రాజకీయాల్లోకి ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ .. కర్నూలు సిటీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ


Published on: 28 Feb 2024 11:15  IST



సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు. వైఎస్ఆర్సీపీలో చేరి కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. సీఎం జగన్ కి అత్యంత సన్నిహితమైన అధికారిగా ఉన్న ఇంతియాజ్ కి మైనార్టీ వర్గాల్లో మంచి పేరుంది. ప్రస్తుతం ఆయన మూడు కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తుండడమే ఇందుకు ఉదాహరణ. సెర్ప్ సీఈవోగా, సీసీఎల్ఏ అదనపు కమిషనర్ గా, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
  వచ్చే ఎన్నికల్లో ఆయనకు మైనారిటీ కోట కింద సీటు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ చాలా రోజుల క్రితమే నిర్ణయించినట్లు సమాచారం. ఇంతియాజ్ సతీమణిది కర్నూలు నగరం కావడం, ఆయన మామకు మంచి పేరు ఉండడంతో నియోజకవర్గ నుంచి ఇంతియాజ్ బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. ఇంతియాజ్ మావయ్య ఐదు రూపాయల డాక్టర్ గా కర్నూలు నగరంలో అందరికీ సుపరిచితులు. ఇంతియాజ్ కు ఐఏఎస్ అధికారిగా చేసిన అనుభవం, మైనార్టీ వర్గాల్లో ఉన్న విశేష ఆదరణ, ఆయన మామయ్యకు కర్నూలు నగరంలో ఉన్న పేరును దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని నిర్ణయించారు. ప్రస్తుత కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు స్థానంలో ఇంతియాజ్ కు సీటు ఇవ్వనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్ ఇంతియాజ్ ను పిలిచి కర్నూల్ సిటీ నుంచి పోటీకి సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు తెలిసింది. ఇందుకు ఆయన సమ్మతించి అధికారిక ప్రకటన తర్వాత ఐఏఎస్ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.

Source From: Ias imtiyaz