కొవిడ్‌ వ్యాక్సిన్ల వల్లే ఆ సమస్యలు


Published on: 23 Feb 2024 14:46  IST


కంటికి కనిపించని కరోనా వైరస్‌ మానవాళిపై పంజా విసిరిన వేళ.. ఆ ప్రాణాంతక వైరస్ పై పోరాటంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఆశాదీపంలా కనిపించింది. వైరస్‌ స్వైరవిహారానికి అడ్డుకట్ట వేసింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో గుండె, రక్త సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయనే వార్తలు కలవరపెట్టాయి! వాటికి బలం చేకూర్చేలా ఈ మధ్యకాలంలో పెరుగుతున్న గుండె, మెదడు, రక్త సంబంధిత వ్యాధులకు కరోనా వ్యాక్సిన్లే కారణమని తాజా అధ్యయనం గుర్తించింది. వివిధ దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. ఆ వివరాలను వ్యాక్సిన్‌ అనే సైన్స్‌ జర్నల్‌లో నివేదించారు.

ఎనిమిది దేశాల్లో పరిశోధనలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పరిశోధనా విభాగమైన గ్లోబల్‌ వ్యాక్సిన్‌ డేటా నెట్‌వర్క్‌కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ క్రమంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్లు 13 రకాల ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేశాయని వారు వెల్లడించారు. భారత్‌ మినహా. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, న్యూజిలాండ్‌, స్కాట్లాండ్‌ వంటి దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న 9.9 కోట్ల మందిపై వారు అధ్యయనం నిర్వహించారు. ఈ క్రమంలో కొన్ని రకాల ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో గుండె కండరాల వాపునకు కారణమయ్యే మయోకార్డిటిస్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించారు. దీనితోపాటు గులియన్‌ బారె సిండ్రోమ్‌, పెర్కిర్డిటిస్‌, సెరిబ్రల్‌ వీనస్‌ సైనస్‌ థ్రాంబోసిస్‌ వంటి కేసులు 1.5 రెట్లు పెరిగాయని పేర్కొన్నారు.

మోడెర్నా, ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా తీసుకున్నవారిలో

ఫైజర్‌-బయోఎన్‌టెక్‌, మోడెర్నాకు చెందిన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ల మొదటి మూడు దశల మోతాదులు తీసుకున్న వారిలో మయోకార్డిటిస్‌ కేసులను ఎక్కువగా గుర్తించారు. మోడెర్నా రెండో డోసు తీసుకున్న తర్వాత ఈ కేసులు అధికంగా పెరిగాయని పేర్కొన్నారు. అలాగే ఆస్ట్రాజెనెకా టీకాలు మూడు డోసులు తీసుకున్న వారిలో పెరికార్డిటిస్‌ అనే గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 6.9 శాతం పెరిగిందని చెప్పారు. మోడెర్నా టీకాల నాలుగో డోసు తీసుకున్న వారిలో ఈ ప్రమాదం 2.6 శాతం పెరిగినట్టు గుర్తించారు. ఆస్ట్రాజెనెకా టీకాలు తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టే వ్యాధిబారిన పడే ప్రమాదం 3.2 రెట్లు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అలాగే రోగనిరోధక వ్యవస్థ, నరాలపై దాడి చేసే గులియన్‌ బారె సిండ్రోమ్‌ను కూడా గుర్తించినట్టు చెప్పారు

కొవిడ్‌ టీకాతో ప్రయోజనాలే అధికం

కొవిడ్‌-19 టీకాలు తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల కంటే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు. కాబట్టి కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడం ఇప్పటికీ సురక్షితమైన మార్గమని వారు వెల్లడించారు. కాగా, కొవిడ్‌-19 సోకిన ఏడాదిలోనే చాలామంది కోలుకోగా.. మరికొందరికి ఊపిరితుత్తులు శాశ్వతంగా దెబ్బతిన్నాయని తాజా అధ్యయనంలో గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు.

Source From: Vaccine