జూదంలో మా గోదారోళ్లను మించినోళ్లు లేరు !!


Published on: 01 Dec 2023 10:51  IST


ఏమాట కామాట చెప్పాలి. జూదంలో మా గోదారోళ్లను మించినోళ్లు ఈ భూమి మీద ఇంతవరకూ  పుట్టలేదు. ఇంక పుట్టబోరు అని కూడా నేను గట్టిగా నమ్ముతున్నా. మా దగ్గర సీజన్‌ కో జూదం. ఎన్నికలప్పుడు బెట్టింగ్‌. సంక్రాంతి అప్పుడు కోడిపందాలు. పేకాట సంగతి చెప్పాల్సిన పనిలేదు. నిత్య నూతనం పచ్చతోరణం. 

కాలం కలిసొచ్చి మహాభారతంలో పాండవులకు జూదరులు అని పేరొచ్చింది కానీ. వాళ్ళ బొంద.. వాళ్లకు పాచికలు తప్ప మరో జూదం తెలీదు. ఓడిపోతే మాయా పాచికలని నెపమంతా శకుని మీద  నెట్టేసి  దుకాణం సర్దుకుని అడవిబాట పడతారు. కట్టుకున్న ఆడమనిషిని పందెంలో పెట్టి బోలెడు  సింపతీ కొట్టేయాలని చూస్తారు.

మా గోదారోళ్లు గెలిచినా ఓడినా.. బతికినంత కాలం జూదాన్నే నమ్ముకుంటారు. తిన్నది అరాయించుకోలేని సోమరిపోతులు అని మీరు మమ్మల్ని కడుపుమంటతో ఆడిపోసుకుంటే పోసుకోండి కానీ మేం లెక్క చేయం.

ఇక ఎన్నికల బెట్టింగ్‌ విషయానికి వస్తే. ఎక్కడో తెలంగాణాలో జరిగిన ఎన్నికలకు ఆంధ్రాలో వుండే గోదారోళ్లకు ఏంటి సంబంధం అనుకునేరు. ఎదో సినిమాలో రావు గోపాలరావు అన్నట్టు కళాపోషణ అనేది ఉండాలి కానీ జూదానికి హద్దులేమిటండి! 

సెఫాలజి లాగానే మా వాళ్ళు బెట్టింగ్‌ను కూడా ఒక శాస్త్రంగా పరిగణిస్తారు. ఇక్కడి నుంచి తెలంగాణకు వెళ్లి  అక్కడ ప్రజల నాడిని తెలుసుకున్నాకనే బెట్టింగ్‌ షురూ చేశారు.
 
50 ఎకరాల సుక్షేత్రమైన తోటలకు యజమాని ఒకరు మా ఊర్లో వున్నారు. పిల్లలు విదేశాల్లో సెటిల్‌ అయ్యారు. కూటికి గుడ్డకు కొదవలేదు అనుకోండి. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం. కేసీఆర్‌ కు బొటాబొటిగా ముప్పై అంటే ముప్పై సీట్లకన్నా ఎక్కువరావు అని కోటి రూపాయలు పందెం కాశారు. పందెం ఎలా కాస్తారు అంటే.. మా జిల్లా కేంద్రంలో ఒక బంగారు కొట్టు షావుకారు కేంద్రంగా ఇలాంటి బెట్టింగులు జరుగుతాయి. ఇలాంటి కేంద్రాలు ఇంకా బోలెడు ఉంటాయి అనుకోండి. షావుకారు దగ్గర బెట్టింగ్‌ కాచిన డబ్బు ముందుగా డిపాజిట్‌ చేయాల్సివుంటుంది. ప్రతిగా బెట్టింగ్‌ సొమ్ములో ఐదు శాతం.. అంటే కోటికి ఐదు లక్షల్ని షావుకారు తన మార్జిన్‌గా రాబట్టుకుంటారు. ఇదంతా ఎందుకంటే షావుకారుకు బోలెడు రిస్క్‌ కదా. పోలీసులో.. ఇంకొకళ్లో దాడి చేస్తే బెట్టింగ్‌ సొమ్ముకు తానే కదా జవాబుదారీ.
    తెలంగాణా ఎన్నికలు అయ్యాయి కదా. ఇంకా ఐదు నెలల్లో ఆంధ్రా ఎన్నికలు వచ్చేస్తాయి. ఈ లోపు సంక్రాతి.  ఈ రకంగా జూదం మా నేల మీద మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుంది. 

– నాగరాజ గాలి
 

Source From: bettings in godavari districts