'ఇదిగో మా హయాంలో పారిశ్రామికాభివృద్దికి రుజువులు'

గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీఎం వైయస్‌ జగన్‌ చొరవతో రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులకే ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రధాని మోదీతో శంకుస్థాపనలు చేయిస్తోందని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ఆక్షేపించారు. ప్రధాని పర్యటనతో సీఎం చంద్రబాబు షో చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలతో ప్రజల్ని ఏమార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. అంతకు ముందు చంద్రబాబు పాలన కన్నా, గత ప్రభుత్వంలో జగన్‌ పాలనలోనే పారిశ్రామిక రంగం గణనీయంగా పురోగతి సాధించినట్లు గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. మరోవైపు కమీషన్ల కోసం టీడీపీ నాయకుల బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు హడలెత్తిపోతున్నారని మార్గాని భరత్‌ ధ్వజమెత్తారు.


Published on: 08 Jan 2025 16:36  IST

తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మార్గాని భరత్ మీడియాతో   మాట్లాడుతూ... 

రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రాజెక్టుల శంకుస్ధాపనల కోసం రావడం మంచి పరిణామం. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి ఉంటే బాగుండేది. కానీ ఆయన ఆ దిశలో ఏం సాధించలేదు. ఈరోజు ప్రధాని శంకుస్ధాపనలు చేయబోయే గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు, రైల్వే జోన్, బల్క్‌ డ్రగ్‌ పార్కు.. ఇవన్నీ గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ చొరవతో రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులు. అయితే సొమ్మొకడిది.. సోకొకడిది అన్నట్టు వీటిని ఈరోజు తామే సాధించి తెచ్చినట్టు చంద్రబాబు కలరింగ్‌ ఇచ్చుకోవడం హాస్యాస్పదంగా ఉంది. నిజంగా వారికి దమ్ము, ధైర్యం ఉంటే, రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలి. అలాగే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోమని ప్రధాని మోదీతో ప్రకటన చేయించడంతో పాటు, కర్నాటకలోని విశ్వేశ్వరయ్య స్టీల్‌ ప్లాంట్‌కు ఇస్తున్నట్లు రూ.15వేల కోట్ల కేటాయింపు జరిగేలా చూడాలి. ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుపై వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే ఒప్పందం జరిగింది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ను 17 రాష్ట్రాలతో పోటీపడి, నాడు మన రాష్ట్రం సాధించింది. దక్షిణాదిలో మరే రాష్ట్రానికి అప్పుడు అది సాధ్యపడలేదు.  పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారంటూ, టీడీపీ పిచ్చి విమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి రేటు ఎక్కువగా ఎవరి హయాంలో నమోదైంది అన్నది చూస్తే, పారిశ్రామికవేత్తలు అసలు ఎవరిని చూసి భయపడుతున్నారో అందరికీ తెలుస్తుంది. 

కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికి పారిశ్రామిక వృద్ధి రేటు 11.92 శాతంగా ఉంటే, 2024లో జగన్‌గారు దిగిపోయే నాటికి ఆ వృద్ధి రేటు 12.61 శాతంగా నమోదైంది. ఇంకా చంద్రబాబు హయాంలో రాష్ట్ర రుణంలో 19.54 శాతం పెరుగుదల కనిపిస్తే, అది జగన్‌గారి హయాంలో 15 శాతం మాత్రమే. అలాగే తలసరి ఆదాయం (పీసీఐ) 2018–19 నాటికి రూ.1.54 లక్షలు కాగా, 2023–24 నాటికి అది రూ.2.19 లక్షలకు పెరిగింది. పారిశ్రామిక ఉత్పత్తుల విలువలో చంద్రబాబు హయాంలో దేశంలో మన రాష్ట్రం 11వ స్థానంలో ఉంటే, జగన్‌గారి పాలనలో 2022–23 నాటికే 8వ స్థానానికి ఎగబాకింది. దేశ జీడీపీలో చంద్రబాబు హయాంలో మన రాష్ట్ర జీడీపీ వాటా 4.47 శాతం కాగా, జగన్‌గారి హయాంలో అది 4.83 శాతానికి పెరిగింది.
 

Source From: Telugu Peoples