8న ప్రధాని మోడి విశాఖపట్నం పర్యటన ఇలా..

జనవరి 8వ తేదీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విశాఖపట్నం రానుండగా అందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వర్చువల్ గా సుమారు 20 వరకూ వివిధ ప్రారంభోత్సవాలు,శంఖుస్థాపనలను చేయనున్నారని తెలిపారు.


Published on: 07 Jan 2025 16:59  IST


8వ తేదీ బుధవారం సాయంత్రం 4.15 గం.లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విమానంలో విశాఖపట్నం చేరుకుని సా.4.45 గం.ల నుండి 5.30 గం.ల వరకూ రోడ్డు షోలో పాల్లొంటారని సిఎస్ విజయానంద్ వెల్లడించారు.అనంతరం సా.5.30 గం.ల నుండి 6.45 గం.ల వరకూ ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళశాల మైదానం సభా వేదిక వద్ద నుండి వర్చువల్ గా పలు శంఖుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేసి సభలో మాట్లాడతారని తెలిపారు. తదుపరి సాయంత్రం 6.50 గం.లకు సభా వేదిక నుండి బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని రాత్రి 7.15 గం.ల విశాఖ నుండి విమానంలో భువనేశ్వర్ బయలుదేరి వెళతారని సిఎస్ పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విశాఖలో సుమారు 3 గం.ల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని ముఖ్యంగా వెంకటాద్రి వంటిళ్ళు రెస్టారెంట్ ప్రాంతం నుండి సుమారు కిలోమీటరు పొడవున రోడ్డు షోలో పాల్గొని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వరకూ చేరుకుంటారని సిఎస్ విజయానంద్ తెలిపారు.అక్కడ నుండే వర్చువల్ గా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సహా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్,నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు,కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్,గుంటూరు-బిబినగర్,గుత్తి-పెండేకళ్లు రైల్వే లైన్ల డబులింగ్ వంటి పనులకు ప్రధాని శంఖుస్థాపన చేస్తారని తెలిపారు.అదే విధంగా 16వ నంబరు జాతీయ రహదారిలో చిలకలూరి పేట 6లైన్ల బైపాస్ ను జాతికి అంకితం చేయడం తోపాటు పలు జాతీయ రహదార్లు,రైల్వే లైన్ల ను వర్చువల్ గా ప్రధాని ప్రారంభిండం జరుగుతుందని సిఎస్ విజయానంద్ వెల్లడించారు.
 

Source From: రాజాజీ