక్కడ ఒక్కసారిగా వర్షంగా లేదా మంచుగా కురవడంతో, అది భారీ వరదలకు, మంచుచరియలు విరిగిపడి విధ్వంసానికి కారణమవుతుంది.

భూమి ‘మధ్యస్థ అక్షాంశాల’(కర్కాటక రేఖ-ఆర్కిటిక్ వలయం, మకర రేఖ - అంటార్కిటికా వలయం మధ్య ఉన్న ప్రాంతం) మధ్య కదులుతున్న నీటిఆవిరిలో 90 శాతాన్ని ఈ ఫ్లయింగ్ రివర్స్ మోసుకెళ్తుంటాయి.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నది అయిన అమెజాన్ సాధారణ ప్రవాహానికి దాదాపు రెండింతలు ఎక్కువ.

భూమి వేగంగా వేడెక్కుతుండడంతో ఈ ఫ్లయింగ్ రివర్స్ భారీ పరిమాణంలో (పొడవుగా, వెడల్పుగా), మరింత తీవ్రంగా మారుతున్నాయని, అవి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రమాదంలోకి నెడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భారత్‌లో హిందూ మహాసముద్రం వేడెక్కడం ఫ్లయింగ్ రివర్స్ ఏర్పడి జూన్ - సెప్టెంబర్ మధ్య వచ్చే రుతుపవనాల ప్రభావాన్ని పెంచుతున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు.

2023లో నేచర్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, 1951- 2020 సంవత్సరాల మధ్య భారతదేశంలో వర్షాకాలంలో మొత్తం 574 ఆకాశ నదులు ఏర్పడ్డాయి.

"గత రెండు దశాబ్దాల్లో ఏర్పడిన అత్యంత భారీ ఫ్లయింగ్ రివర్స్ భారతదేశంలో 80 శాతం వరదలకు కారణమయ్యాయి" అని ఈ అధ్యయనం పేర్కొంది.

1985- 2020 మధ్య రుతుపవనాల సమయంలో భారత్‌లో వచ్చిన 10 అత్యంత భారీ వరదలకు ఇలాంటి 7 ఫ్లయింగ్ రివర్స్‌కి సంబంధం ఉన్నట్లు ఈ అధ్యయనకర్తలలో ఒకరైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం గుర్తించింది.

ఇటీవలి దశాబ్దాల్లో హిందూ మహాసముద్రం నుంచి నీరు ఆవిరిగా మారడం గణనీయంగా పెరిగిందని, వాతావరణం వేడెక్కడం వల్ల ఫ్లయింగ్ రివర్స్ ఏర్పడి, వాటి వల్ల వచ్చే వరదలు పెరిగాయని అధ్యయనం తెలిపింది.

"రుతుపవనాల సమయంలో భారత ఉపఖండం వైపు పయనించే తేమలో హెచ్చుతగ్గులు పెరుగుతున్నాయి" అని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీకి చెందిన వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ రాక్సీ మాథ్యూ కొల్ బీబీసీతో చెప్పారు.

"దీని ఫలితంగా, వెచ్చని సముద్రాల్లోని నీటి ఆవిరి అంతా కొన్నిగంటలు, కొన్ని రోజుల వ్యవధిలో ఫ్లయింగ్ రివర్స్‌గా మారి అతితక్కువ సమయంలో కుండపోతగా కురుస్తోంది. ఇది దేశవ్యాప్తంగా ఆకస్మిక వరదలకు, కొండచరియలు విరిగిపడడానికి కారణమవుతోంది" అన్నారాయన.

ఒక ఫ్లయింగ్ రివర్ పరిమాణం సగటున 2,000 కిలోమీటర్ల పొడవు, 500 కిలోమీటర్ల వెడల్పు, 3 కిలోమీటర్ల లోతు ఉంటుంది.

అయితే, అవి ఇప్పుడు మరింత భారీగా మారుతున్నాయి. కొన్ని ఫ్లయింగ్ రివర్స్ 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటున్నాయి.

అంతేకాకుండా, అవి మనుషుల కంటికి కనిపించవు.

"వాటిని ఇన్‌ఫ్రారెడ్, మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీలతో చూడొచ్చు" అని నాసా జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీలో వాతావరణ పరిశోధకుడు బ్రియాన్ కాన్ చెప్పారు.

"అందుకే ప్రపంచవ్యాప్తంగా నీటిఆవిరిని, ఫ్లయింగ్ రివర్స్‌ను అంచనా వేసేందుకు శాటిలైట్ ద్వారా పరిశీలించడం చాలా ఉపయోగకరం" అని కాన్ అన్నారు.

అలాగే, రుతుపవనాలు, తుపానులు, మధ్యప్రాచ్యంలో ఏర్పడి పశ్చిమం వైపు కదిలే తుపానులు వంటి వాతావరణ పరిస్థితులు కూడా వరదలకు కారణమవుతాయి.

1960ల నుంచి పరిశీలిస్తే, వాతావరణంలో నీటిఆవిరి 20 శాతం వరకూ పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి.

దక్షిణ ఆసియా ప్రాంతంలో 56 శాతం విపరీత వాతావరణ పరిస్థితులకు (భారీ వర్షపాతం, హిమపాతం) ఫ్లయింగ్ రివర్స్‌కు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే, ఈ విషయంలో అధ్యయనాలు పరిమితంగానే జరిగాయి.

ఫ్లయింగ్ రివర్స్‌‌కీ, రుతుపవనాల వల్ల కురిసే భారీ వర్షాలకూ మధ్య సంబంధం గురించి ఆగ్నేయాసియా ప్రాంతంలో అధ్యయనాలు జరిగాయి.

Source From: Flying rivers