'బ్బాబ్బాబు... క్షమాపణలు చెప్పండి...' : డిప్యూటీ సీఎం పవన్ వేడుకోలు

అమరావతి: తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడంపై నేను బహిరంగ క్షమాపణలు చెప్పాను... ప్లీజ్ మీరు కూడా చెప్పండి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేడుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారా? పిఠాపురం పర్యటనలో తన క్షమాపణల అంశంపైనే పవన్ కళ్యాణ్‌ అసంతృప్తిని వెళ్లగక్కాడు.  టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, పాలక మండలి సభ్యులు, ఈవో శ్యామలరావు, జేఈఓ వెంకయ్య చౌదరి కూడా క్షమాపణ చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసినా ఎవరూ స్పందించలేదు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై నేను క్షమాపణ చెప్పా,  మీరు కూడా చెప్పేందుకు ఎందుకు నామోషీ అంటూ అధికారులను నిలదీశారు.  డిప్యూటీ సీఎంగా నేను మాత్రమే బాధ్యత తీసుకోవాలి.. మాకు మాత్రం  సంబంధం లేదు అంటే ఎట్లా? ..మా తప్పు కాదు అంటే ఎలా?  క్షమాపణలు చెప్పడం నాకైమైనా సరదానా? నేను ఇలాంటి సంఘటనల్లో దోషిగా నిలబడాలా? మీరు కూడా క్షమాపణలు చెప్పి తీరాలి..వేరే దారి లేదు.. అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడటంను రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. 


Published on: 11 Jan 2025 11:18  IST

 తిరుపతి తొక్కిసలాటలో తమ ప్రభుత్వ తప్పును అంగీకరిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన బహిరంగ క్షమాపణలు ముఖ్యమంత్రి చంద్రబాబును ఇరకాటంలో పెట్టేశాయి. డిప్యూటీ సీఎం క్షమాపణలు చెప్పినప్పుడు, ఇదే ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న చంద్రబాబు కూడా క్షమాపణలు చెప్పాలి కదా అనే ప్రశ్నలకు సీఎం బదులివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పవన్ తప్పు ఒప్పుకుంటే తాము ఎందుకు దానికి కమిట్ అవ్వాలని టీటీడీ చైర్మన్ సహా మిగిలిన అధికారులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఏకంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఒక అడుగు ముందుకు వేసి క్షమాపణలు చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగివస్తాయా అంటూ ప్రశ్నించడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలకు అర్థం లేకుండా చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన మీడియా ద్వారా అండగా నిలిచి, అందుకు ప్రతిఫలంగా టీటీడీ ఛైర్మన్ పదవిని దక్కించుకున్న బీఆర్ నాయుడికి ఈ విషయంలో చంద్రబాబు నుంచి పూర్తి మద్దతు ఉండటం వల్లే ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని కొందరు జనసేన నేతలు అనుమానిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు కోర్ టీంగా ఉన్న అధికారులు శ్యామలరావు, వెంకయ్య చౌదరి, సుబ్బారాయుడు లను కాపాడుకునేందుకే చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రతిపక్ష వైయస్ఆర్ సీపీ ఆరోపిస్తోంది. ఈ అధికారులు కూడా డిప్యూటీ సీఎంను అంతగా పట్టించుకోకపోవడానికి కారణం వారికి సీఎం వద్ద ఉన్న పలుకుబడేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 


'మా నాన్న సీఎం కాదు' ఎవరిని ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు

మొదటి తరగతి రాజకీయ నాయకుడిని, మా నాన్న సీఎం కాదు అంటూ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. ఎవరిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారా అని కూటమి పార్టీల్లో చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు తండ్రిగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటే, ఆయన కుమారుడు నారా లోకేష్ కీలక మంత్రిగా ఉన్నారు. అంతే తప్ప మరెవరికీ ఈ వ్యాఖ్యలు వర్తించే ఆస్కారమే లేదు. ఖచ్చితంగా ఇవి లోకేష్ ను ఉద్దేశించి మాట్లాడినవే అని పవన్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు తాను రాజకీయ వారసత్వం నుంచి రాలేదు, మొదటి తరగతి నాయకుడిని అని కూడా చెప్పడం లోకేష్ గతంలో ఎమ్మెల్సీగా దొడ్డిదారిన వచ్చి మంత్రిగా రాజకీయాలు చేశాడు కాబట్టి ఆయనను ఉద్దేశించే ఇవి చేశారా అని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఇప్పుడే కాదు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఏడు నెలల్లోనే ప్రభుత్వ తీరుపై, సహచర మంత్రుల వ్యవహారశైలిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు సార్లు బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఏకంగా హోంమంత్రిపైనే తన అసహనాన్ని వ్యక్తం చేశారు. నేనే కనుక హోంమంత్రిని అయితేనా అంటూ తన అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కారు. తాజాగా తిరుపతి తొక్కిసలాట ఘటనలోనూ సీఎం చంద్రబాబుతో కాకుండా వేరుగా ఘటనా స్థలిని పరిశీలించి, బాధితులను పర్యటించారు. ఈ సందర్భంగా ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెబుతున్నట్లుగా ప్రకటించారు. తిరుపతి పర్యటనలో కూడా సీఎంతో పాటు హోంమంత్రి, రెవెన్యూ, ఎండోమెంట్ మినిస్టర్లు పర్యటిస్తే, పవన్ కళ్యాణ్ మాత్రం వేరుగా వెళ్ళారు. అక్కడి అధికారుల తీరుపైన బాహాటంగానే ఆయన విమర్శలు చేస్తూ, దీనికి ప్రభుత్వ పరంగా బాధ్యత వహించడం ద్వారా కూటమి ప్రభుత్వంలో తాను చంద్రబాబు చాటు నేతను కాదు అని చాటుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాదు తన సోదరుడు నాగేంద్రబాబుకు మంత్రివర్గంలో స్థానం కోసం కూడా చంద్రబాబుతో మొహమాటం లేకుండా మీడియాకు లేఖ ద్వారా వెల్లడి చేయాల్సిందేనంటూ పట్టుబట్టి మరీ సాధించుకున్నాడు. ఇక్కడ కూడా చంద్రబాబు నాలుగు గోడల మధ్య ఇచ్చిన హామీని పవన్ నమ్మకపోవడం వల్లే, విధిలేని స్థితిలో చంద్రబాబు తన నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా మంత్రివర్గంలో ఫలానా వ్యక్తిని చేర్చుకుంటున్నాం అంటూ తొలిసారి లేఖను విడుదల చేశారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చంద్రబాబుకు రోజుకో కొత్త తలనెప్పిని తెప్పిస్తోందని టీడీపీలోని సీనియర్ నాయకులే మాట్లాడుకుంటున్నారు. 

 

Source From: Telugu Peoples