జగన్‌ స్పీడుని అందుకోలేకపోతున్న చంద్రబాబు

ఏపీ రాజకీయాలు రోజురోజుకీ ఆసక్తి మారుతున్నాయి. సీఎం జగన్‌ మైండ్‌గేమ్‌ చంద్రబాబుకు అంతుచిక్కడంలేదు. ఒకవైపు తెలుగుదేశం పార్టీని దెబ్బతిస్తూ మరోవైపు వైఎస్సార్‌సీపీని నిరంతరం ప్రజల్లో ఉండేలా ఆయన పక్కా వ్యూహం అమలు చేస్తున్నారు. జగన్‌ జెట్‌ స్పీడుతో దూసుకుపోతుంటే చంద్రబాబు మాత్రం ఆయన వేసిన చిక్కుముడులను విప్పుకోవడానికి సతమతమవుతున్నారు.


Published on: 10 Nov 2023 11:41  IST


ఏపీలో 2024లో జరిగే ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించి గద్దెనెక్కాలనే తపనతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆయనకు వయసు మీదపడిపోవడం ఒకటైతే.. తన రాజకీయ అనుభవంతోనే తన కుమారుడు లోకేష్‌ని సీఎం పదవిలో కూర్చోబెట్టాలని, లేదంటే ఆ తర్వాత లోకేష్‌ని పట్టించుకునేవారే ఉండరనేది మరో కారణం. ఇప్పటికే లోకేష్‌ పార్టీని నడిపించేందుకు ఏమాత్రం సమర్థుడు కాదనే విషయం బాబు జైలుకెళ్లిన తర్వాత తేటతెల్లమైంది. తన రాజకీయ వారసుడుగా, టీడీపీని ముందుకు నడిపించే భావి నేతగా నారా లోకేష్‌ని చూపించాలని చంద్రబాబు భావిస్తుండగా.. అతనిలో అసలు నాయకత్వ లక్షణాలే లేవనే విషయం బాబు జైలుకెళ్లాక ప్రజలందరికీ అర్థమైంది. బాబు జైలుకెళ్లగానే.. లోకేష్‌ ఢిల్లీకి చెక్కేయడమే దీనికి నిదర్శనం. లోకేష్‌ పార్టీని ముందుకు నడుపుతాడని భావించిన కేడర్‌కి రోజుల తరబడి ఆయన ఢిల్లీలోనే ఉండిపోవడం మింగుడుపడలేదు. 

మరోపక్క చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి కూడా జనంలోకి వచ్చి.. పార్టీకి కాస్త ఊపు తేవాలనే ప్రయత్నం చేసినా ఏమాత్రం ఫలించలేదు. ఇక టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడుతో పాటు పార్టీ సీనియర్‌ నేతల్లో ఎవరూ పార్టీలో ప్రభావం చూపించే స్థాయి ఉన్నవారు కాదని తేటతెల్లమైంది. 

ఈ తరుణంలో చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి పార్టీలో ఊపు తేవాలనుకున్నా.. అవినీతి కేసుల ఉచ్చులో చిక్కుకోవడంతో అదీ సాధ్యం కావడం లేదు. తనను అన్యాయంగా జైలుకు పంపారంటూ సానుభూతి పొందాలని విశ్వప్రయత్నాలు చేసినా.. జనం వాటిని నమ్మలేదు. అనారోగ్య కారణాలతో చికిత్స కోసం మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చినా.. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. కోర్టు విధించిన నిబంధనలతో ఆయన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం లేకపోవడం, మీడియాతోనూ మాట్లాడే అవకాశం లేకపోవడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఇంట్లోనే ఉండి వ్యూహాలు ఎన్ని పన్నినా.. చంద్రబాబు లేకుండా వాటిని సమర్థంగా అమలు చేసే నాయకుడు ఆ పార్టీలో లేరని ఇప్పటికే తేటతెల్లమైంది. 

మరోపక్క వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. తన ఎన్నికల ప్రణాళికను విజయవంతంగా అమలు చేస్తూ జెట్‌ స్పీడులో దూసుకుపోతున్నాడు. ప్రజలకు మరింత చేరువవుతున్నాడు. పార్టీని, పార్టీ నేతలను మరింతగా ప్రజలకు చేరువ చేస్తున్నాడు. ఇప్పటికే గడపగడపకు కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి తమ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల ద్వారా ఇంటింటా అందుతున్న లబ్ధిని వివరించగలిగారు. ఆ వెంటనే సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అందిస్తున్న ప్రయోజనాలను వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఈ యాత్రలు నిర్వహించే ప్రణాళికను విజయవంతంగా అమలు చేస్తున్నారు. దీనికితోడు ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌..’ (ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలంటే..) పేరుతో మరో కార్యక్రమాన్ని గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి సచివాలయం వద్ద ఆ సచివాలయ పరిధిలో చేపట్టిన సంక్షేమ, అభివద్ధి పథకాల జాబితాను ప్రదర్శిస్తున్నారు. దీనికితోడు వాటిని మరోసారి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టారు. ఈ విధంగా వరుస కార్యక్రమాలతో ‘వైనాట్‌ 175’ని కచ్చితంగా సాధించాలనే పట్టుదలతో జగన్‌ ముందుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు రానున్న ఎన్నికలను ఎదుర్కొనేది ఎలాగో అర్థంగాక అయోమయ పరిస్థితి నెలకొంది. 2024 ఎన్నికల్లో తన కల నెరవేరకపోతే తనకు రాజకీయంగా ఇవే ఆఖరి ఎన్నికలనే ఆందోళన ఆయన్ని వెంటాడుతోంది.


 

Source From: jagan vs cbn