మిచాంగ్ తుఫాను.. చెన్నయ్ అతలాకుతలం

మిచాంగ్‌ తుపాను ప్రభావంతో తమిళనాడు రాజధాని నగరం చెన్నై, శివారు జిల్లాల్లో సోమవారం వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఫలితంగా ఏ రోడ్డు చూసినా, ఏ ప్రాంతం చూసినా నీరే. సముద్రంలో చెన్నై కలిసినట్లుగా పరిస్థితి నెలకొంది.


Published on: 04 Dec 2023 21:32  IST






    చెన్నయ్ నగరం, శివార‍్లలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి ఎడ తెరపి తేలకుండా అతి భారీ వర్షం కురిసింది. సోమవారం అర్ధరాత్రి వరకూ వర్షం పడుతూనే ఉంది. వర్షం ధాటికి చెన్నై, శివారు జిల్లాల పరిధిలోని ప్రాంతాలన్నీ జలదిగ్భందంలో చిక్కాయి. పళ్లికరణై, పెరుంగుడి పరిసరాల్లో వరదనీరు పోటెత్తింది. పలు బహుళ అంతస్తుల భవనాల్లోకి వరద నీరు చేరింది.  ఇక్కడి పార్కింగ్‌లోని వందలాది కార్లు, ఇతర వాహనాలు వరదల్లో కొట్టుకెళ్లాయి. నడుం లోతుకు పైగా నీరు చేరడంతో అన్ని ప్రధాన మార్గాలనూ, సబ్‌వేలను  పోలీసులు మూసి వేశారు. ఇక వీధులు, శివారుల్లోని కాలనీలు, నగర్‌లు, కొత్తగా  ఆవిర్భవించిన ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. చెన్నై, శివారు జిల్లాల్లో మధ్యాహ్నానికి  34 సెం.మీ వర్షం పడింది. ఈ వర్షం కారణంగా రన్‌ వేపైకి నీరు చేరడంతో చెన్నై విమానాశ్రయాన్ని మంగళవారం ఉదయం వరకు మూసి వేశారు. 160 విమాన సేవలను రద్దు చేశారు. అత్యధికంగా శివారులోని పెరుంగుడిలో 29 సెం.మీ ఆవడిలో 28 సెం.మీ, విమానాశ్రయం, అడయార్‌లలో 23 సెం.మీ వర్షం పడింది. వర్షాలు కొనసాగుతుండటంతో సహాయక చర్యలు చేపట్ట లేని పరిస్థితి ఏర్పడింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మంగళవారం కూడా వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. చెన్నై శివారులోని జాతీయ రహదారి పైకి వరద నీరు చొచ్చుకు రావడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. ఇక్కడ వండలూరు జూలో వరదనీరు పోటెత్తడంతో భారీగా మొసళ్లు తప్పించుకు‍న్నాయి. వాటిని గుర్తించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. చెన్నై శివార్లలోని చెరువులు, రిజర్వాయర్లునిండడంతో అడయార్, కూవం నదులు, బకింగ్‌ హాం కాలువల ద్వారా చెన్నై వైపుగా వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ నదీ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. 

Source From: Chennai rains