తిరుపతి మరణాలు ప్రభుత్వ హత్యలు

తిరుపతిలో వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి, పలువురు క్షతగాత్రులైన దుర్ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని వైయస్ఆర్ సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తొక్కిసాలటలో జరిగిన మరణాలు ప్రభుత్వ హత్యలేనని అన్నారు. శ్రీవారి సేవలో భక్తులకు సదుపాయాలు కల్పించాల్సిన అన్ని వ్యవస్థలు చంద్రబాబు సేవలో తరలించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని మండిపడ్డారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన ఈఓ శ్యామలరావును బదిలీ చేయాలని, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీలను సస్సెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపైనా చర్య తీసుకోవాలని కోరారు. అదే విధంగా ఈ సంఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున, క్షతగాత్రులకు ఇరవై లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.


Published on: 09 Jan 2025 11:21  IST

తిరుపతి: 


అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రచార యావతోనే చంద్రబాబు అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించాడు. ఆనాడు తన ప్రచారం కోసం గోదావరి పుష్కరాల్లో 29 మందిని తొక్కిసలాట రూపంలో బలి తీసుకున్నారని విమర్శించారు. నేడు శ్రీవారి వైకుంఠ ఏకాదశినాడు ఉత్తర ద్వారదర్శనం కోసం వచ్చిన భక్తులకు పకడ్భందీ ఏర్పాట్లు చేయడంలో విఫలమవ్వడం వల్ల ఆరుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మాదిరిగానే టీటీడీ చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓలు ఎవరి సమీక్షా సమావేశాలు వారు నిర్వహించుకుని, సమన్వయం లేకుండా అంతా తమ ఘనతే అని చాటుకునేందుకు చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఈ రోజు ఇంత దారుణం చోటుచేసుకుందని అన్నారు. కీలకమైన స్థానంలో ఉన్నవారు పర్యవేక్షణకే పరిమితమయ్యారే తప్ప క్షేత్రస్తాయిలో భక్తుల కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించడంలో దారుణంగా విఫలమయ్యారు. పోలీసులు, టీటీడీ విజిలెన్స్ వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న బైరాగిపట్నంలోని క్యూలైన్ల దగ్గర ఒక క్రైం డీఎస్పీ క్యూలైన్లలోకి జనంను వదలకుండా వారిని గంటల తరబడి పార్క్ లోకి పంపి, తరువాత ఒక్క సారిగా వారిని క్యూలైన్లలోకి అనుమతిస్తూ గేట్లను తెరవడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది. 

- వైయస్ఆర్ సీపీ హయాంలో భక్తుల సదుపాయాలకే ప్రాధాన్యం

వైయస్ఆర్ సీపీ హయాంలో శ్రీవారి దర్శనం కోసం పర్వదినాల్లో వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. కనీసం పదిహేను రోజులకు ముందే క్యూలైన్లను పరిశీలించడం, టీటీడీ అధికారులు, పోలీసులతో సమన్వయం చేసుకుంటూ, ఎక్కడా ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేయడం వల్లే ఎటువంటి తొక్కిసలాటలు లేకుండా చూశాం. నేడు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు  తిరుమలను రాజకీయ క్రీడామైదానంగా మార్చేశాడు. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించడంతోనే గత పాలకులు, గత టీటీడీ పాలకమండలిపై బుదరచల్లడమే పనిగా పెట్టుకున్నాడు. ఆయనను కనీసం టీటీడీ లోని ఈఓ, జెఈఓ స్థాయి అధికారులే పట్టించుకోవడం మానేశారు. 

