'కూటమి ప్రభుత్వ విధ్వంసక పాలన'

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విధ్వంసక పాలనను సాగిస్తోందని వైయస్ఆర్ సీపీ నేత, మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని, దేశంలోని మిగిలిన రాష్ట్రాల కన్నా జీడీపీ పదిశాతం తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఏడు నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.


Published on: 08 Jan 2025 16:19  IST

సంపద సృష్టింస్తాను అని పదేపదే సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలకు అర్థం... దేశంలోనే అత్యంత సంపన్నుడైన సీఎంగా తాను గుర్తింపు పొందడం అని అర్థం చేసుకోవాలి. ఆయన పాలనలోని ప్రజల జీవితాలు మాత్రం రోజురోజుకూ పేదరికం వైపు పయనిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని దూరం చేసింది. మేనిఫేస్టోలో చెప్పిన హామీల అమలుపై దృష్టి లేదు, కానీ ఏడు నెలల్లోనే ఏకంగా రూ.1.20 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. మరి ఈ నిధులను ఎవరి కోసం ఖర్చు చేస్తున్నారు? ప్రజలపై భారం మోపడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ఏకంగా రూ.పదహారు వేల కోట్లు విద్యుత్ చార్జీల రూపంలో ప్రజలపై భారాన్ని మోపారు. సంక్రాంతి పండుగకు ప్రభుత్వం కానుక రాకపోతే, కనీసం వారు బయటి మార్కెట్ లో నిత్యావసరాలను సైతం అధిక ధరల కారణంగా కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారు. గొప్ప విజనరీని అంటూ ప్రతిసారీ డాక్యుమెంట్లను విడుదల చేసి, షో పాలిటిక్స్ చేస్తున్న చంద్రబాబు తన పాలనలో ప్రజలు అనుభవిస్తున్న బాధలను పట్టించుకోవడం లేదు. 

- వైయస్ జగన్ హయాంలో సంక్షేమ క్యాలెండర్

వైయస్ జగన్ గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మేనిఫేస్టోను తూచా తప్పకుండా అమలు చేశారు. ప్రజలకు సంక్షేమ క్యాలెండర్ ను ప్రకటించి మరీ పథకాలను అమలు చేశారు. ఈ సారి ఆయన అధికారంలోకి వచ్చి ఉంటే... గత ఏప్రిల్ నెలకు సంబంధించి వసతి దీవెన, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, మే నెలలో విద్యాదీవెన, ఉచిత పంటల బీమా, రైతుభరోసా, మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ ఇచ్చేవారు. జూన్ నెలలో అమ్మ ఒడి, జులై లో విద్యాకానుక, వాహన మిత్ర, కాపునేస్తం, చిరువ్యాపారులకు జగనన్న తోడు వచ్చేవి. ఆగస్టులో రెండో విడత విద్యాదీవెన, నేతన్న నేస్తం అందేది. సెప్టెంబర్ లో వైయస్ఆర్ చేయూత, అక్టోబర్ లో రెండో విడత రైతుభరోసా, నవంబర్ లో మూడో విడత విడత విద్యాదీవెన, రైతులకు సంబంధించి సున్నావడ్డీ, డిసెంబర్ లో ఈబీసీ నేస్తం, లా నేస్తం జమ చేసేవారు. జనవరిలో జగనన్న తోడు, రైతుభరోసా జమ చేసేవారు. ఈ ఎనిమిది నెలల్లో ఇవ్వన్నీ లేకుండా చేశారు.  ఇవ్వన్నీ ప్రజలకు ఇచ్చి ఉంటే ఎంత డబ్బు వారి చేతుల్లో ఉండేది. ఇవి ఏమీ ఇవ్వకపోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలల్లోనే ఏకంగా రూ.1.20లక్షల కోట్లు అప్పులు తీసుకువచ్చారు. పైగా మా ప్రభుత్వంపై రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. కానీ వారు చెప్పిన లెక్కల ప్రకారం కేవలం నాలుగు లక్షల కోట్లు మాత్రమే మా హయాంలో చేసిన అప్పులు. అవి కూడా ప్రజలకు సంక్షేమాన్ని, రాష్ట్రంలో అభివృద్దిని తీసుకురావడానికే చేశాం. మరి మీరు చేస్తున్న అప్పులు ఎవరికి మేలు చేయడానికి? కూటమి ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో ప్రజల జీవన శైలి దారుణంగా పడిపోతోంది. 

