అత్యంత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం


Published on: 11 Sep 2024 11:40  IST

సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు ఆ పార్టీ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. న్యూమోనియా కారణంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో ఏచూరి బాధపడుతున్నారు. 72 ఏళ్ల ఏచూరిని కుటుంబసభ్యులు ఆగస్టు 19న ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేర్చారు. 


అప్పటి నుంచి చికిత్స అందిస్తున్నా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోగా.. శరీరంలోని ఇన్ఫెక్షన్‌ ఎక్కువైందని తెలిసింది. ఆస్పత్రిలో చేర్చిన నాటినుంచీ ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. ఇక్కడి మందులకు ఆయన శరీరంలోని ఇన్ఫెక్షన్‌ తగ్గకపోవడంతో విదేశాల నుంచి మందులు తెప్పించారు. మంగళవారం ఆయనకు ఆ మందులే ఇచ్చినట్టు తెలిసింది. 

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.  24 గంటలు గడిచిన తర్వాతనే ఆయన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించగలమని వైద్యులు కుటుంబీకులకు చెప్పారు. పలు విభాగాలకు చెందిన స్పెషలిస్టు డాక్టర్ల బృందం సీతారాం ఏచూరికి చికిత్స అందిస్తోంది. ఏచూరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న సీపీఎం నేతలు, కార్యకర్తలు పరామర్శించేందుకు ఢిల్లీకి వెళుతున్నారు.

Source From: Sitaram Yechuri