- తిరుమలలో అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి రాజకీయం

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు పూర్తిగా అడిషనల్ ఈఓ వెంకయ్యచౌదరి కూడా బాధ్యత వహించాలి. ఆయన చంద్రబాబు సేవలోనే మునిగిపోయాడు. భక్తులను గాలికి వదిలేశాడు. ప్రతిపక్షాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రభుత్వంలోని వారికి ఊడిగం చేస్తున్నాడు. రోజుకు ఏడు వేల మందికి పైగా విఐపీ బ్రేక్ దర్శనాలు చేయిస్తున్నాడు. వారికి అనుకూలమైన వారికి రాచమర్యాదలు చేస్తున్నాడు. వెంకయ్య చౌదరిపైన అజమాయిషీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఈఓ శ్యామలరావు కూడా దీనికి బాధ్యత వహించాలి. తెలంగాణా నుంచి కావాలని ఒక ఎస్పీ స్థాయి అధికారిని తిరుపతికి తీసుకువచ్చారు. ఆయన కూడా చంద్రబాబు సేవలో తలమునకలు అవుతున్నారు. నిన్న జరిగిన ఘటనా స్థలంలో పట్టుమని పదిమంది పోలీసులు లేరు. ఈ రోజు చంద్రబాబు పర్యటనకు రెండు వేల మంది పోలీసులను నియమించారు. క్షతగాత్రులను చూసేందుకు కూడా మాకు అవకాశం లేకుండా చేయడం దుర్మార్గం కాదా? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైయస్ఆర్ సీపీ నాయకులపై తప్పుడు ఆరోపణలు మోపి, వారిని జైలుకు ఎలా పంపాలా అనే ఆలోచిస్తున్నారు. టీటీడీని ప్రక్షాళన చేస్తానంటూ చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు. టీటీడీ చైర్మన్ లుగా పనిచేసిన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డిని ఎలా కేసుల్లో ఇరికించాలి, విజిలెన్స్ ను ఉసిగొలిపి ఎలాంటి తప్పులు కేసులు బనాయించాలనే దానిపైనే ప్రభుత్వం దృష్టి సారించింది.

- టోకెన్ల వల్లే ఈ తంటాలు అంటూ ఎల్లో మీడియా రాయడం దారుణం 

టోకెన్లతోనే తంటాలు అంటూ తెలుగుదేశంకు వంత పాడే ఒక పత్రికలో కథనం వచ్చింది. గత ప్రభుత్వంలో ఏకాదశి, ద్వాదశి రోజుల్లోనే వైకుంఠ ద్వారదర్శనం ఉండేది. దీనివల్ల ఎక్కువ మంది భక్తులకు దర్శనభాగ్యం లభించడం లేదనే ఉద్దేశంతో పది రోజుల పాటు సాధారణ భక్తులకు కూడా వైకుంఠ ద్వారదర్శనం కలిగించాలనే మంచి ఉద్దేశంతోనే ఈ టోకెన్ల విధానంను గతంలో మేం ప్రవేశపెట్టాం. దీనివల్లే ఈ ప్రమాదానికి కారణం అంటూ సదరు పత్రిక పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మీ వైఫల్యాలను గత ప్రభుత్వం, గత పాలకమండలి మీదికి నెట్టేయాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. గతంలో నైతికత ఉన్న నాయకులు పాలకులుగా ఉన్పప్పుడు ఇటువంటి ఘటనల్లో బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామాలు చేశారు. కానీ ఇప్పుడు ఉన్న చంద్రబాబు అలా చేస్తాడని అనుకోవడం లేదు. 

- సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ ఎందుక స్పందించడం లేదు?

సన్నాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని తిరుపతిలో వీరతాళ్లు వేసుకుని తిరిగిన పవానానంద స్వామికి బాధ్యత లేదా? దీనిపైన వెంటనే స్పందించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ కు లేదా? గేమ్ చేంజర్ ప్రీరిలీజ్ సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోతే, రోడ్ల వల్లే ఈ ఘటన జరిగిందని, రోడ్ల దుస్థితికి కారణం గత ప్రభుత్వమే కారణం అంటూ ఆయన మాట్లాడారు. పేరకు సనాతనధర్మ పరిరక్షణ అంటారు, కానీ ఆచరణలో మాత్రం దానిని పట్టించుకోరు. చంద్రబాబు దేవుడితో పెట్టుకున్నారు. దేవుడిని రాజకీయపావుగా వాడుకుంటున్నారు. చివరికి శ్రీవారి లడ్డూలో ఆవు కొవ్వు కలిపారంటూ చేసిన దుర్మర్గపు ప్రచారానికి భగవంతుడు కళ్ళు తెరిచారు. అయిదేళ్ల వైయస్ఆర్ సీపీ పాలనలో తిరుమల పవిత్రతను మేం కాపాడినంతగా ఎవరూ కాపాడలేదు. దీనిపై చంద్రబాబు, వవన్ కళ్యాణ్‌ లతో బహిరంగ చర్చకు సిద్దం. ఈ ఏడు నెలలుగా వైయస్ఆర్ సీపీ, జగన్ గారి మీద ఏడుపు తప్ప పాలన ఏదీ? కుట్ర కేసులు బనాయించే కార్యక్రమాల్లో పోలీసులను నిమగ్నం చేయడం వల్లే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని కరుణాకర్ రెడ్డి విమర్శించారు.

Source From: రాజాజీ