హమస్‌ గురించి ఈ తరానికి తెలియని నిజాలు !

చిన్నప్పటి నుంచి పాలస్తీనా కోణంలోనే వార్తలు చూసిన గుర్తు. అరబ్బుల ప్రాంతంలో యూదుల ప్రత్యేక దేశంగా ఇజ్రాయిల్‌ ఏర్పడ్డాక మొదలైన యుద్ధకాండ ఇప్పటివరకు ఆగలేదు. హమస్‌ను ఇప్పుడు అంతా ఉగ్రవాద సంస్థగా చూపుతున్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక మన విదేశాంగ విధానం మారడంతో ఒకప్పటి వాస్తవ కోణం మారిపోయింది. నిజానికి హమస్‌ ఒక పోరాట సంస్థ. విశ్రాంత జర్నలిస్టు మెరుగుమాల నాంచారయ్య రాసిన వ్యాసం..


Published on: 10 Oct 2023 23:53  IST


    ఇజ్రాయెల్‌లో పాలస్తీనా అరబ్బులు నివసించే ప్రాంతాలపై యూదు రాజ్యాన్ని నడిపే ప్రభుత్వ సైనికులు, యూదు తీవ్రవాదులు గతంలో దాడులు చేసిన ప్రతి సందర్భంలోనూ భారతదేశంలో వామపక్ష–ప్రజాతంత్రవాదులు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు జరిపేవారు. ఇది 1960ల నుంచి 80ల వరకూ రాజకీయ చైతన్యం నిండిన ప్రజలకు సంబంధించిన ఒక వాస్తవం. 1948 మేలో యూదుల కోసం పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్‌ పేరుతో కొత్త దేశం ఏర్పాటు చేసినప్పటి నుంచీ స్థానికులైన పాలస్తీనీయుల అణచివేత కొనసాగుతూనే ఉంది. పాలస్తీనా అరబ్బులు ఎప్పుడూ ఈ యూదు ఆధిపత్య దేశంలో కనీసం రెండో తరగతి పౌరులు కూడా కాదు. అంతకన్నా తక్కువే. నేడు హింసాత్మక దాడులకు, ఇజ్రాయెల్‌ సర్కారు ప్రకటిత యుద్ధానికి కేంద్ర బిందువైన గాజా స్ట్రిప్‌ ప్రాంతంలో 23 లక్షల మంది పాలస్తీనా అరబ్బులు నివసిస్తున్నారు. ప్రధాన ఇజ్రాయెల్‌ (ఇజ్రాయెల్‌ ప్రోపర్‌) ప్రాంతం సరిహద్దులో కట్టిన హైటెక్నాలజీ గోడకు ఇవతల వైపున ‘ఓపెన్‌ ఎయిర్‌ జైలులో’ వారు దుర్భర జీవితం గడుపుతున్నారు. ఈ గోడనే తనకు తిరుగులేని రక్షణ కవచంగా ఇజ్రాయెల్‌ భ్రమపడింది. 1950ల్లో భారత తొలి ప్రధాని నెహ్రూ అలీద్యమం పేరుతో నాటి ఈజిప్ట్‌ అధ్యక్షుడు జమాల్‌ అబ్దల్‌ నాసర్‌ తో కలిసి పనిచేశారు. ఆయన కాలంలో మొదలైన నాటి సోవియెట్‌ యూనియన్‌ అనుకూల భారత విదేశాంగ విధానం కూతురు ఇందిరాగాంధీ పాలనలో మరింత బలపడింది. అదీగాక కశ్మీర్‌ సమస్యపై అరబ్‌ దేశాల నిలకడతో కూడిన సపోర్టు భారత్‌ కు కొనసాగడంతో– కాంగ్రెస్‌ ప్రభుత్వాలు, అప్పట్లో బలం, పలుకుబడి ఉన్న కమ్యూనిస్టులు పాలస్తీనా జాతి విముక్తి పోరాటానికి గట్టి మద్దతు ఇచ్చేవారు. 1980ల వరకూ పాలస్తీనీయులపై ఇజ్రాయెల్‌ పోలీసులు, సైనిక దళాల దాష్టీకాలను ఎండగడుతూ భారత దేశంలో కమ్యూనిస్టులతోపాటు ప్రజాతంత్రవాదులు బొంబాయి, కలకత్తా, దిల్లీ, మద్రాసు మహా నగరాలతోపాటు తెలుగునాట హైదరాబాద్, బెజవాడ వంటి నగరాలు, ఇంకా తెనాలి, గుడివాడ వంటి చిన్న పట్టణాల్లో సైతం ఇజ్రాయెల్‌ వ్యతిరేక, పాలస్తీనా అనుకూల ఊరేగింపులు జరిపేవారు. ఈ ప్రదర్శనలకు జనం పెద్ద సంఖ్యలో వచ్చేవారు.

 

నాలుగో వంతు జనాన్ని కాళ్ల కింద తొక్కిపెడితే– పరిణామాలు ఇలాగే ఉంటాయట!
            
