అయ్యో బంగ్లాదేశ్‌.. కొనసాగుతున్న విధ్వంసం

బంగ్లాదేశ్‌లో ప్రధాని షేక్‌ హసీనా పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయినా అక్కడ చెలరేగిన విధ్వంసం కొనసాగుతూనే ఉంది. షేక్‌ హసీనా ప్రధానిగా తప్పుకోవాలంటూ నిరసనలు వెల్లువెత్తగా.. సోమవారం సాయంత్రానికే ఆమె దేశం విడిచి వెళ్లిపోయారు. అయినా అల్లరి మూకలు ఆ రాత్రంతా దేశవ్యాప్తంగా యథేచ్ఛగా విధ్వంసం కొనసాగించాయి.


Published on: 07 Aug 2024 11:57  IST

ఇళ్లు, దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలకు విచ్చలవిడిగా నిప్పు పెట్టారు. చివరికి పోలీస్‌ స్టేషన్లను కూడా వదల్లేదు. ఒకచోట ఎస్సైని కొట్టి చంపారు. మరోచోట ప్రముఖ సినీ హీరో ఇంటిపై దాడికి దిగగా, హీరో, ఆయన తండ్రి తుపాకీతో బెదిరించారు. దీంతో నిరసనకారులు మరింతగా రెచ్చిపోయి.. ఇద్దరినీ కర్రలతో కొట్టి చంపేశారు. జోషోర్‌ జిల్లాలో హసీనాకు చెందిన అవామీ లీగ్‌ పార్టీ నాయకుడి హోటల్‌ని తగలబెట్టడంతో 24 మంది సజీవ దహనమయ్యారు. సోమవారం ఢాకాలో పాక్షికంగా ధ్వంసం చేసిన హసీనా తండ్రి, బంగబంధు షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ విగ్రహాన్ని బుల్డోజర్లతో కూల్చేశారు.

అల్లరి మూకలు ముఖ్యంగా అక్కడి మైనారిటీలైన హిందువులను దేశవ్యాప్తంగా లక్ష్యం చేసుకున్నాయి. దేవాలయాల ధ్వంసం చేశారు.. మహిళలపై అకృత్యాలకు తెగబడ్డారు.. హసీనా దేశాన్ని వీడిన తర్వాత జరిగిన దమనకాండలో మొత్తంగా దేశవ్యాప్తంగా 100 మందికి పైగా మృతి చెందినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో గత నెల రోజుల్లో మరణించిన వారి సంఖ్య 440 దాటింది. సైన్యం రంగంలోకి దిగడంతో మంగళవారం సాయంత్రానికి పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్టు చెబుతున్నారు.

Source From: bangladesh