ఇక సర్వే నెంబర్లు ఉండవు

ఏపీలో జరుగుతున్న భూముల రీ సర్వేతో రాష్ట్రంలోని భూమి రికార్డుల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. ప్రస్తుతం ఉన్న సర్వే నెంబర్లు మున్ముందు కనుమరగవనున్నాయి. వాటి స్థానంలో ఎల్‌పీఎం (ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌) నెంబర్లు రానున్నాయి.


Published on: 04 Nov 2023 20:55  IST

రాష్ట్రంలో దశల వారీగా రీ సర్వే జరుగుతోంది. 17 వేల గ్రామాలకుగానూ ఇప్పటివరకు 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తయింది. ఈ గ్రామాల్లో ఎల్‌పీఎం నెంబర్లతోనే కార్యకలాపాలు జరుగుతున్నాయి. బ్రిటీష్‌ కాలంలో భూములను సర్వే చేసి ఇచ్చిన నెంబర్లే ఇప్పటికీ రికార్డుల్లో కొనసాగుతున్నాయి. ఒక సర్వే నెంబర్‌లో రెండు నుంచి 10 అంతకంటె ఎక్కువ మంది భూయజమానులున్నారు. ఒక సర్వే నెంబర్‌లో 30 ఎకరాల భూమి ఉంటే అందులో ఇద్దరి నుంచి 10, 15 మంది పేర్లు కూడా ఉన్నాయి. దీనివల్ల లెక్కలేనన్ని భూ సమస్యలు వాటి వల్ల వివాదాలు ఏర్పడ్డాయి. భూముల రీ సర్వే ద్వారా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపింది. ప్రతి భూ కమతానికి ఎల్‌పీఎం నెంబర్, ప్రతి యజమానికి ఆధార్‌ తరహాలో ఒక ఐడీ నెంబర్‌ ఇస్తోంది. 

మారనున్న 1.96 కోట్ల సర్వే నెంబర్లు
  రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాలు ఉండగా వాటి పరిధిలో 90 లక్షల మంది పట్టాదారులు (భూ యజమానులు) ఉన్నారు. ఆ పట్టాదారులకు చెందిన 2.26 కోట్ల ఎకరాల భూమి 1.96 కోట్ల సర్వే నెంబర్లుగా రికార్డుల్లో విభజించి ఉంది. రీ సర్వేలో ఈ మొత్తం విస్తీర్ణాన్ని డ్రోన్, ఏరియల్‌ సర్వే అవి చేయలేని చోట డీజీపీఎస్‌ సర్వే ద్వారా కొలుస్తున్నారు. కొలిచిన తర్వాత ప్రతి ల్యాండ్‌ పార్సిల్‌కు ఎల్‌పీఎం నెంబర్, ఆధార్‌ మాదిరిగానే భూదార్‌ పేరుతో విశిష్ట గుర్తింపు సంఖ్య, జియో కో–ఆర్డినేట్స్‌ను ప్రభుత్వం కేటాయిస్తోంది. ఈ ఎల్‌పీఎం  నెంబర్ల ప్రకారమే క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల్లో అప్‌డేట్లు జరుగుతాయి. దీంతో మోసపూరిత రిజిస్ట్రేషన్లకు, రికార్డుల ట్యాంపరింగ్‌కు ఏమాత్రం అవకాశం ఉండదు. సర్వే చేసి ప్రతి రైతుకి ప్రభుత్వం ఇచ్చే భూ హక్కుపత్రంలో ఆ వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందులోనే యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్, యజమాని ఫొటో, క్యూ ఆర్‌ కోడ్‌ ఉంటాయి. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ రైతుకు సంబంధించిన భూమి కొలతలు, భూ విస్తీర్ణం వంటి వివరాలన్నీ కనపడతాయి. 

వెబ్‌ల్యాండ్‌–2లో ఎల్‌పీఎం నెంబర్లు 


  రీ సర్వే ద్వారా కొత్తగా తయారు చేస్తున్న డిజిటల్‌ రెవెన్యూ రికార్డుల్లో ఇకపై ఎల్‌పీఎం నెంబర్లే ఉంటాయి. సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లోని రెవెన్యూ రికార్డులన్నీ ఇప్పటికే ఎల్‌పీఎం నెంబర్లతో అప్‌డేట్‌ చేశారు. ఆ గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు ఎల్‌పీఎం నెంబర్ల ద్వారానే నిర్వహిస్తున్నారు. రెవెన్యూ శాఖ రీ సర్వే పూర్తయిన గ్రామాల వివరాలతో ఇప్పటికే వెబ్‌ల్యాండ్‌–2 ఆన్‌లైన్‌ పోర్టల్‌ను అందబాటులోకి తెచ్చింది. ఆ రికార్డుల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించారు. సర్వే పూర్తయ్యే గ్రామాలను బట్టి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ ఆ గ్రామాల్లో ఎల్‌పీఎం ఆధారిత రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. త్వరలో మరో 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తవుతుండగా ఆ గ్రామాలను వెబ్‌ల్యాండ్‌–2కి మార్చనున్నారు. ఇలా విడతల వారీగా రాష్ట్రమంతా వెబ్‌ల్యాండ్‌–2కి మారిపోనుంది. అంటే భవిష్యత్తులో ఎల్‌పీఎం నెంబర్ల ద్వారానే భూముల్ని గుర్తిస్తారు. 
 

Source From: ap land survey