శనివారం ఇజ్రాయెల్‌ నగరాలు, పట్టణాలపై గాజా స్ట్రిప్‌ కేంద్రంగా పనిచేసే హమస్‌ అనే పాలస్తీనా పోరాట సంస్థ పెద్ద సంఖ్యలో రాకెట్లను ప్రయోగించింది. దాదాపు 700 మంది ఇజ్రాయెలీలు మరణించారు. ఇజ్రాయెలీ రక్షణ దళం (ఐడీఎప్‌) వెంటనే గాజా ప్రాతంపై జరిపిన దాడుల్లో వందలాది మంది పాలస్తీనియన్లు మరణించారు. అత్యంత శక్తిమంతమైన సమాచార వ్యవస్థ ఉన్న సాయుధ దళంగా పేరుమోసిన  ఐడీఎఫ్‌ ప్రతీకార దాడులు కూడా ప్రపంచ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఇప్పుడు గాజా స్ట్రిప్‌ ను పూర్తి దిగ్బంధంలోకి తీసుకురావడానికి ఇజ్రాయెల్‌ ప్రభుత్వం అత్యంత పాశవికమైన రీతిలో అక్కడి ప్రజలకు నీరు, విద్యుత్తు, ఆహార పదార్ధాల సరఫరాలను నిలిపివేసింది. గాజా స్ట్రిప్‌ లో నివసించే జనం ‘అక్కడి నుంచి వదిలిపోవాలని’  ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ ‘బీబీ’ నెతన్యాహూ హెచ్చరించారు. మరి, పాతిక లక్షల మందికి పైగా పాలస్తీనీయులు నివసించే ప్రాంతం గతంలో శ్రీలం తమిళ ప్రాంతాల కన్నా దారుణమైన అణచివేతకు, దుర్మార్గాలకు గురవుతుంటే భారత నగరాలు, పట్టణాల్లో రాజకీయ స్పహ ఉన్న జనం ఎవరూ ప్రదర్శనలు పెద్దగా జరపడం లేదు. మరో ఆసక్తికరవిషయం ఏమంటే–హమస్‌ దాడిని మాత్రమే ఖండించిన భారత ప్రధాని నరేంద్రమోదీ హమస్‌ ను తీవ్రవాద సంస్థగా, ఈ సంస్థ తరఫున పనిచేసే దళసభ్యులను ‘ఉగ్రవాదులు’గా వర్ణించారు. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇజ్రాయెల్‌ ను సన్నిహిత మిత్రదేశంగా పరిగణిస్తూ దానితో అన్ని రకాల సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. 2009 లోక్‌ సభ ఎన్నికల నుంచీ దేశంలో కమ్యూనిస్టు పార్టీలు ఒక్క కేరళ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఉనికిని దాదాపు కోల్పోవడం వల్లనో లేక దశాబ్ద కాలంగా కేంద్రంలో యూదు రాజ్య అనుకూల బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్లనోగాని పాలస్తీనియులు అంటే కేవలం ముస్లింలు, ఆ తర్వాత అరబ్బులు అనే అభిప్రాయమే దేశ మధ్య తరగతి ప్రజల్లో బలపడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఈసారి పాలస్తీనా ప్రాంతంపై ఇజ్రాయెల్‌ దాడులు ఇంత తీవ్రంగా కొనసాగుతన్నా ఇండియన్లకు పట్టలేదు. 

 

అమెరికా శ్వేతజాతి అమెరికన్లే ఇజ్రాయెల్‌ ఆగడాలను నిరసించడంలో ముందున్నారు!

