జైల్లో కన్నడ హీరోకి వీవీఐపీ ట్రీట్మెంట్

శాండల్‌వుడ్‌ స్టార్‌ హీరో దర్శన్‌.. తన అభిమానిని హత్య చేసిన కేసులో జైలులో ఉన్న విషయం తెలిసిందే. తన ప్రియురాలు పవిత్ర గౌడకు అశ్లీల మెసేజ్‌ పంపించాడనే కోపంతో రేణుకాస్వామి (28) అనే యువకుడిని దారుణంగా హతమార్చిన కేసులో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న దర్శన్‌కి అక్కడ వీవీఐపీ సౌకర్యాలు అందుతున్నాయనే అంశం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


Published on: 26 Aug 2024 16:06  IST

ఇంతకీ అసలేం జరిగిందంటే.. 

జైలులో ఉన్న దర్శన్‌.. ఓ చేతిలో కాఫీ కప్పు.. మరో చేతిలో సిగరెట్‌తో జైలు గార్డెన్‌లో దర్జాగా కూర్చుని రిలాక్స్‌ అవుతున్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దర్శన్‌తో పాటు రౌడీ షీటర్‌ విల్సన్‌ గార్డెన్‌ నాగ, మరో ఖైదీ మేనేజర్‌ నాగరాజ్‌ ఆ ఫొటోలో ఉన్నారు. ఈ ఫొటోని అదే జైలులో ఉన్న వేలు అనే ఖైదీ తన భార్యకు పంపాడని, అది సోషల్‌ మీడియాలో షేర్‌ అవ్వడంతో క్షణాల్లో వైరలైందని సమాచారం. 

పరప్పన జైలులో నిబంధనలు అమలు చేస్తున్న తీరుపై తాజాగా సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హత్య కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న దర్శన్‌కు వీవీఐపీ ట్రీట్‌మెంట్‌ అందుతోందని నెటిజన్లు మండిపడుతున్నారు. అందుకు జైలు గార్డెన్‌లో తోటి నేరస్తులతో కబుర్లు చెప్పుకొనేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలు, తాగేందుకు కాఫీ, సిగరెట్లు అందించడమే ప్రత్యక్ష నిదర్శనమని అంటున్నారు. మరి ఈ ఫొటోపై పరప్పన జైలు అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఇదిలావుండగా మరోపక్క దర్శన్‌ బెయిల్‌ కోసం ఆయన భార్య ప్రయత్నిస్తున్నారు.

Source From: Hero darsan