ఎన్టీఆర్‌కు చంద్రమోహన్‌ అంటే పడేది కాదు !

తెలుగు సినీ వినీలాకాశంలో ఒక ధృవతార చంద్రమోహన్‌. ఏఎన్‌ఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ వంటి సూపర్‌ హీరోలతో పనిచేసిన ఆయన ఎన్టీఆర్‌తో మాత్రం చాలా తక్కువ సినిమాలు చేశారు. అందరితో కలిసి మెలిసి ఉన్న చంద్రమోహన్‌ ఎన్టీఆర్‌కి మాత్రం దూరంగా ఉన్నారు.


Published on: 12 Nov 2023 13:49  IST

 

తన నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న చంద్రమోహన్‌ అంటే ఇండస్ట్రీలో అందరూ ఇష్టంగా ఉండేవారు. దిగ్గజ దర్శకులు, హీరోలు ఆయన్ను అభిమానంగా చూసేవారు. అందరికీ ఇష్టుడైన చంద్రమోహన్‌ ఎన్టీఆర్‌కు మాత్రం దగ్గర కాలేకపోయారు. మొదటి నుంచి వాళ్లద్దరికి స్నేహం కుదరలేదు. అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి 40కిపైగా సినిమాలు చేసిన చంద్రమోహన్‌ ఎన్టీఆర్‌తో చేసిన సినిమాలు చాలా తక్కువ. ఎన్టీఆర్‌ కావాలని చంద్రమోహన్‌ను ఇబ్బంది పెట్టేవారనే అభిప్రాయం ఉంది. మేకప్‌మేన్‌ పీతాంబరానికి ఎన్టీఆర్‌ హిందీ సినిమా ‘యాదోంకి బారాత్‌’ రీమేక్‌ బాధ్యతలు అప్పగించారు. తెలుగులో అది ‘అన్నదమ్ముల అనుబంధం’గా వచ్చింది. అందులో ఎన్టీఆర్‌ చిన్న తమ్ముడి పాత్రను చంద్రమోహన్‌కి, పెద్ద తమ్ముడి పాత్రను మురళీమోహన్‌ను ఎంపిక చేశారు. కానీ చివరి నిమిషంలో ఎందుకో ఎన్టీఆర్‌ మనసు మార్చుకుని చంద్రమోహన్‌ను తప్పించి తన కొడుకు బాలకృష్ణను పెట్టారు. కానీ ఆ విషయం చంద్రమోహన్‌కి చెప్పలేదు. దీంతో ఆయన షూటింగ్‌కి వచ్చారు. తన పాత్ర బాలకృష్ణకు ఇచ్చారని, తనను పక్కన పెట్టారని అక్కడే తెలిసింది. దీన్ని చంద్రమోహన్‌ అవమానంగా భావించారు. చాలారోజులు ఎన్టీఆర్‌కి దూరంగానే ఉన్నారు. చివరి ఎన్టీఆర్‌తో చంద్రమోహన్‌ మధ్య ఆ దూరం కొనసాగింది. అందుకే వారిద్దరు కలిసి నటించిన సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఎప్పుడూ, ఎక్కడా చంద్రమోహన్‌ ఈ విషయంపై కామెంట్‌ చేయలేదు. 

అమితమైన తిండి ప్రియుడు

    చంద్రమోహన్‌ విపరీతమైన తిండి ప్రియుడు. భోజనం అంటే పడి చచ్చిపోయేవాడు. మామూలుగా అయితే ఫిట్‌నెస్, అందం కోసం సినిమా హీరోలు తక్కువగా తింటారు. కానీ చంద్రమోహన్‌ అందుకు విరుద్ధం. క్యారేజీలకు క్యారేజీలు లాగించేసేవారు. ఆయన శరీరతత్వం కూడా సహకరించింది. ఎంత తిన్నా ఆయన ఆహార్యంలో మార్పు వచ్చేది కాదు. షూటింగుల్లో ఆయనకు ఐదు పెద్ద డబ్బాల క్యారేజీ వచ్చేది. అదంతా శుభ్రంగా లాగించేవారు. అల్లూరి సీతారామరాజు సినిమా షూటింగ్‌ అడవుల్లో అవుట్‌డోర్‌లో జరిగినప్పుడు ఆయన తిండి చూసి అక్కడున్న వాళ్లు అవాక్కయ్యారట. బ్రేక్‌ఫాస్ట్‌లో 40 ఇడ్లీలు తినడం చూసి ఇతర నటులు మారు మాట్లాడలేదు. ‘ఆకాశంలో ఎగిరేవన్నీ తిన్నాను.. నేల మీద పాకేవన్నీ తిన్నాను.. నీళ్లలో ఈదేవన్నీ తిన్నాను’అని ఆయన సరదాగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పేవారు. 


హీరోయిన్ల సెంటిమెంట్‌ హీరో 

    మీ అభిమాన నటుడు ఎవరని జయసుధని అడిగితే ‘ఇంకెవరు చంద్రమోహన్‌’ అని ఆమె చాలాసార్లు చెప్పారు. జయసుధతో చంద్రమోహన్‌ 25 సినిమాల్లో హీరోగా నటించారు. చంద్రమోహన్‌ పక్కన నటిస్తే సూపర్‌ స్టార్లు అవుతారనే సెంటిమెంట్‌ హీరోయిన్లకు ఉండేది. అందుకే హీరోయిన్లు ఆయనతో నటించేందుకు పోటీ పడేవారు. వాణిశ్రీ, లక్ష్మి, జయసుధ, కవిత, సులక్షణ, సుహాసిని, రాధిక, విజయశాంతిలు ఆయనతో నటించాకే స్టార్‌ హీరోయిన్లుగా మారారు. ‘పదహారేళ్ల వయసు’ సినిమాలో చంద్రమోహన్‌తో నటించాక శ్రీదేవి మళ్లీ ఆయనతో నటించలేనంత పెద్ద హీరోయిన్‌ అయింది. 
 

Source From: chandramohan, ntr