తెలంగాణ ఎన్నికల్లో హైలెట్స్‌


Published on: 04 Dec 2023 00:17  IST

– కామారెడ్డిలో కేసీఆర్‌ ఓటమిపాలవడం ఈ ఎన్నికల్లో బిగ్‌ ట్విస్ట్‌గా ఉంది. గజ్వేల్‌లో గెలిచినా కామారెడ్డిలో ఆయన రెండవ స్థానానికి పరిమితమయ్యారు. 

– పోటీ చేసిన రెండు చోట్ల ఈటెల రాజేందర్‌ ఓటమిపాలయ్యారు. సీఎం కేసీఆర్‌పై పోటీ చేసిన గజ్వేల్‌ సహా ఆయన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లోనూ ఆయన ఓడిపోయారు. 

– కామారెడ్డిలో సీఎం కేసీఆర్, సీఎం అభ్యర్థి రేవంత్‌రెడ్డిలను బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి ఓడించడం సంచలనం సృష్టించింది. ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించిన గెలిచిన వ్యక్తి ఆయన జెయింట్‌ కిల్లర్‌గా మారారు. 6789 ఓట్లతో ఆయన గెలుపొందారు. 

– బీజేపీ ముఖ్య నేత బండి సంజయ్‌ ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 

– బర్రెలక్కగా సోషల్‌ మీడియాలో మారుమోగిన కర్నె శిరీష్‌కు కొల్లాపూర్‌లో 5598 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గెలిచారు. 

– చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి గెలిచిన అక్బరుద్దీన్‌ ఒవైసీకి అత్యధికంగా 81660 మెజారిటీ వచ్చింది. ఈ ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజారిటీ.
– సిర్‌పుర్‌ కాగజ్‌నగర్‌లో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఓడిపోయారు. ఆయనకు 41 వేల ఓట్లు వచ్చాయి. 

– 30 ఏళ్ల లోపు వయసున్న మైనంపల్లి రోహిత్, చిట్టెం పర్ణికారెడ్డి, మామిడాల యశస్వినిరెడ్డిలు కాంగ్రెస్‌ తరఫున గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. మెదక్, పాలకుర్తి, నారాయణపేట నియోజకవర్గాల నుంచి వీరు గెలుపొందారు.

– ఈ ఎన్నికల్లో ఆరుగురు మంత్రులు ఓడిపోయారు. ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్‌), కొప్పుల ఈశ్వర్‌ (ధర్మపురి), ఎర్రబెల్లి దయాకరావు (పాలకుర్తి), నిరంజన్‌రెడ్డి (వనపర్తి), పువ్వాడ అజయ్‌ (ఖమ్మం), శ్రీనివాస్‌గౌడ్‌ (మహబూబ్‌నగర్‌) ఓటమిపాలయ్యారు. 

– సిద్ధిపేటలో హరీష్‌రావు మెజారిటీ గతం కంటె తగ్గింది. గత ఎన్నికల్లో 1.18 లక్షల మెజారిటీతో గెలిచిన ఆయన ఈసారి 82 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 

– సిరిసిల్లలో కేటీఆర్‌ మెజారిటీ కూడా తగ్గింది. గతంలో 89 వేల ఓట్లతో గెలిచిన ఆయన ఇప్పుడు 33 వేల ఓట్లతో గెలిచారు.

– 2018 ఎన్నికల తర్వాత మధ్యలో నాలుగు ఉప ఎన్నికలు జరిగాయి. అవి దుబ్బాక, హుజూర్‌ నగర్, మునుగోడు, నాగార్జున సాగర్‌ నియోజకవర్గాల్లో. ఆయా ఉప ఎన్నికల్లో గెలుపొందినవారు ఈసారి ఓటమి చవిచూశారు.

– స్పీకర్‌గా పనిచేసినవారు ఓడిపోతారనే ఓ అపోహ ఉండేది. ఈసారి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి విజయం సాధించి ఆ అపోహలకు చెక్‌ పెట్టారు.

– ఈసారి కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగిన అన్నదమ్ములు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ఇద్దరూ విజయం సాధించారు. అలాగే బీజేపీని వీడి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన గడ్డం వివేక్, ఆయన సోదరుడు వినోద్‌ ఇద్దరూ ఈసారి బరిలో నిలిచి గెలుపొందారు.

– ఈసారి కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలిచిన భార్యాభర్తలు కూడా గెలుపొంది ఇద్దరూ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. వారు  టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఆయన భార్య పద్మావతి. వీరిద్దరూ కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి గెలుపొందారు.

– ఇక బీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా బరిలో దిగిన మామా అల్లుళ్లు చామకూర మల్లారెడ్డి, రాజశేఖరరెడ్డి ఇద్దరూ విజయం సాధించారు.

– మునుగోడులో సిట్టింగ్‌ స్థానాన్ని వీడిన రాజగోపాల్‌ రెడ్డికి ఉప ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. తాజా ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో దిగిన ఆయన ఈసారి గెలుపొందడం విశేషం.


 

Source From: ts elections