విశాఖ నుంచే జగన్‌ పాలన

ఆంధ్ర రాజధాని విశాఖకు మారబోతోంది. దసరా నుంచి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించబోతున్నారు. దసరా రోజు ఆయన అక్కడ క్యాంపు కార్యాలయంలో అడుగుపెట్టడానికి అంతా సిద్ధమైంది. ఆయనతోపాటు అన్ని శాఖలు అక్కడ క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి.


Published on: 12 Oct 2023 15:31  IST


    అనుకున్నది సాధించడంలో ఏపీ సీఎం జగన్‌ ఎంత పట్టుదలగా ఉంటారో చాలా విషయాల్లో స్పష్టమైంది. తాజాగా రాజధాని విషయంలోనూ ఆయన తన పట్టుదలను నెరవేర్చుకోవడానికి రెడీ అయ్యారు. చెప్పినట్టుగానే దసరా పండుగ నుంచి విశాఖ నుంచి రాజధాని కార్యకలాపాలు కొనసాగించేందుకు ఆయన ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయనే కాదు ప్రభుత్వ శాఖల కార్యకలాపాలను కూడా అక్కడి నుంచే నిర్వహించడానికి అనువుగా అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు.

    మొదట సీఎం కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రుషికొండలో నిర్మించిన టూరిజం భవనాలను వినియోగించుకోబోతున్నారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చాయో అందరికీ తెలిసిందే. చంద్రబాబు అయితే దీనిపై కోర్టుకెళ్లి మరీ నిర్మాణాలు ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ప్రభుత్వం కొంత ఆలస్యమైనా అక్కడ నిర్మాణాలు పూర్తి చేసింది. టూరిజం శాఖ భవనాలు నిర్మించగా ఇప్పుడు దాన్ని సీఎం క్యాంపు కార్యాలయం కోసం వినియోగించబోతున్నారు. సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయం కోసమే ఈ భవనాలు కడుతున్నా దాన్ని బహిరంగ రహస్యంగా ఉంచారు. కోర్టు కేసులు, ప్రతిపక్షాలు కల్పించే ఆటంకాలు నుంచి తప్పించుకునేందుకే టూరిజం పేరుతో భవనాలు నిర్మించి ఇప్పుడు ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుని సీఎం క్యాంపు కార్యాలయానికి వాడుకోబోతోంది.


    సీఎం క్యాంపు కార్యాలయాలతోపాటు అన్ని శాఖల క్యాంపు కార్యాలయాలు విశాఖలో ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి, వెనుకబాటుతనం తదితర అంశాలపై సీఎం తరచూ విశాఖలో సమీక్షలు, పర్యటనలు చేయనున్నారని, అందుకోసం ఆయన క్యాంపు కార్యాలయం అక్కడ ఏర్పాటవుతోందని, ఆయనకు అందుబాటులో ఉండేందుకు అన్ని శాఖలు తాత్కాలిక క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


    నిజానికి చాలా రోజుల నుంచే ఐఏఎస్‌ అధికారులు తమ శాఖల కోసం కార్యాలయాలను ఎంచుకున్నారు. రుషికొండలో సీఎం క్యాంపు కార్యాలయం ఆఘమేఘాల మీద నిర్మాణం జరుగుతుండడంతో వారికి విశాఖ వెళ్లడం తప్పదని అర్థమైపోయింది. అందుకే చాలా శాఖలు భవనాలు కూడా చూసుకున్నాయి. ఇప్పుడు వారి పని తేలిక అవనుంది. ఈ తాత్కాలిక కార్యాలయాల ఎంపిక కోసం ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ కూడా వీరు ఎంపిక చేసుకున్న క్యాంపు కార్యాలయాలనే గుర్తించి అక్కడ ఆఫీసులు పెట్టుకోవడానికి అనుమతించనుంది. 
    మరోవైపు సీఎం జగన్‌ నివాసం ఉండేందుకు హార్బర్‌ గెస్ట్‌హౌస్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రుషికొండలో క్యాంపు కార్యాలయ నిర్మాణం పూర్తయినా నివాస నిర్మాణాలు పూర్తి కాలేదు. దీంతో నేవీ ఆధీనంలోని హార్బర్‌ గెస్ట్‌హౌస్‌ను తీసుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అదైతే భద్రతా పరంగానూ సీఎంకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ హార్బర్‌ గెస్ట్‌హౌస్‌ తీసుకోవడం వీలుకాకపోతే బేపార్క్‌ రిసార్ట్స్‌లో సీఎం నివాసం ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ నెల 24వ తేదీన సీఎం జగన్‌ విశాఖలో అడుగుపెట్టి అక్కడి నుంచే పరిపాలన కొనసాగించడం స్పష్టమైపోయింది. వారానికి మూడురోజులు ఆయన విశాఖలోనే ఉంటారని చెబుతున్నారు. రెండురోజులు అమరావతిలో ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. దీన్నిబట్టి చెప్పిన మాట ప్రకారం విశాఖను జ్యుడీషియల్‌ రాజధానిగా మార్చడంతోపాటు ఎన్నికలయ్యే వరకు అమరావతిలోనూ ఆయన నివాసం కొనసాగనుంది. 

 

Source From: vyzag cm camp office