ఇజ్రాయిల్ ను దెబ్బతీసిన ఒంటికన్ను వీరుడు !

ఇజ్రాయిల్ పై పాలస్తీనా పోరాట సంస్థ హమస్ చేసిన మెరుపు దాడుల్లో సూత్రదారి మహమ్మద్ దెయిఫ్.


Published on: 12 Oct 2023 16:49  IST


వారం రోజుల యూదుల మ్యూజిక్‌ ఫెస్టివల్‌ సుక్కోత్‌ ముగింపు దశకు చేరిన శనివారం ఇజ్రాయెల్‌ లోకి వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి. 1200 మందికి పైగా ఇజ్రాయెలీలు పాలస్తీనా విమోచన తీవ్రవాద సంస్థ హమాస్‌ జరిపిన ఈ మెరుపు దాడుల్లో మరణించారు. గాజా పట్టీ ప్రాంతంలో పాలస్తీనా అరబ్బులను ఓపెనెయిర్‌ జైల్లో బంధించిన నేరానికి ప్రతీకారంగా–హమస్‌ చేసిన దిగ్భ్రాంతికర దాడికి పథకం రూపొందించింది మొహమ్మద్‌ దెయిఫ్‌ (58). హమాస్‌ అనుబంధ సంస్థ ఇజ్జెదీన్‌ అల్‌ ఖాసమ్‌ బ్రిగేడ్స్‌ నేత దెయిఫ్‌. గాజా హమాస్‌ నేత యాహ్యా సిన్వార్‌ తో కలిసి ‘తూఫాన్‌ అల్‌–అక్సా’ పేరుతో రాకెట్ల వర్షం యూదు రాజ్య భూభాగాలపై కురిపించాలని నిర్ణయించాడు దెయిఫ్‌. ఈ ఇద్దరు పాలస్తీనియన్లు ఈ ‘తూఫాన్‌’ను ఇజ్రాయెల్‌ లో మారణకాండకు దారితీసేలా చేయగలిగారు. అయితే, ఈ దాడి వెనుక రెండు మెదళ్లు ఉన్నా, ఒకే ఒక సూత్రధారి పథకం రూపొందించాడు. అతడే ‘ఒంటి కన్ను రాక్షసుడు (ఒన్‌ ఐయిడ్‌ జాక్‌ అనే ఆంగ్ల పదాలకు వదులు అనువాదం) దెయిఫ్‌ అని పాశ్చాత్య మీడియా వెల్లడించింది. పదే పదే ఒన్‌ అయిడ్‌ జాక్‌ అనే మాటను మొహమ్మద్‌ దియాబ్‌ ఇబ్రాహీం అల్‌– మస్రీ అనే పేరుతో పుట్టిన దెయిఫ్‌ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మీడియా మిత్రులు వాడేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఇజ్రాయెల్‌ రక్షణ బలగాలు (ఐడీఎఫ్‌) జరిపిన పైశాచిక దాడుల్లో దెయిఫ్‌ ఒక కన్ను, కొన్ని శరీర భాగాలు కోల్పోయాడు. ఇక మళ్లీ పోరాటానికి దిగే రీతిలో దెయిఫ్‌ కోలుకోడనీ, ఒంటి కన్నుతో అతనిది గుడ్డి బతుకేనని యూదు దురహంకారులు ఆశించారు. ఇప్పటి వరకూ ఇజ్రాయెలీ దాడుల నుంచి ఏడుసార్లు తప్పించుకుని ప్రాణాలతో బయటపడిన దెయిఫ్‌ కన్ను ఒకటి పోయిందే కాని బుర్ర పనిచేయడం ఆగలేదు. అందుకే ‘దెయిఫ్‌ ఒక కన్ను పోగొట్టుకున్నాక సైనిక వ్యూహాలు ఇక అతని వల్ల కాదనుకున్నాం. కాని అతను చాలా వరకు కోలుకున్నాడు. ఒక కన్ను పోవడం అంటే ఓ కన్ను కోల్పోవడమే కదా,’ అని ఒక ఇజ్రాయెలీ రిటైర్డ్‌ సైనికాధికారి వ్యాఖ్యానించారు. 2014లో ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో గాజాలోనే దెయిఫ్‌ భార్య, ఏడు నెలల కొడుకు, మూడు నెలల కూతురు మరణించారు. 1965లో ఈజిప్ట్‌ ఆక్రమణలో ఉన్న గాజా స్ట్రిప్‌ లోని  ఖాన్‌ యూనిస్‌ శరణార్థి శిబిరంలో దెయిఫ్‌ పుట్టాడు. మస్రీ నుంచి దెయిఫ్‌ అని పేరు మార్చుకున్నాడు. అరబ్బీలో దెయిఫ్‌ అంటే అతిథి అని అర్ధం. గాజా ఇస్లామిక్‌ యూనివర్సిటీలో బీఎస్సీ చదివిన దెయిఫ్‌ ను 1987లో ఇజ్రాయెలీ దళాలు అరెస్టుచేసి, 16 నెలలు నిర్బంధించాయి. మొత్తానికి ఒంటి కన్ను వీరుడే ఇజ్రాయెల్‌ తన 75 ఏళ్ల చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా దెబ్బదీయడం పెద్ద వింత అయింది. ఇజ్రాయెల్‌ పాత జెరుసలేం నగరంలో ముస్లింలకు అత్యంత పవిత్రమైన రమదాన్‌ మాసంలో అంతే పవిత్రమైన అల్‌–అక్సా మసీదుపై ఇజ్రాయెల్‌ సైనికులు దాడిచేసి ఎంతో మందిని కాల్చిచంపారు. అప్పటి నుంచీ ప్రతీకారానికి ఎదురుచూస్తున్న దెయిఫ్‌–తూఫాన్‌ అల్‌–అక్సా పేరుతో మెరుపుదాడికి డిజైన్‌ చేశాడు. 
భారత పోలీసులకు పెద్ద షాకిచ్చిన శివరాసన్‌ ను ఒన్‌ ఐయిడ్‌ జాక్‌ అనే అన్నారు.
దెయిఫ్‌ గురించి ఇంగ్లిష్‌ మీడియాలో ప్రస్తావించినప్పుడల్లా అతన్ని–ఒన్‌ ఐయిడ్‌ జాక్‌–అని అంటున్నాయి.
–ఒన్‌ ఐయిడ్‌ జాక్‌–అనే మాటలు పేకాట నుంచి వచ్చిన ప్రయోగం. పేక ముక్కల్లో స్పేడ్స్, హార్ట్స్‌ జాక్‌ బొమ్మలో అతని ఒక కన్నే కనిపిస్తుంది. అందుకే ఒన్‌ అయిడ్‌ జాక్‌‘జాకీ’ అయ్యాడు. అదీగాక, 1961లో ప్రసిద్ధ హాలీవుడ్‌ నటుడు మార్లన్‌ బ్రాండో నటించిన ‘ఒన్‌ అయిడ్‌ జాక్స్‌’ అనే సినిమాతో కూడా ఈ ఒన్‌ అయిడ్‌ జాక్‌ అనే మాటలకు విశేష ప్రాచుర్యం లభించింది. గాడ్‌ ఫాదర్‌ సినిమాతో ప్రపంచ ప్రజలందరికీ తెలిసిన బ్రాండో దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ఒన్‌ అయిడ్‌ జాక్స్‌.

Source From: Israel conflict