ఆ సెలబ్రిటీ చెట్టు కూలిపోయింది

సినిమా సెలెబ్రిటీలు అంటే గుర్తుకువచ్చేది.. స్టార్‌ హీరోలు, హీరోయిన్‌లు, కమెడియన్లు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు.. అంతేకదా అనుకోకండి.. ఒక చెట్టు కూడా ఉంది. అది నిజంగా సెలబ్రిటీయే. దానికి సినిమా చెట్టు అని పేరు. ఎందుకంటె చాలా సినిమాల్లో అది ముఖ్యమైన రోల్‌ పోషించింది. ఆ సినిమాలకు హీరో, హీరోయిన్‌ ఇతర క్యారెక్టర్లు ఎంత ప్రధానమో ఈ చెట్టు అంతే ప్రధానంగా ఉండేది. ఆ సినిమాల్లో దానికి ఒక లీడ్‌ రోల్‌ ఉంది. ఆ చెట్టును పెట్టి చాలా సీన్లు తీసేవారు. చివరికి ఆ చెట్టు కింద సీన్లు తీస్తే సినిమా సూపర్‌ హిట్‌ అనే సెంటిమెంట్‌ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ చెట్టు లేదు. గోదావరి వరదతో అది కూలిపోయింది.


Published on: 06 Aug 2024 21:11  IST

150-Years-Old 'Cinema Chettu' Uprooted By Godavari Floods! | 150-Years-Old 'Cinema  Chettu' Uprooted By Godavari Floods!
    తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం తాళ్ళపూడి సమీపంలోని కుమారదేవం గ్రామంలో ఉంది ఈ చెట్టు.  ఇది నిద్ర గన్నేరు చెట్టు. గోదావరి ఒడ్డున 145 ఏళ్లకు ముందు సింగలూరి తాతబ్బాయి దాన్ని నాటారు. ఎన్నో వరదలు, తుఫాన్లని తట్టుకుని అది పెరిగింది. రెండు, మూడు తరాల్ని చూసుకుంటా పెరిగి మహా వృక్షమైంది. ఇది నిద్ర గన్నేరు చెట్టు అని మరచిపోయారు ఆ ఊరి వాళ్లు. సినిమా చెట్టు అని పిలుస్తారు.

    ఈ చెట్టు కింద పాడిపంటలు, దేవత, వంశవృక్షం, బొబ్బిలిరాజా, హిమ్మత్‌ వాలా, సీతారామయ్యగారి మనవరాలు వంటి 108 సినిమాలు తీశారు. కెమేరా తీసుకొచ్చి దీని కింద పెడితే ఫ్రేము దానంతటదే వచ్చేస్తుంది. అంత మహత్యం ఈ చెట్టుకి ఉందని నమ్ముతారు. ఇంకో విషయం ఈ చెట్టు కింద ఒక్క షాట్‌ తీస్తే చాలు సినిమా సూపర్‌ హిట్టు అన్న సెంటిమెంటు కూడా వుంది. దర్శకుడు వంశీ అయితే ఈ చెట్టు లేకుండా సినిమా తీయరు. ఆయన తీసిన 18 సినిమాల్లోనూ ఈ చెట్టు ఉంది. రాఘవేంద్రరావు, దాసరి, జంధ్యాల, ఈవీవీ వంటి పెద్ద డైరెక్టర్లందరూ ఈ చెట్టు చుట్టూ తిరిగినవారే. క్రియేటివ్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల తీసిన గోదావరి సినిమాలో ‘ఉప్పొంగెలే గోదావరి’ పాట ఈ చెట్టు కింద తీసిందే. చెప్పుకుంటూపోతే వందల పాటలు ఈ చెట్టుతో ముడిపడి ఉన్నాయి. అలాంటి మహావృక్షం ఇక లేదంటే బాధే కదా. 

 

Source From: cinema chettu