పీవీ దేశం కోసం ఏం చేశారు?

బహుభాషా కోవిదుడు, తెలుగు తేజం, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను ప్రకటించింది. పీవీ అసలు ఈ దేశానికి ఏం చేశారు? ఆయన సాధించిన ఘనతలేంటి? వరంగల్‌ జిల్లాలోని ఒక మారుమూల పల్లెలో పుట్టిన వ్యక్తి.. అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధానిగా ఆయన ప్రస్థానం. ప్రధాని పదవి చేపట్టి.. మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం నడిపిన చాణక్యత.. దేశాన్ని సంక్షోభం నుంచి రక్షించిన ఆయన చతురత గురించి ఈ తరం వారు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన తెలుగు జాతి ముద్దు బిడ్డ లైఫ్‌ జర్నీ..


Published on: 09 Feb 2024 23:27  IST


 

పీవీ నరసింహారావు పూర్తి పేరు పాములపర్తి వేంకట నరసింహారావు. 1921 జూన్‌ 28న జన్మించి.. 2004 డిసెంబర్‌ 23న మరణించారు. భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 వరకు పనిచేశారు. ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు. దాకా పనిచేశాడు. ఈయన బహుభాషావేత్త, రచయిత కూడా. ఈ పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు. తెలంగాణలోని వరంగల్‌ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు పీవీ జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్య అభ్యసించారు. తరువాత పూర్వపు కరీంనగర్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు నరసింహారావును దత్తత తీసుకోవడంతో అప్పటి నుంచి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యారు.

నిజాంను ధిక్కరించిన కాంగ్రెస్‌ యువనేతగా..
ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన పీవీ.. కాంగ్రెస్‌ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1938లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఆ తర్వాత 1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పీవీ మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 1991లో ప్రధాని పదవి చేపట్టి.. సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించి తన నాయకత్వం పటిమను ప్రపంచానికి చాటిచెప్పారు.

ప్రధానిగా దేశంపై పీవీ మార్క్‌..
పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్లో ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్నీ, పీవీని చుట్టుముట్టాయి. ఆర్థిక వ్యవస్థ నాశనం కావడంతో భారతదేశం దాదాపు దివాలా తీసే స్థాయికి దిగజారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పీవీ పనితనం బయటపడింది. ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు సరికొత్త సంస్కరణలకు బీజం వేశారు. అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్‌ సింగ్‌తో కలిసి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలో దేశం ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు. పంజాబ్‌లో ఖలిస్థానీ తీవ్రవాదాన్ని, కశ్మీరులో ప్రముఖులను ఉగ్రవాదులు బంధిస్తే.. వారి డిమాండ్లకు తొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ అసలు రూపాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల ముందు చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా, ఇరాన్‌లతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని. 1998లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదట మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. ఈ విజయాలతో పీవీపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అవినీతి ఆరోపణలతో పాటు 1994లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన గండం నుంచి తన మైనారిటీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి వక్ర మార్గాలను అనుసరించారని, 1992 డిసెంబర్‌ 6న అయోధ్యలో బాబ్రీ మసీదును కూలగొట్టేందుకు పరోక్షంగా సహకరించారని, సాధువులకు, బాబాలకు అతి సన్నిహితంగా ఉండేవారని పీవీపై విమర్శలు ఉన్నాయి. ఎన్ని విమర్శలు ఉన్నా.. ఆయన సాధించిన విజయాలు, దేశాన్ని సంక్షోభం నుంచి రక్షించిన ఆయన మేథస్సు ముందు నిలబడలేదు. తెలుగు జాతి గర్వించదగ్గ ప్రధాని, దేశాన్ని రక్షించిన యోధుడు, చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి.. భారత రత్న పీవీ నరసింహారావు. ఆయన లైఫ్‌ స్టోరీతోపాటు, భారత రత్న అవార్డు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. 
 

Source From: pv narasimha rao