హామీల అమలు ఏది బాబూ...?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తల్లికి వందనం ఇవ్వలేదు. వేలాది మంది విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుతున్నారు. మహిళలకు మీరు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు, రైతులకు ఇప్పటి వరకు రూపాయి సాయం అందలేదు. మేం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకంగా 16వేల టీచర్ పోస్ట్ ల భర్తీకి డీఎస్సీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. దీనిలో గతంలోని మా ప్రభుత్వం మంజూరు చేసినవే 10 వేల పోస్ట్ లు ఉన్నాయి. పోనీ ఇవి అయినా భర్తీ చేశారా అని చూస్తే ఇప్పటి వరకు దానికి దిక్కు లేకుండా పోయింది. నిరుద్యోగులకు ప్రతినెలా మూడు వేల రూపాయల చొప్పున ఇస్తామన్న నిరుద్యోగభృతి ఏమయ్యింది? కొత్త ఉద్యోగాలు లేవు, మరోవైపు ఉన్న ఉద్యోగాలనూ తీసేశారు. చివరికి గౌరవ వేతనం తీసుకుంటూ పనిచేస్తున్న వాలంటీర్లను కూడా రోడ్డు మీదకు తీసుకువచ్చారు. 
50 సంవత్సరాలు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెన్షన్ ఇస్తామని హామీఇచ్చారు. అవి ఎప్పుడు అమలు చేస్తారా అని పేదలు ఎదురుచూస్తున్నారు. వీటిని పట్టించుకోకుండా ఇప్పటికే ఇస్తున్న పెన్షన్ లలో దాదాపు మూడు లక్షల పెన్షన్లను తొలగించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని హామీఇచ్చారు. వాటి అమలు ఎప్పుడు? ఇప్పటికైనా చంద్రబాబు మారాలి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. 


ఆరోగ్యశ్రీ పథకం ఉసురు తీస్తున్నారు

ఎందరికో ప్రాణదానం చేసిన ఆరోగ్యశ్రీ వంటి మంచి పథకాలను కూడా నిర్వీర్యం చేస్తున్నారు. వైయస్ఆర్ సీపీ హయాంలో పేద రోగుల కోసం రూ.13000 కోట్లు ఖర్చు చేశాం. చికిత్స తరువాత ఆరోగ్య ఆసరా కింద 24 లక్షల మందికి దాదాపు రూ.1400 కోట్లు ఇచ్చాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలల్లో ఆరోగ్యశ్రీకి వేల కోట్లు బకాయిలు పడి, ఇప్పుడు ఈ పథకంను బీమా పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మా హయాంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చి, ఈ రాష్ట్రంలోని విద్యార్ధులకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని ప్రయత్నిస్తే, ఇప్పుడు ఆ కాలేజీలను వద్దు అంటూ వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. 

నేడు ప్రధాని ప్రారంభిస్తున్నవి మా హయాంలో తెచ్చినవే

ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదిగా ప్రారంభిస్తున్న కార్యక్రమాలన్నీ వైయస్ఆర్ సీపీ హయాంలో ప్రారంభించినవే. వాటిని ఇప్పుడే తీసుకువచ్చినట్లుగా కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభోత్సవాలు, భూమిపూజలు చేయిస్తున్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను చూసి కొత్తగా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని  శ్రీకాంత్  రెడ్డి విమర్శించారు.
 

Source From: రాజాజీ