ఈ బుడతడు మృత్యుంజయుడు

గాల్లో 30 అడుగుల దూరం ఎగిరి పడ్డా ఏమీ కాలేదు అమెరికాలోని టెన్నెసీలో గత వారం ఓ అద్బుతం జరిగింది. రెండు భయానక టోర్నడోలు ఆ రాష్ట్రాన్ని నిలువునా వణికించాయి. ఓ చిన్నారితో సహా ఆరుగురు వాటి బారిన పడి దుర్మరణం పాలయ్యారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎన్నో ఆస్తులు ధ్వంసమయ్యాయి. కానీ భయానకమైన అంతటి టోర్నడోలో అమాంతం గాల్లోకి ఏకంగా 30 అడుగుల దూరం ఎగిరిపోయిన ఓ నాలుగు నెలల బుడతడు మాత్రం చెక్కు చెదరలేదు! అంత పెద్ద ప్రమాదం నుంచి నిక్షేపంగా బయటపడి ఔరా అనిపించాడు. సినిమాల్లోనే కన్పించే అద్భుతం తమ జీవితంలో నిజంగా జరిగిందంటూ అతని తల్లిదండ్రులు దేవునికి దండం పెట్టుకుంటున్నారు.


Published on: 18 Dec 2023 10:58  IST

ఇదీ జరిగింది
సిడ్నీ మూర్‌ (22), ఆరామిస్‌ యంగ్‌ బ్లడ్‌ (39) దంపతులది టెన్నెసీలోని క్లార్క్స్‌ విల్లే, మొబైల్‌ వ్యాన్లోనే నివాసం, వారికిద్దరు కొడుకులు. పెద్దవాడు ప్రిన్స్‌టన్‌కు ఏడాది కాగా రెండో వాడు లార్డ్స్‌కి నాలుగు నెలలు. గత శనివారం హఠాత్తుగా టోర్నడో (భారీ సుడిగాలి) క్లార్క్స్‌ విల్లేను కకావికలు చేసింది. స్థానిక అధికార యంత్రాంగం టోర్నడో సైరన్‌ ఇవ్వకముందే వారి మొబైల్‌ వ్యాన్‌పై విరుచుకుప డింది. చూస్తుండగానే పైకప్పును లేపేసింది. దాంతో మూర్‌ హుటాహుటిన ప్రిన్స్‌ టన్‌ హృదయానికి హత్తుకుని నేలకు కరుచుకుపోయింది. ఊయలలో నిద్రిస్తున్న లార్డ్స్‌ కాపాడేందుకు తండ్రి పరుగులు తీశాడు. అప్పటికే ఆ చిన్నారిని టోర్నడో అమాంతంగా ఎగరేసుకుపోయింది. సుడిగాలి, అందులో అప్పటికే చిక్కిన అనేకానేక శిథిలాల మధ్య పాపం పసివాడు సుడులు తిరుగుతూ కొట్టుకుపోయాడు. ఆ వెంటనే మొబైల్‌ వ్యాన్‌ పూర్తిగా నేలమట్టమైంది. హోరు గాలులు, వాటిని మించిన జోరు వానతో పరిస్థితి భీతావహంగా తయారైంది. శిథిలాల్లోంచి పెద్ద కొడుకుతో పాటుగా మూర్‌ పాక్కుంటూ సురక్షితంగా బయటికి రాగలిగింది. కానీ పసి వాడితో పాటు అతన్ని కాపాడబోయిన తండ్రి సైతం సుడిగాలి దెబ్బకు కొంత దూరం ఎగిరిపడ్డాడు. అంతెత్తు నుంచి అమాంతంగా కిందపడి భుజం విరగ్గొట్టుకున్నాడు. అంతటి నొప్పితోనే బాబు కోసం 10 నిమిషాల పాటు శిధిలాల దిబ్బలన్నీ ఆత్రంగా వెదికాడు. చివరికి 30 అడుగుల దూరంలో పడిపోయిన చెట్టు కింద చిన్నారి లార్డ్‌ గుక్కపట్టి ఏడుస్తూ కన్పించాడు. అంత దూరం ఎగిరిపోయి అమాంతంగా కింద పడ్డా గాయాలు కాకపోవడం విశేషం. ఇదంతా ఏదో సిని మాలో సన్నివేశంలా తోస్తోందంటూ జరిగిన భయానక ఘటనను మూర్‌ గుర్తు చేసుకుంది. 

టెన్నెసీలో అంతే...
టెన్నెసీ రాష్ట్రం అమెరికాలో భారీ టోర్నడో లకు పెట్టింది పేరు. గత శనివారం గంటకు ఏకంగా 125 మైళ్ల వేగంతో కూడిన గాలులు, భారీ వర్షంతో విరుచుకుపడ్డ టోర్నడోలు పెను విధ్వంసమే సృష్టించాయి. వాటిలో ఒక టోర్నడో అయితే మాంట్‌ మరీ కౌంటీ నుంచి లొగాన్‌ కౌంటీ దాకా ఏకంగా 43 మైళ్ల దూరం ప్రయాణించింది. దారిపొడవునా సర్వాన్నీ తుడిచి పెట్టేసింది.

 

Source From: tenneessee tornado baby