ఇప్పుడే చదవకపోయినా సరే, పుస్తకాలు సేకరించి పెట్టుకోండి


Published on: 15 Feb 2024 01:00  IST

ఇప్పుడే చదవకపోయినా సరే, పుస్తకాలు సేకరించి పెట్టుకోండి

ఇటాలియన్ తత్వవేత్త, భాషా శాస్త్రవేత్త, నవలారచయిత, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు, విజ్ఞాన సర్వస్వం అని పేరు పొందిన అంబర్టో ఎకో (1932-2016) జీవితకాలంలో సేకరించిన పుస్తక సంపద ప్రపంచంలో అతి పెద్ద వ్యక్తిగత గ్రంథాలయాలలో ఒకటి. మిలాన్ ఇంట్లో 30,000 పుస్తకాలు, ఆర్బినో ఇంట్లో 20,000 పుస్తకాలు ఉండేవి. ఆయన లైబ్రరీ మీద ‘అంబర్టో ఎకో: ఎ లైబ్రరీ ఆఫ్ ది వరల్డ్’ అని డేవిడ్ ఫెర్రారియో 2023లో ఒక డాక్యుమెంటరీ కూడా తీశాడు. 

ఎకో కుటుంబంతో ఒప్పందం చేసుకుని ఆ యాబైవేల పుస్తకాలనూ 2021 జనవరిలో ఇటలీ ప్రభుత్వం తరఫున సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ సేకరించింది. మిలాన్ లోనూ,బొలోనా విశ్వవిద్యాలయం లోనూ ఆ లైబ్రరీలు నిర్వహిస్తున్నది. 

ఆయన తన దగ్గరికి వచ్చే సందర్శకులను రెండు రకాలుగా విభజించేవాడట. ఒక రకం ఉబ్బి తబ్బిబ్బవుతూ, “అబ్బ, గౌరవనీయ ప్రొఫెసర్ డాక్టర్ ఎకో గారూ, మీ దగ్గర ఎంత పెద్ద లైబ్రరీ ఉంది! వీటిలో ఎన్ని పుస్తకాలు మీరు చదివి ఉంటారు?” అని సంభ్రమాశ్చర్యాల ప్రశ్న వేసేవారట. మరొకరకం, వచ్చినవారిలో అతి కొద్దిమంది మాత్రం పెద్ద ప్రైవేట్ లైబ్రరీ అనేది ఏదో ఆయనకు కీర్తి కిరీటాలు తొడిగేది కాదని, అది వాస్తవంగా ఒక పరిశోధనా సాధనమని అనేవాళ్లట. 

తన లైబ్రరీ గురించి, అసలు మొత్తంగా పుస్తకాల గురించి అంబర్టో ఎకో చెప్పిన మాటలు కొన్ని:

“మీకు తెలియనిది సమస్తమూ, మీ ఆర్థికస్థితి సమకూర్చగలిగిందంతా మీ లైబ్రరీలో ఉండాలి. వయసు పెరుగుతున్నకొద్దీ మీ దగ్గర హెచ్చు జ్ఞానమూ, ఇంకా హెచ్చు పుస్తకాలూ పోగవుతాయి. అలాగే మీరు చదవని పుస్తకాల సంఖ్య పెరిగిపోతూ ఆ పుస్తకాలు బీరువాల్లోంచి మీ వేపు కవ్విస్తూ చూస్తూ ఉంటాయి.” 

“నిజంగా, మీకు ఎంత ఎక్కువ తెలిస్తే, మీరు చదవని పుస్తకాల వరుసలు అంత ఎక్కువగా ఉంటాయి. ఇలా మీరు చదవని పుస్తకాల దొంతరలను అలైబ్రరీ లేదా ప్రతికూలలైబ్రరీ అందాం.” 

“మీరు కొన్న పుస్తకాలన్నీ చదివేయాలని అనుకోవడం పిచ్చితనం. అలాగే, ఎవరైనా తాము చదవగలిగిన వాటికంటె ఎక్కువ పుస్తకాలు కొంటుంటే వారిని విమర్శించడం కూడా అంతే పిచ్చితనం. అంతకు ముందే మీరు కొనిపెట్టుకున్న కప్పులూ ప్లేట్లూ గ్లాసులూ స్క్రూడ్రైవర్లూ డ్రిల్ బిట్లూ అన్నీ వాడేసిన తర్వాతనే కొత్తవి కొనాలని అంటే ఎలా ఉంటుందో ఇదీ అంతే.” 

“మనం కొన్నవాటిలో అతి చిన్న భాగమే వాడినప్పటికీ, జీవితంలో మితిమీరిన సరఫరాలు ఉండవలసిన వస్తువులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు, మనం పుస్తకాలను ఔషధం లాగా వాడుతున్నామనుకోండి. ఇంట్లో ఎప్పుడూ ఔషధాలు నిండా ఉండాలని, తక్కువగా ఉండగూడదని కోరుకుంటాం గదా.మీకు బాగులేదని అనిపించినప్పుడు, బాగుపడాలని కోరుకున్నప్పుడు, ‘ఔషధాల బీరువా’ దగ్గరికి వెళ్లి ఒక పుస్తకం ఎంపిక చేసుకుంటారు. ఏదో ఒకటి కాదు, సరిగ్గా ఆ క్షణానికి మీకు స్వస్థత చేకూర్చేదే ఎంచుకుంటారు.అందు వల్లనే మీ ఔషధాల బీరువా నిండా చాల పోషక ఔషధాలుండాలి.”  

“ఒకే ఒక్క పుస్తకం కొనుక్కుని, ఆ ఒక్కదాన్నే చదివి, దాన్ని వదిలించేసుకునేవాళ్లు ఉన్నారనుకోండి. వాళ్లు పుస్తకాల విషయంలో వినియోగదారీ మనస్తత్వం పాటిస్తున్నారన్నమాట. అంటే వాళ్లు పుస్తకాన్ని ఒక వినియోగపు సరుకుగా, వస్తువుగా చూస్తున్నారన్న మాట. పుస్తకాలను ప్రేమించేవాళ్లెవరికైనా పుస్తకం ఇంకేమైనా కావచ్చు గాని సరుకు కాదని తెలుసు.”

Source From: Books