ఒకప్పటి నక్సలైట్.. ఇప్పటి మంత్రి

ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ఇప్పుడు తెలంగాణ మంత్రి. ఇప్పుడు సెల్యూట్ కొడుతున్న పోలీసులు ఒకప్పుడు ఆమెను వేధించారు. దొరికితే ఎన్ కౌంటర్ చేయాలని చూశారు. కానీ రాజకీయ చదరంగంలో ఆమె గెలిచి అదే పోలీస్ వ్యవస్థను తన కాళ్ల కిందకు తెచ్చుకుంది.


Published on: 08 Dec 2023 01:20  IST


తెలంగాణ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవ వేదికపై సీఎస్ శాంతకుమారి.. ధనసరి అనసూయ ఎలియాస్ సీతక్క పేరు పిలిచినప్పుడు యావత్ లాల్ బహదూర్ స్టేడియం చప్పట్లతో మార్మోగింది. మరే పేరుకు రాని స్పందన ఆమెకు రావడం ఒకింత ఆశ్చర్యమే. ఆ హర్షధ్వానాల మధ్య ముకుళిత హస్తాలతో చాలా సాదాసీదాగా కనిపిస్తున్న ఆ సీతక్కను గవర్నర్ తమిళసై.. ప్రమాణం చేయమని రెండు సార్లు చెప్పాల్సిరావడం వింతే కధా మరి.

సీతక్క ప్రస్థానం ఇదీ

తను జనశక్తి గ్రూపులో ఓ దళ సభ్యురాలు అప్పట్లో… అప్పటి ఆ ఏరియా ఆ గ్రూపు నక్సలైట్ల లీడర్ రామును పెళ్లి చేసుకున్నా, తరువాత విడిపోయింది. తన విప్లవ జీవితం దృష్ట్యా పోలీసుల వేధింపులు, బెదిరింపులు అనుభవించే ఉండొచ్చు. కానీ అభినందనీయం ఏమిటంటే..? ఆమె ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి వచ్చినా పాత చేదు అనుభవాలతో సొసైటీ మీద వ్యతిరేక భావనను పెంచుకోలేదు. సొసైటీని ఇంకా ఎక్కువ ప్రేమించింది.

జనశక్తి వర్సెస్ పీపుల్స్ వార్...

అంతటి కరోనా విలయంలో మారుమూల పల్లెలకూ ప్రయాసపడి తిరిగి ‘నేనున్నా’ అనే భరోసాను, నిత్యవసరాలను, మందుల్ని ఇచ్చింది. ఆమె ఓ లీడర్… ఈసారి ఎలాగైనా ఆమెను ఓడించాలనుకుని బీఆర్ఎస్ బడే నాగజ్యోతిని ఆమెకు పోటీగా నెలబెట్టింది. ఆమెది పీపుల్స్‌వార్ నేపథ్యం. పుట్టిందే అజ్ఞాతంలో… విప్లవగీతాలే లాలిపాటలు… అడవే ఊయల… తల్లి, తండ్రి దళంలోనే… నాగజ్యోతి మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకరన్న, బడే రాజేశ్వరి అలియాస్ నిర్మలక్క దంపతుల కుమార్తె… ఒకరు ఎమ్మెస్సీ, మరొకరు పీ.హెచ్.డీ
ఇద్దరు బాబాయ్‌లూ అదే గ్రూపు… ఒకరు ఇప్పుడు తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి… జనశక్తి సీతక్క గెలుపు కోసం జనశక్తి కూర రాజన్న ప్రచారం చేయగా… నాగజ్యోతి రాజకీయాల్ని సహజంగానే మావోయిస్ట్ పార్టీ, ఆమె బాబాయ్ వ్యతిరేకించారు… అది సైద్ధాంతికం… ఈమె ఎమ్మెస్సీ చేయగా, సీతక్క పీహెచ్‌డీ చేసింది.


ఇప్పుడు సీతక్క మంత్రి...
ఇప్పుడు సీతక్క తెలంగాణ రాష్ట్ర మంత్రి… రేవంత్ కేబినెట్ సభ్యురాలిగా ప్రమాణం చేస్తోంది… ఏ రాజ్యమైతే ఆమెపై నిఘా వేసి, నక్సలైటుగా వేధించిందో… అదే రాజ్యం ఆమెకు సెల్యూట్ చేస్తోంది. ఏ పోలీసుల వేధింపులు అనుభవించిందో, దొరికితే ఖతం చేయాలని చూసిందో ఆ పోలీస్ శాఖ ఇప్పుడు ఆమెకు గులాం గిరీ చేస్తోంది. వావ్… ఇదీ డెస్టినీ అంటే… నేపాల్‌లో భీకర సాయుధ విప్లవాన్ని నడిపించిన ప్రచండ తరువాత రోజుల్లో ఆయుధరహితంగానే ఆ దేశానికి అధినేత అయ్యాడు… అందుకే ఎవరో సినిమా కవి అన్నట్టు… విధి చేయు వింతలెన్నో...!!

Source From: Seetakka