ఆఫ్గానిస్థాన్‌లో పెను భూకంపం.. 2 వేలమంది మృతి

తాలిబన్ల చెరలో మగ్గుతున్న ఆఫ్గానిస్తాన్‌ ప్రజలపై మరో పిడుగు పడింది. ఈసారి వారిని భూకంపం వెంటాడింది. కూలిపోయిన ఇళ్లు.. శవాల గుట్టలు.. ప్రజల ఆక్రందనలు.. ఆఫ్గానిస్థాన్‌లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇవే దృశ్యాలు కనపడుతున్నాయి.


Published on: 08 Oct 2023 17:48  IST


అఫ్గానిస్థాన్‌లో పెను భూకంపం వచ్చింది. శనివారం మధ్యాహ్నం వరుసగా ఏడు సార్లు వచ్చిన ప్రకంపనలతో వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో 2 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి వర్గాలు వెల్లడించాయి. ఈ భూకంప ప్రభావంతో హెరాత్‌ జిల్లాలోని నాలుగు గ్రామాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. భూకంప తీవ్రత  రిక్టర్‌ స్కేలుపై 6.3గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రం హెరాత్‌ నగరానికి వాయవ్య దిశగా 40 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది. ప్రధాన ప్రకంపన తర్వాత వచ్చిన ప్రకంపనలు 5.5 తీవ్రతతో ఉన్నాయని తెలిపింది. వీటి ప్రభావం హెరాత్‌ నగరంలోనూ కనిపించిందని స్థానికులు వెల్లడించారు. ఈ ప్రాంతం ఇరాన్‌ సరిహద్దులకు సమీపంలో ఉంది. 2022లోనూ అఫ్గానిస్థాన్‌ తూర్పు ప్రాంతాన్ని భారీ భూకంపం కుదిపేసింది. అప్పట్లో సుమారు వెయ్యిమంది చనిపోగా 1500 మంది వరకు గాయపడ్డారు. నేపాల్‌ పశ్చిమ ప్రాంత జిల్లా బఝంగ్‌ లోనూ శనివారం మధ్యాహ్నం సమయంలో వెంట వెంటనే రెండు సార్లు భూమి కంపించింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

 

Source From: Telugu Peoples