బాలీవుడ్‌ అగ్ర నటులకు షాకిచ్చిన కేంద్రం


Published on: 10 Dec 2023 23:02  IST

 

ముగ్గురు బాలీవుడ్ అగ్ర నటులకు కేంద్ర ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. గుట్కా సంబంధిత వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్నారంటూ కోర్టులో దాఖలైన పిటిషన్‌ మేరకు ఈ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు అందుకున్న వారిలో షారుక్‌ ఖాన్, అక్షయ్‌ కుమార్, అజయ్‌ దేవగణ్‌ ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌కి తెలియజేశారు. 

కొన్ని హానికారక ఉత్పత్తులకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో అగ్రనటులు పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోతీలాల్‌ యాదవ్‌ అనే న్యాయవాది గతంలో అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. భారత ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన పురస్కారాలు అందుకున్నవారు ఇలాంటి ప్రకటనల్లో పాల్గొనడం సరికాదని పేర్కొన్నారు. దీన్ని విచారించిన కోర్టు.. పిటిషనర్‌ అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అప్పట్లో ఆదేశించింది. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదని పేర్కొంటూ ఇటీవల పిటిషనర్‌ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 

ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్బీ పాండే శుక్రవారం కోర్టుకు సమాచారం అందించారు. షారుక్‌ ఖాన్, అక్షయ్‌ కుమార్, అజయ్‌ దేవగణ్‌లకు అక్టోబర్‌ 22నే షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. మరోవైపు అమితాబ్‌ బచ్చన్‌ ఇప్పటికే ఈ తరహా ప్రకటనల నుంచి తప్పుకొన్నారని న్యాయస్థానానికి పాండే తెలియజేశారు. అయినప్పటికీ.. ఓ గుట్కా కంపెనీ ఆయన ప్రకటనలను ప్రసారం చేసిందని తెలిపారు. దీంతో అమితాబ్‌ సదరు కంపెనీకి లీగల్‌ నోటీసులు పంపారని పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఓ కేసు ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో ఉందని పాండే కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌ ను కొట్టివేయాల్సిందిగా కోరారు. వాదనలు విన్న కోర్టు.. దీనిపై తదుపరి విచారణను 2024 మే 9కి వాయిదా వేసింది.

Source From: Bollywood stars