బంగాళాఖాతంలో మిథిలీ తుపాను!


Published on: 17 Nov 2023 11:08  IST


పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడనుంది. గురువారం అర్ధరాత్రికి ఇది తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపానుకు మిథిలీగా నామకరణం చేయనున్నారు. ఈ పేరును మాల్దీవులు దేశం సూచించింది. నిబంధనల ప్రకారం తుపాను ఏర్పడ్డాకే అధికారికంగా పేరును ప్రకటిస్తారు. గురువారం రాత్రికి తీవ్ర వాయుగుండం ఒడిశాలోని పారదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 210 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది తుపానుగా బలపడిన తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా బంగ్లాదేశ్‌ వైపు పయనించనుంది. శుక్రవారం అంతా బంగాళాఖాతంలో తుపానుగానే కొనసాగనుంది. అనంతరం బంగ్లాదేశ్‌లోని మోంగ్లా–ఖేపుపరాల మధ్య శనివారం వేకువజామున తీరాన్ని దాటుతుందని ఐఎండీ తెలిపింది. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 60–70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

ఈ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఏమాత్రం ఉండబోదని ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దూరంగా ఉంటూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల వైపు మళ్లడంతో రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పినట్టయింది. అయితే రానున్న రెండు రోజులు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరో ద్రోణి కొనసాగుతోంది. దీని ఫలితంగా రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గాని, జల్లులు గాని కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Source From: Cyclone