మోస్ట్‌ పాపులర్‌ సీఎం నవీన్‌ పట్నాయక్‌


Published on: 18 Feb 2024 13:54  IST

దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా నవీన్‌ పట్నాయక్‌ నిలిచారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి రెండో స్థానం లభించింది. మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వేలో 52.7 శాతం ఓట్లతో ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మొదటి స్థానం దక్కించుకున్నారు. 51.3 రేటింగ్‌ తో యోగి రెండో స్థానంలో నిలిచారు.
    వివాదరహితుడిగా, అందరికీ ఆమోదయోగ్యుడిగా ఉండి అవినీతి మరక లేకుండా పాలిస్తున్న నవీన్‌ పట్నాయక్‌ను ఈ సర్వేలో ప్రజలు బెస్ట్‌ సీఎంగా తేల్చారు. ఇక, 48.6 శాతం ఓట్లతో అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ మూడో స్థానంలో ఉండగా.. నాలుగో స్థానంలో నిలిచిన గుజరాత్‌ సీఎం భూపేంద్ర పాటిల్‌కు 42.6 శాతం ఓట్లు దక్కాయి. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహాకు ఈ సర్వేలో 41.4 శాతం ఓట్లు దక్కాయి. ప్రజాదరణలో ఆయన ఐదో స్థానంలో ఉన్నారు.

మాణిక్‌  సాహా తర్వాతి స్థానంలో 41.1 శాతం ఓట్లతో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్, 40.1 శాతం ఓట్లతో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ఈ లిస్టులో ఆరు, ఏడో స్థానాల్లో నిలిచారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ కు ఓటర్లు ఎనిమిదో స్థానం కట్టబెట్టారు. ఈ సర్వేలో కేజ్రీవాల్‌కు కేవలం 36.5 శాతం మంది మాత్రమే ఓటేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ 35.8 శాతం ఓట్లతో తొమ్మిదో స్థానంలో, 32.8 శాతం ఓట్లతో బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదో స్థానంలో నిలిచారు. 
    ఇదిలావుండగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం ఈ సర్వే చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. 2, 3, 4, 5 స్థానాలు వరుసగా బీజేపీ సీఎంలకు రావడం, కేజ్రీవాల్‌కు 8వ స్థానం ఇవ్వడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 

Source From: most popular cm