కుదిరితే మన పిల్లలందరికీ చదువు, ఉపాధి, చివరికి పౌరసత్వానికి అంతిమ గమ్యంగా మారిన ప్రజాతంత్ర అమెరికాలోనే –ఇజ్రాయెల్‌ దాష్టీకాలు, అరాచకాలు, అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తూ అరబ్‌–అమెరికన్లు, ఆఫ్రికన్‌–అమెరికన్లతో కలిసి పెద్ద సంఖ్యలో తెల్లజాతి అమెరికన్‌ పౌరులు దాదాపు అన్ని నగరాల్లో భారీ ప్రదర్శనలు జరుపుతున్నారు. ఒకపక్క  హమస్‌ దళం మెరుపుదాడులపై హర్షం ప్రకటిస్తూనే మరోపక్క గాజా పట్టీలోని పాలస్తీనా అరబ్బులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇజ్రాయెల్‌ సైనిక దళాల దాడులు, అమానుష చర్యలు వెంటనే నిలిపివేయాలని అన్ని రంగుల జనంతో కలిసి ఈ శ్వేతజాతి అమెరికన్లు గొంతెత్తి డిమాండ్‌ చేస్తున్నారు. ఈమధ్య అమెరికా యువతీయువకుల్లో కొందరు మార్క్సిస్టు సిద్ధాంతాలతో ప్రభావితమౌతూ, అక్కడి సోషలిస్టు, ప్రజాతంత్ర రాజకీయాలకు కొత్త సత్తువ ఎక్కిస్తున్నారు. డెమొక్రాటిక్‌ సోషలిస్ట్స్‌ ఆఫ్‌ అమెరికా (డీఎస్యే) వంటి మార్క్సిస్టు సంస్థల కార్యకర్తలు, ఇతర పాలస్తీనా పోరాట మద్దతుదారులు ఆదివారం న్యూయార్క్‌ నగరంలోని టైమ్స్‌ స్క్వేర్‌ లో భారీ ప్రదర్శన నిర్వహించారు. మరో పక్క ఇజ్రాయెల్‌ యూదు జాత్యహంకారులకు మద్దతుగా వచ్చిన ప్రదర్శనకారులతో వారు తలపడడానికి కూడా సిద్ధమయ్యారని వార్తలొస్తున్నాయి. ఒక్క న్యూయార్క్‌ లోనే గాక, భారతీయులు ముఖ్యంగా తెలుగు జనం చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండే అట్లాంటా వంటి ఇతర పెద్ద నగరాల్లో సైతం పాలస్తీనా విమోచన పోరాటానికి, హమస్‌ పోరుకు అనుకూలంగా పెద్ద ఊరేగింపులు జరిగాయి. అమెరికా ప్రపంచంలోనే అతిగొప్ప ప్రజాస్వామిక దేశమనే వర్ణన పూర్తిగా సబబేనని– ఆదివారం జరిగిన అమెరికా ప్రజాస్వామికవాదుల పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్‌ వ్యతిరేక ప్రదర్శనలు నిరూపిస్తున్నాయి. అయితే, విదేశీ పాలన నుంచి విముక్తి పొంది, వలసపాలనకు వ్యతిరేకంగా జరిగిన అన్ని పోరాటాలకు మద్దతు ఇచ్చిన ఇండియాలో ఇప్పుడు కనీసం పెద్ద నగరాల్లో కూడా హమస్‌ సాహసానికి మద్దతుగా ఓ మోస్తరు జులూస్‌లు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి, అమెరికా వెళ్లి ఉన్నత విద్యనభ్యసిస్తూ అక్కడ స్థిరపడడానికి సిద్ధమౌతున్న పాత, కొత్త కమ్యూనిస్టు కుటుంబాలకు చెందిన పిల్లలు, రాజకీయాలు పట్టని ఇతర కుటుంబాల పిల్లలు అయినా అమెరికాలో నిరంతరం వెలుగుతూ ఉండే రాజకీయ చైతన్యాన్ని గమనిస్తున్నారా? అంటే అవుననే జవాబు వస్తే మనం నిజంగా సంతోషపడాల్సిందే. ఇజ్రాయెల్‌ మొత్తం జనాభాలో (దాదాపు 97 లక్షలు( 73 శాతం (71 లక్షలకు పైగా) యూదులు ఉన్నారు. అమెరికాలో అంత కన్నా కాస్త ఎక్కువ మంది అంటే 76 లక్షల మంది యూదులు దేశ పౌరులుగా నివసిస్తున్నారు. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణ వ్యతిరేకతతోపాటు ఈ కులపోళ్లపై అనవసర అనుమానాలు, భయాలు ఉన్నట్టే–అమెరికాలో కూడా యూదులంటే ఇలాంటి భావనలే తెల్లజాతివారిలో ఉన్నాయి. ఏకైక అగ్రరాజ్య అపర కుబేరులని మీడియా వర్ణించే బిలియనీర్లలో ఎక్కువ శాతం యూదులే కావడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్‌ సర్కారుకు అమెరికా పాలకవర్గాలు, పాలక రాజకీయపక్షాలు దాదాపు బేషరుతుగా మద్దతు ఇవ్వడానికి ఈ సామాజిక, ఆర్థిక నేపథ్యమే దోహదం చేస్తోంది. ఇజ్రాయెల్‌ దుందుడుకు పోకడలను తెల్లజాతి అమెరికన్లు ఎక్కువగా నిరసించడానికి అక్కడి యూదుల ప్రవర్తనే కారణమని చెబితే అది సమర్ధనీయం కాదు. ఎంతకాదనుకున్నా ఈ ధనిక అగ్రరాజ్యంలో సంపదతోపాటు నిజమైన రాజకీయ చైతన్యం ఉంది. ఇది కాదనలేని సత్యం. వాస్తవం. 1991లో ప్రధాని పీవీ నరసింహారావు గారి హయాంలో మొదలైన కొత్త ఆర్థిక, రాజకీయ విధానాలు పాలకవర్గాలనేగాక, సామాన్య మధ్య తరగతి ప్రజలను సైతం పూర్తిగా మార్చేశాయని చెప్పడానికి తాజా ఇజ్రాయెల్‌ పరిణామాలపై భారతీయుల మౌనమే గొప్ప సాక్ష్యం. 

మెరుగుమాల నాంచారయ్య ఫేస్‌బుక్‌ వాల్‌ నుంచి తీసుకున్న వ్యాసం. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం 
 

Source From: israel hamas war